అమరావతి: జ‌న‌సేన పార్టీకి వ‌చ్చిన ప్ర‌తి ఓటు నాలుగు ఓట్ల‌తో స‌మానమ‌ని అది ప్రతికూల పరిస్థితుల్లో డబ్బుకీ, సారాకి లొంగకుండా వేసిన ఓటు అని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. జ‌న‌సేన పార్టీకి వేసిన ప్ర‌తి ఒక్కరికి తాను అండగా నిలబడతానని తన చివరి శ్వాస వరకు వారి కోసమే ఉంటానని స్పష్టం చేశారు. 

మంగ‌ళ‌గిరిలోని పార్టీ కేంద్ర కార్యాల‌యంలో కాకినాడ పార్ల‌మెంట‌రీ నియోజ‌క‌వ‌ర్గ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌ల స‌మావేశంలో పాల్గొన్న పవన్ కళ్యాణ్ కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ఏమీ ఆశించ‌కుండా పార్టీ కోసం ప‌ని చేసిన ప్ర‌తి ఒక్క‌రి కోసం నిల‌బ‌డ‌తానని హామీ ఇచ్చారు.  

తన కుటుంబం గొప్ప కుటుంబం కావాలన్నది తన లక్ష్యం కాదని ప్రజలు గొప్పవారు  కావాలన్నదే తన ఆశ అని చెప్పుకొచ్చారు. రాబోయే రోజుల్లో కొత్త నాయకత్వాన్ని తీసుకువస్తానని చెప్పుకొచ్చారు. 

 స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో గెలుపే ధ్యేయంగా ప్రతీ కార్యకర్త పనిచేయాలని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. సర్పంచ్‌లుగా, వార్డు మెంబ‌ర్లుగా పోటీ చేయ‌డానికి కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని సూచించారు. 

మండ‌ల స్థాయి క‌మిటీలు, గ్రామ స్థాయి క‌మిటీలు, బూత్ స్థాయి క‌మిటీల‌కు సంబంధించిన బాధ్య‌త‌లు తీసుకున్న వారు గట్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. అక్టోబ‌ర్ నుంచి క్షేత్ర‌స్థాయిలో ప‌ర్య‌టిస్తానని చెప్పుకొచ్చారు. 

పార్టీ ఓట‌మి వల్ల తానేమీ ఇబ్బంది పడటం లేదని అన్నారు. జనంలోకి వెళ్లేందుకు ఎందుకు బయపడాలని పవన్ అన్నారు. జనసేన నాయకులు ఏమైనా ఘోరాలు చేశారా...నేరాలు చేశారా అంటూ నిలదీశారు. జనసేన పార్టీ ఆశయాల కోసం పనిచేద్దామని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. 

ఎదగాలనే ఉద్దేశంతో టీడీపీకి, బీజేపీకి మద్దతు ఇచ్చా: పవన్
2014 ఎన్నిక‌ల్లో టీడీపీ, బీజేపీల‌కు మ‌ద్ద‌తు ఇచ్చింది ఒంటరిగా పోటీ చేసి గెలవలేక కాదని పార్టీని మరింత విస్తృత పరచాలనే ఉద్దేశంతో అప్పుడు పోటీ చేయలేదని పవన్ చెప్పుకొచ్చారు.  

అంచెలంచెలుగా ఎద‌గాల‌ని భావించానని, ప‌సి బిడ్డ‌కి పంచ భ‌క్ష్యాలు పెడితే అర‌గ‌దు కదా అంటూ చెప్పుకొచ్చారు. ఇటీవల  జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో పార్టీ ఓటమికి ఎన్నో కారణాలు ఉన్నాయనన్నారు. 

జనసేన పార్టీ కార్యకర్తలు ఎప్పుడూ నలుగురు బలమైన ప్రత్యర్థులను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. టీడీపీ, వైసీపీ, బీజేపీల‌తో ప్ర‌త్య‌క్షంగా యుద్ధం చేస్తే, టిఆర్ఎస్‌తో ప‌రోక్షంగా పోరాడాల్సిన అవసరం ఉందన్నారు. 

జ‌న‌సేన‌లోకి వ‌చ్చిన చాలా మంది వ్య‌క్తులు నా బ‌లాన్ని వారి బ‌లంగా చెప్పేవారని అలాంటి వ్య‌క్తుల మ‌ధ్య తాను చాలా న‌లిగిపోయానని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. వ్య‌వ‌స్థ‌ను న‌డ‌పాలి అంటే ప‌ది మంది నాయ‌కులు కావాలని వారు న‌చ్చ‌లేదు వీరు న‌చ్చ‌లేదు అంటే కుద‌ర‌దన్నారు. 

