జీ20 సమ్మిట్‌లో మోడీ బిజీ .. టైం చూసి చంద్రబాబు అరెస్ట్, వైసీపీకి సినీ పరిశ్రమ భయపడుతోంది : పవన్
జీ20లో బీజేపీ నేతలు బిజీగా వున్నందున.. తానే పొత్తు గురించి ప్రకటన చేసినట్లు స్పష్టం చేశారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. వైసీపీ వాళ్లు టార్గెట్ చేస్తారనే సినీ ప్రముఖులు చంద్రబాబు అరెస్ట్‌పై స్పందించడం లేదన్నారు.
జీ20లో బీజేపీ నేతలు బిజీగా వున్నందున.. తానే పొత్తు గురించి ప్రకటన చేసినట్లు స్పష్టం చేశారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మోడీ జీ20 ప్రోగ్రామ్‌లో బిజీగా వున్నప్పుడు.. చంద్రబాబును అరెస్ట్ చేశారని పవన్ ఆరోపించారు. వైసీపీ ఎంపీలు 30 మంది వున్నారని.. వాళ్లు ఢిల్లీకి వెళ్లి క్యాషూ బోర్డ్, కోకనట్ బోర్డు గురించి అడగాలని ఆయన ప్రశ్నించారు. అంతేకానీ మీపై వున్న కేసులు వాయిదా వేయించుకోవడం కాదని పవన్ చురకలంటించారు.
వైసీపీ వ్యతిరేక ఓటు చీలకూడదన్నదే తన లక్ష్యమని .. ఢిల్లీలో బీజేపీ నేతలతో కూడా ఇదే విషయం చెప్పానని జనసేనాని స్పష్టం చేశారు. తాము ఎన్ని చోట్ల పోటీ చేస్తాం.. ఎవరితో పొత్తు పెట్టుకుంటామనేది మీకు అనవసరమని వైసీపీ నేతలకు చురకలంటించారు. చంద్రబాబును అరెస్ట్ చేసిన రోజున తన కార్యక్రమాల కోసం వెళ్తుంటే తనను ఆపేశారని పవన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీతో సమన్వయం కోసం ఐదుగురితో జనసేన పార్టీ కమిటీ వేసిందన్నారు. తెలంగాణకు ఇచ్చిన వరాలు.. ఏపీకి ఎందుకు ఇవ్వలేదని ఢిల్లీకి వెళ్లి అడగాలని ఆయన దుయ్యబట్టారు. టీడీపీతో పొత్తు పెట్టుకున్నాకే ఈ కూటమిపై ప్రజలకు భరోసా వచ్చిందని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీకి మద్ధతు పలికామన్నారు.
Also Read: "ఎన్డీయేలోనే ఉన్నా.. ఒకవేళ బయటకు వస్తే నేనే.. తెలియజేస్తా...": పవన్ కళ్యాణ్ సంచలన ప్రకటన
రాష్ట్ర విభజన సరిగా లేదని పవన్ పేర్కొన్నారు. పది కోట్ల మందికి సంబంధించిన వ్యవహారాన్ని నాలుగు గోడల మధ్య, తలుపులు మూసేసి బిల్లు పాస్ చేశారని ఆయన దుయ్యబట్టారు. జగన్ తన మీద తానే దాడి చేయించుకున్న మానసిక రోగి అని పవన్ మండిపడ్డారు. సొంత బాబాయ్ మరణం విషయంలోనూ అబద్ధాలు చెప్పారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. సినీ పరిశ్రమ చాలా సున్నితమైనదని.. వైసీపీ వాళ్లు టార్గెట్ చేస్తారనే సినీ ప్రముఖులు చంద్రబాబు అరెస్ట్‌పై స్పందించడం లేదన్నారు.