రుషికొండపై దేవుడుండాలి నేరగాళ్లు కాదు .. దెయ్యమై పట్టుకున్నాడు, జగన్‌ను మరోసారి భరించలేం : పవన్
ఏపీ సీఎం వైఎస్ జగన్‌పై తీవ్ర విమర్శలు చేశారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. జగన్ లాంటి వ్యక్తి దోపిడీ చేస్తాడని అందరికీ తెలుసునని.. కానీ ఆయనకు 151 మంది ఎమ్మెల్యేలు, 22 మంది ఎంపీలను ఇచ్చి గెలిపించారని ఆయన దుయ్యబట్టారు
వచ్చే ఎన్నికలలో గాజువాకలో జనసేన జెండా ఎగురుతుందన్నారు జనసేన అధినేత పవన్ కల్యాణ్ . ఆదివారం విశాఖ జిల్లా గాజువాకలో జరిగిన వారాహి విజయయాత్రలో ఆయన ప్రసంగిస్తూ.. ప్రశ్నించడానికే తాను హైదరాబాద్ నుంచి మంగళగిరికి మకాం మార్చానని తెలిపారు. అవసరమైతే విశాఖను తన రెండో ఇంటిగా మార్చుకుంటానని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. ఇక్కడి ప్రజాదరణ చూస్తుంటే తాను ఓడిపోయినట్లు భావించడం లేదని, గాజువాక తన నియోజకవర్గమని ఆయన వ్యాఖ్యానించారు.
ఎంతోమంది బలిదానాలతో విశాఖ స్టీల్ ప్లాంట్ ఏర్పాటైందని, తరాలు గడిచినా విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదాన్ని ప్రజలు గుండెల్లో పెట్టుకుంటారని ఆయన అన్నారు. స్టీల్ ప్లాంట్ కోసం ప్రజలు 26 వేల ఎకరాల భూములు ఇచ్చారని.. ఏళ్లు గడుస్తున్నా వారిలో సగం మందికి కూడా పరిహారం అందలేదన్నారు. దీంతో వీరంతా రోడ్డున పడ్డారని.. కొందరు గుడిలో ప్రసాదాలు తిని జీవితాన్ని సాగిస్తున్నారని పవన్ కల్యాణ్ ఆవేదన వ్యక్తం చేశారు.
జగన్ లాంటి వ్యక్తి దోపిడీ చేస్తాడని అందరికీ తెలుసునని.. కానీ ఆయనకు 151 మంది ఎమ్మెల్యేలు, 22 మంది ఎంపీలను ఇచ్చి గెలిపించారని ఆయన దుయ్యబట్టారు. జగన్ అధికారంలోకి వచ్చి నెల తిరగకుండానే 30 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులు రోడ్డున పడ్డారని, 30 మంది ఆత్మహత్య చేసుకున్నారని పవన్ కల్యాణ్ గుర్తుచేశారు. ఓడిపోయిన తర్వాత విశాఖ వస్తే జనం ట్రీట్‌మెంట్ ఎలా వుంటుందోనని భయపడ్డానని, కానీ లక్షలాది మంది తనకు స్వాగతం పలికారని ఆయన తెలిపారు.
విశాఖ స్టీల్ ప్లాంట్‌తో ఇంతటి అనుబంధం, భావోద్వేగం వుంటే జగన్ మాత్రం ప్రైవేటీకరణ ఆపాలంటూ ఒక్క మాట కూడా మాట్లాడలేదని పవన్ ఎద్దేవా చేశారు. ప్రశ్నించలేనప్పుడు రాజకీయాలు అవసరమా అంటూ ముఖ్యమంత్రిని ప్రశ్నించారు. రౌడీ ఎంపీని ఎన్నుకుంటే, కేసులున్న వారిని గెలిపిస్తే వాళ్లెందుకు మాట్లాడతారని పవన్ నిలదీశారు. రాష్ట్ర సమస్యలపై తాను మాట్లాడితే ప్రధాని వింటారని, కానీ తనకు ఎంపీలుంటే ఇంకా బలంగా నిలబడేవాడినని ఆయన తెలిపారు. 2018లో ఇప్పటి స్థానిక ఎంపీపై రౌడీషీట్ వుందని పవన్ చెప్పారు. స్టీల్ ప్లాంట్ కోసం వైసీపీ నేతలు పార్లమెంట్‌లో ప్లకార్డులు పెట్టుకుని పోరాడగలరా.. తాను ఢిల్లీ పెద్దల కాళ్లు పట్టుకోగలననని ఆయన తెలిపారు.
ఆంధ్రా ఎంపీలంటే ఢిల్లీలో చులకన భావమని.. వీళ్లు దోచేస్తారని కేంద్ర పెద్దలకు తెలుసునని పవన్ కళ్యాణ్ ఎద్దేవా చేశారు. జనసేన తరపున ఎంపీ లేకపోయినా స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేటీకరించొద్దని అమిత్ షాకు చెప్పానని పవన్ అన్నారు. స్టీల్ ప్లాంట్‌కు సొంత గనులు కేటాయించాలని తాను కోరానని ఆయన తెలిపారు. వచ్చే ఎన్నికల్లో ఆలోచించి ఓటు వేయాలని సూచించారు. వైఎస్ హయాంలో పోలీసు కాల్పుల్లో మత్స్యకారులను చంపి గంగవరం పోర్ట్ నిర్మించారని.. కానీ, పోర్ట్ నిర్వాసితులకు ఇంత వరకు సాయం అందలేదన్నారు. గంగవరం పోర్టు లాభాల్లో వున్నప్పటికీ అక్కడి ఉద్యోగులకు వేతనాలు చెల్లించడం లేదన్నారు. జగన్‌ను ఇంకో ఆరు నెలలు భరించాలని.. ఆస్తులు అమ్ముకునేందుకు, తాకట్టు పెట్టుకునేందుకా జగన్‌ను సీఎంగా ఎన్నుకుంది అని పవన్ నిలదీశారు.
విశాఖ ఎంపీ వ్యాపారాల్లో ఎవరైనా పెట్టుబడులు పెడితే నష్టపోతారని.. సిరిపురం జంక్షన్‌లో నాలుగు అంతస్తులకు పర్మిషన్ తీసుకుని 24 అంతస్తుల భవనాలు నిర్మిస్తున్నారని ఆయన ఆరోపించారు. జనసేన ప్రభుత్వం రాగానే అక్రమ నిర్మాణాలను కూల్చేస్తామని పవన్ హెచ్చరించారు. రుషికొండపై ప్రజలు వుండాలి కానీ..నేరగాళ్లు కాదంటూ చురకలంటించారు. విశాఖ ప్రజలను దోచుకునేందుకు ఎంవీవీ సత్యనారాయణ ఎంపీ అయ్యారా అని ఆయన ఎద్దేవా చేశారు. జగన్‌ను దేవుడు అనుకుని మొక్కామని.. కానీ దెయ్యమై పట్టుకున్నాడని పవన్ సెటైర్లు వేశారు. జగన్‌ను మరోసారి సీఎంగా భరించలేమన్నారు.