విలువ‌లు కోల్పోయిన నాయ‌కులంతా ఇష్టం వ‌చ్చిన‌ట్టు తిట్టుకుంటున్న స‌భ‌లో కూర్చోవాలి అంటే మ‌న‌కీ బ‌లం ఉండాలని తెలిపారు. అందుకోసం అంద‌రినీ క‌లుపుకుని వెళ్లాల్సిన అవ‌స‌రం ఉందని పవన్ దిశానిర్దేశం చేశారు. 

అర్జెంట్ గా ముఖ్యమంత్రి కావాలని లేదు: పవన్ 
జనసేన పార్టీ కార్యకర్తలకు తాను నిత్యం అందుబాటులో ఉండటం కష్టం అయి ఉండొచ్చన్న పవన్ కళ్యాణ్ త్వరలోనే ఒక కో ఆర్డినేషన్ కమిటీ వేయబోతున్నట్లు తెలిపారు. ఆ కో ఆర్డినేషన్ కమిటీకి తన సోదరుడు నాగబాబును ఇంచార్జ్ గా నియమించనున్నట్లు పవన్ తెలిపారు. 

పార్టీ పరంగా ఎలాంటి సమస్యలు ఉన్నా, అది కమిటీలో కానీ ఇంకా ఏ విషయాల్లోనైనా సమస్యలు ఉంటే వాటి పరిష్కారం కోసం నాగబాబును సంప్రదించాలని పవన్ సూచించారు.  క‌మిటీల్లో అన్ని కులాల వారికి బ‌ల‌మైన ప్రాతినిధ్యం క‌ల్పించాలని సూచించారు. 

పార్టీ కోసం క‌ష్ట‌ప‌డిన ప్ర‌తి ఒక్క‌రికీ, వీర మ‌హిళ‌ల‌తో స‌హా అంద‌రికీ పార్టీలో స‌ముచిత స్థానం, గౌర‌వం ఇచ్చేలా పార్టీ నిర్మాణాన్ని ముందుకు తీసుకువెళ్దామని చెప్పుకొచ్చారు. ప్ర‌తి పార్ల‌మెంట్ ఒక జిల్లా కాబోతుంది. 

రాష్ట్ర విభ‌జ‌న స‌మ‌యంలోనే జిల్లాల ఇంచార్జ్ లను నియమించాలని ఉండేదని అయితే వేయలేకపోయామని ఇప్పుడు వేయాలని ఉన్నా జిల్లాలు పెరుగుతున్న నేపథ్యంలో కాస్త వాయిదా వేస్తున్నట్లు పవన్ స్పష్టం చేశారు.  

అర్జెంట్‌గా తనకు ముఖ్య‌మంత్రి అవ్వాల‌న్న ఆలోచ‌న లేదని పవన్ కళ్యాన్ మరోసారి స్పష్టం చేశారు. జనసేన పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడమే తన లక్ష్యమన్నారు. పార్టీని ముందుకు తీసుకువెళ్లాలంటే వ్య‌క్తిగ‌త అజెండాలు వ‌దిలేయాలని సూచించారు. 

అందరికీ తాను కావాలని కానీ పని మాత్రం వ్యక్తిగత అజెండాలతో చేస్తారంటూ పవన్ అసహనం వ్యక్తం చేశారు. పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. ఒక వ్యవస్తను నడిపించేందుకు కాస్త సమయం పడుతుందని అది తనకు బాగా తెలుసునన్నారు.  

తాను స్థిరంగా, బ‌లంగా పార్టీని ముందుకు తీసుకువెళ్తానని కార్యకర్తలకు తెలియజేశారు. ఆఖ‌రిశ్వాస వ‌ర‌కు పార్టీతోనే ఉంటానని స్పష్టం చేశారు. తాను ముఖ్యమంత్రి కావాలని కోరుకోవడం లేదని కేవ‌లం రాష్ట్రం బాగుండాలి అని మాత్ర‌మే కోరుకుంటున్నట్లు తెలిపారు. 

రాష్ట్రం ఏమైపోతుందోన‌న్న భ‌యంతోనే జనసేన పార్టీని స్థాపించినట్లు పవన్ కళ్యాణ్ తెలిపారు. వైసీపీ ప్ర‌భుత్వం ప్ర‌జ‌ల‌కు మంచి చేస్తే హ‌ర్షిస్తాం. ప్ర‌జ‌ల‌ను ఇబ్బందులు పెడితే మాత్రం చూస్తూ ఊరుకోనని హెచ్చరించారు. 

వైసీపీకి డెడ్ లైన్ 100 రోజులేనన్న పవన్:
తాను మొద‌టి రోజే చెప్పానని కొత్త ప్ర‌భుత్వానికి 100 రోజులు స‌మ‌యం ఇద్దాం అని ఆ త‌ర్వాత త‌ప్పులు ఉంటే ప్ర‌శ్నిద్దాం అని పవన్ కళ్యాణ్ తెలిపారు. ఉద‌యం మార్గం మ‌ధ్య‌లో భ‌వ‌న నిర్మాణ కార్మికులు వారి స‌మ‌స్య‌లు తన దృష్టికి తీసుకువ‌చ్చారని పవన్ తెలిపారు. 

