జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. టీడీపీకి జనసేన  పార్టీ బీ టీమ్ అని విమర్శించడంపై స్పందించిన పవన్ కల్యాణ్.. తొలుత తమ పార్టీ వాళ్లే సందేహిస్తున్నారని అన్నారు

జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. టీడీపీకి జనసేన పార్టీ బీ టీమ్ అని విమర్శించడంపై స్పందించిన పవన్ కల్యాణ్.. తొలుత తమ పార్టీ వాళ్లే సందేహిస్తున్నారని అన్నారు. వైసీపీ విమర్శలు చేయడం వేరని.. కానీ సొంత పార్టీ వాళ్లే సందేహించడం తనకు ఇబ్బందిగా అనిపిస్తోందని అన్నారు. తాడేపల్లిగూడెంలో జనసేన నాయకులు, కార్యకర్తలతో పవన్ కల్యాణ్ మాట్లాడుతూ.. మధ్య తరగతి మనస్థత్వం నుంచి బయటకు రావాలని.. ఎంతసేపు కూర్చొని భయపడవద్దని పిలుపునిచ్చారు. 

రాజకీయాల్లోకి రావడం తనకు సరదా కాదని.. బాధ్యతతో వచ్చానని చెప్పారు. ఎక్కువ మంది రాజకీయాల్లోకి రావాలని అన్నారు. తెలంగాణలో వైఎస్ షర్మిల పార్టీ పెట్టడాన్ని కూడా తాను స్వాగతించానని చెప్పారు. పార్టీని నడిపేందుకు వేల కోట్లు ఉంటే సరిపోదని చెప్పారు. సైద్దాంతిక బలం, పోరాట పటిమ, రాజ్యాంగం అవగాహన.. ఇలా బలంగా ఉండి నమ్మకం సంపాదించుకోవాలని అన్నారు. 

‘‘ఎప్పుడూ బయటివాళ్లు మనల్ని కొట్టరు. లోపలి నుంచే మనల్ని కొడతారు. బయటివాడు కొట్టడానికి లోపలివాడే తలుపు తెరవాలి. అది ఆఫీసు సంబంధించి కావొచ్చు.. పార్టీకి సంబంధించి కావొచ్చు. వైసీపీ వాళ్లు మనల్ని టీడీపీకి బీ టీమ్ అని విమర్శించారు. అలాంటి వాటిని బయటివాళ్లు అనడం వేరు.. మనం నమ్మడం వేరు. ముందుగా మనవాళ్లు నన్ను సందేహిస్తారు.. అది నాకు ఇబ్బంది అనిపిస్తోంది. అబద్దాలు చెప్పాల్సిన అవసరం నాకు ఏముంది?. పండ్లున్న చెట్టుపైనే రాళ్లు పడతాయి. మనమీద ఇన్ని దాడులు చేస్తున్నారంటే బలంగా ఉన్నామని అర్థం. సోషల్ మీడియాలో ఎలాంటి విమర్శలు వచ్చిన తొలుత ఎదురుదాడి చేయడం నెర్చుకోవాలి’’ అని పవన్ కల్యాణ్ అన్నారు.