రాజకీయాల్లో ఎప్పుడూ శాశ్వత శత్రవులు, శాశ్వత మిత్రులు వుండరని.. జనసేన కమ్యూనిస్టులతో, బీజేపీతో, టీడీపీతో ఎవరితో కలిసినా అది రాష్ట్ర ప్రజలకు మేలు చేయడానికేనని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు.
అసెంబ్లీ, సార్వత్రిక ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న నేపథ్యంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ దూకుడు పెంచారు. ఇప్పటికే వారాహి విజయ యాత్ర పేరిట ప్రజల్లోకి వెళ్లిన ఆయన.. ప్రచారం, అభ్యర్ధుల ఎంపికపైనా సీరియస్‌గా దృష్టి పెట్టారు. తాజాగా జనసేన అధికార ప్రతినిధులతో శనివారం పవన్ కల్యాణ్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వ్యక్తిగత అభిప్రాయాలు, దూషణలకు జనసేనలో తావు లేదన్నారు. టీడీపీతో పొత్తు, వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.
ఎన్నికలు, మతాల గురించి మాట్లాడాల్సినప్పుడు రాజ్యాంగానికి లోబడి మాత్రమే మాట్లాడాలని జనసేనాని పేర్కొన్నారు. టీవీల్లో చర్చలకు వెళ్లేవారు రాజకీయాలు, సమకాలీన అంశాలు, ప్రజా సమస్యలపై లోతుగా అధ్యయనం చేయాలన్నారు. అనవసర విషయాలు, వ్యక్తిగత దూషణలు వుండకూడదని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. సోషల్ మీడియాకు అనవసరమైన ఇంటర్వ్యూలు ఇవ్వొద్దని పవన్ అన్నారు.
Also Read: గవర్నమెంట్ స్కూల్ విద్యార్ధులతో ఇంగ్లీష్‌లో మాట్లాడగలావా : పవన్‌కు మంత్రి ఆదిమూలపు సురేష్ సవాల్
పార్టీ ప్రతినిధిగా వుంటూ సోషల్ మీడియాలో వ్యక్తిగత పోస్టులు పెట్టొద్దని ఆయన హితవు పలికారు. తన సినిమాలు, తన కుటుంబ సభ్యులపై వచ్చే విమర్శలపైనా స్పందించొద్దని ఆయన చెప్పారు. రాజకీయాల్లో ఎప్పుడూ శాశ్వత శత్రవులు, శాశ్వత మిత్రులు వుండరని.. జనసేన కమ్యూనిస్టులతో, బీజేపీతో, టీడీపీతో ఎవరితో కలిసినా అది రాష్ట్ర ప్రజలకు మేలు చేయడానికేనని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. ఏ రాజకీయ పార్టీకి, ఏ నాయకుడికీ తాను వ్యతిరేకం కాదని ఆయన తేల్చిచెప్పారు. చర్చల్లో పాల్గొనేవారు కూడా సుహృద్భావ వాతావరణంలో చర్చలు చేసి, చర్చలు పూర్తవ్వగానే మంచిగా పలుకరించుకునేలా వుండాలని పవన్ కల్యాణ్ సూచించారు.