100 రోజులు మాట్లాడ‌రాద‌ని నిర్ణ‌యించుకున్నా, వారి క‌ష్టాలు తనను క‌దిలించి వేశాయని అందువల్లే ప్రభుత్వానికి లేఖ రాసినట్లు తెలిపారు. గ‌తంలో రైతులు విత్త‌నాల కొర‌త‌తో ఇబ్బంది ప‌డుతున్న‌ప్పుడు ఒక లేఖ రాశామని ఇది రెండో లేఖ అని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు.  

టెంట్లు వేసుకుని అయినా పార్టీని నడుపుతా: పవన్ స్పష్టత
 
జనసేన పార్టీని టెంట్లు వేసుకుని అయినా న‌డుపుతానని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. తన మొద‌టి సినిమా ఫెయిల్ అవ‌గానే ఉద్యోగం చేసుకోమంటూ కొంద‌రు స‌ల‌హా ఇచ్చారని గుర్తు చేశారు. అయితే ఓడిన చోటే వెతుక్కుంటూ వెళ్లానని అదే ఈ స్థాయిలో నిలబెట్టిందన్నారు. 

రాష్ట్రంలో వైసీపీ ఘన విజయం సాధించినా, జ‌న‌సేన పార్టీకి ఘోర ప‌రాజయం ఎదురైనా తాను ఎక్కడికీ వెళ్లేది లేదని ఇక్కడే ఉంటానని చెప్పుకొచ్చారు. గెలిచే వ‌ర‌కు పోరాటం చేస్తూనే ఉంటానన్నారు.  

ఎన్నిక‌ల్లో  ఓట‌మి అనంత‌రం తనను ఎంతో మంది పార్టీని నడపగలరా అని ప్రశ్నించారని గుర్తు చేశారు. ఒక సినిమా తీస్తే పార్టీ సంవ‌త్స‌రం న‌డుస్తుంది. స్వ‌శ‌క్తితో ఇక్క‌డి వ‌ర‌కు వ‌చ్చానని తెలిపారు. 

తన తండ్రి సిఎం కాదు ఇన్‌స్టెంట్‌గా తనకు అన్నీ వ‌చ్చేయ‌డానికి అంటూ చెప్పుకొచ్చారు. అయినా ఇంత ఆఫీస్ నిర్మించాం అంటే అందంతా తమ క‌ష్టమేనని చెప్పుకొచ్చారు. పార్టీని న‌డ‌పడం కూడా చాలా క‌ష్టమని పవన్ తెలిపారు. దానికి ఎన్నో మాట‌లు ప‌డాలి. దెబ్బ‌లు తినాలి. వాట‌న్నింటికీ తాను సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. 

దేశ వ్యాప్తంగా శ‌క్తివంత‌మైన పార్టీగా ఉన్న బీజేపీకే రాష్ట్రంలో ఒక్క శాతం ఓటు వ‌చ్చింది. అలాంటిది జనసేన పార్టీ ఇంత వరకు వచ్చిందంటే అది చాలా గొప్ప విషయమని కొనియాడారు. ఆఫీస్ ఉంటుందా, పార్టీ న‌డుపుతారా.? అంటూ గేలి చేస్తున్నారు. తాము ఎవ‌రినీ డబ్బులేం అడ‌గ‌లేదే. అవ‌స‌రం అయితే టెంట్లు వేసుకుని పార్టీని న‌డుపుతామని పవన్ తెలిపారు. 

తాను వ‌చ్చింది ఒక ప‌టిష్ట‌మైన సామాజిక వ్య‌వ‌స్థ‌ని నిల‌బెట్ట‌డానికేనని చెప్పుకొచ్చారు. తన ఒక్క‌డి గుర్తింపు కోస‌మే అయితే ఆ రోజు అన్న‌య్య‌గారితో పాటు వెళ్లిపోయే వాడిననని చెప్పుకొచ్చారు. అస‌లు పార్టీని విలీనం చేయ‌నిచ్చే వాడినే కాదనన్నారు. 

అప్ప‌ట్లో ఎన్టీఆర్ పార్టీ పెట్టిన‌ప్పుడు బ‌ల‌మైన నాయ‌కుల మ‌ద్ద‌తు ల‌భించిందని కానీ జ‌న‌సేన పార్టీకి మాత్రం పెద్ద పెద్ద నాయ‌కులు ఎవ‌రూ లేరన్నారు. చిన్న చిన్న వ్య‌క్తులు, తానంటే ఇష్ట‌ప‌డి వ‌చ్చిన జ‌న‌సైనికులు మాత్ర‌మే తనతో ఉన్నారని తెలిపారు. స‌మాజం మారాలి అన్న ల‌క్ష్యంతోనే పార్టీ స్థాపించానని పవన్ కళ్యాణ్ తెలిపారు.