2014లోనే ఇక్కడ రాజధానిని ఏర్పాటు చేస్తున్నామంటే నాటి ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అప్పుడే తనకు ఇష్టం లేదని చెప్పి వుంటే ఖచ్చితంగా రైతులు తమ భూములను ఇచ్చేందుకు ఇష్టపడేవారు కాదన్నారు జనసేన చీఫ్ పవన్ కల్యాణ్.

మంగళవారం తనను కలిసిన రాజధాని ప్రాంత రైతులతో పవన్ భేటీ అయ్యారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అప్పుడు లేని కులం ఇప్పుడు ఎందుకు వచ్చిందని పవన్ ప్రశ్నించారు.

తనకు చిన్నప్పటి నుంచి రైతుల కష్టాలు, భూమి విలువ తెలుసనన్నారు. ఎస్ఈజెడ్‌ల కోసం రైతుల భూములను సేకరించారని.. కాని వారికి సరైన పరిహారం చెల్లించడంలో మాత్రం ప్రభుత్వాలు విఫలమయ్యాయని పవన్ ఆరోపించారు.

తమ ప్రాంతం అభివృద్ధి చెందుతుందనే ఉద్దేశ్యంతో అమరావతి రైతులు భూములు ఇచ్చేశారని ఆయన గుర్తుచేశారు. ఊళ్ల కోసం రోడ్లు వేయడం చూశానని, కానీ రోడ్ల కోసం వూళ్లు తీసేయడం తాను ఎక్కడా చూడలేదన్నారు.

రైతు కన్నీరు దేశానికి మంచిది కాదని.. అభివృద్ధి విధ్వంసానికి దారి తీయకూడదని పవన్ హితవు పలికారు. అందరూ ఒప్పుకున్నాకే అమరావతిలో రాజధాని ఏర్పాటయ్యిందని.. రైతులకు నిరసన తెలిపే హక్కుందని ఆయన చెప్పారు.

భూముల్ని అస్తవ్యస్తంగా చేసి.. ఇప్పుడు వెనక్కి ఇస్తామనడం దారుణమని పవన్ మండిపడ్డారు. అమరావతి ఆడపడుచులు కన్నీరు పెడితే రాష్ట్రంలో మిగతా ఆడపడుచులు హర్షించరని పవన్ పేర్కొన్నారు.

రాజధాని ప్రాంత ఆడపడుచులకు జనసేన అండగా ఉంటుందని ఆయన హామీ ఇచ్చారు. తనది ఎప్పుడూ రైతుల పక్షమేనని.. దళిత రైతులపై అట్రాసిటీ కేసులు పెడుతున్నారంటే పోలీసుల్ని ఏమనాలని పవన్ నిలదీశారు.

రైతులపై అట్రాసిటీ కేసుల్ని వెంటనే ఉపసంహరించుకోవాలని పవన్ కల్యాణ్ డిమాండ్ చేశారు. ఏ ప్రభుత్వం వచ్చినా గత ప్రభుత్వ విధానాలు అమలు చేయాలని పవన్ స్పష్టం చేశారు. అమరావతి రాజధానిగా ఉండాలని బీజేపీ సంపూర్ణంగా కోరుకుంటోందని ఆయన వెల్లడించారు.