హైదరాబాద్: అఖిలభారత చిరంజీవి యువత ఆధ్వర్యంలో జరిగిన మెగాస్టార్ చిరంజీవి 64వ పుట్టిన రోజు వేడుకల్లో జనసేన పార్టీ అధినేత, చిరంజీవి సోదరుడు పవన్ కళ్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తనకు తన సోదరుడు చిరంజీవి స్ఫూర్తి ప్రధాత అని చెప్పుకొచ్చారు. 

ఇంటర్ ఫెయిల్ అయినప్పుడు తనలో నిరాశ, నిస్పృహలు పెరిగిపోయాయని చెప్పుకొచ్చారు. ఆ సమయంలో అన్నయ్య వద్ద ఉన్న లైసెన్స్ డ్ గన్ తో  కాల్చుకుని చనిపోదామనుకున్నానని చెప్పుకొచ్చారు. కానీ ఆరోజు తన అన్నయ్య చెప్పిన మాటలు తనలో ధైర్యాన్ని నింపాయన్నారు. అందుకే తన సోదరుడు తనకు స్ఫూర్తి ప్రధాత అంటూ కొనియాడారు. 

ఇకపోతే ఈ మధ్య తెలంగాణలో ఇంటర్మీడియట్ విద్యార్థులు పదుల సంఖ్యలో చనిపోయినప్పుడు చాలా బాధేసిందన్నారు. వారికి అన్నయ్యలాంటి వారు ధైర్యం చెప్పి ఉంటే ఇలా జరిగేది కాదేమో అని పవన్ స్పష్టం చేశారు. యుక్తవయస్సులో ఉన్నప్పుడు ఎవరైనా ఏమైనా అంటే ఆవేశంతో ఊగిపోయేవాడినని చెప్పుకొచ్చారు. 

తన కోపాన్ని చూసి అన్నయ్య చిరంజీవి వీడు ఉద్యమకారుడు అయిపోతాడేమో అనుకుని కులం మతం అనే వాటిని దాటి మానవత్వం అనేది ఒకటి ఉంటుంది. దాన్ని నీ ఉద్యమంలో ఆలోచనలో మరచిపోకు అన్నారని గుర్తు చేశారు. హద్దులు దాటకుండా తనను ఆపేసిన మాటలు అవి అని చెప్పుకొచ్చారు. 

22ఏళ్లు వయస్సులో తిరుపతిలో నిర్మాత తిరుపతి ప్రసాద్ యోగాశ్రమం పెడితే తాను వెళ్లిపోయి ఐదు నెలలు అక్కడే ఉన్నట్లు చెప్పుకొచ్చారు. ఇక యోగాశ్రమంలో ఉండిపోతానని తన అన్నయ్య చిరంజీవికి చెప్తే భగవంతుడివై వెళ్లిపోతే ఎలా అంటూ ప్రశ్నించారని గుర్తు చేశారు. 

సమాజానికి ఎందుకు ఉపయోగపడలేవ్..ఇంట్లో బాధ్యతలు అనేవి ఉంటే ఇలా మాట్లాడవు అని అన్న మాటలు తనను ఎంతో కదిలించాయని చెప్పుకొచ్చారు. ఎన్నో కష్టనష్టాలను చూసిన తర్వాతే ఈరోజు ప్రజల ముందు నిల్చున్నానని పవన్ ఆవేశంగా చెప్పుకొచ్చారు. 

తనకు ఇద్దరు ఇష్టమైన వ్యక్తులు ఉన్నారని వారిలో ఒకరు తన అన్నయ్య చిరంజీవి కాగా మరోకరు అమితాబ్ బచ్చన్ అని చెప్పుకొచ్చారు. సైరా సినిమా ద్వారా ఇద్దరిని కలిసే అవకాశం దక్కడం సంతోషంగా ఉందన్నారు పవన్ కళ్యాణ్. 

జనసేన పార్టీ పెట్టిన తర్వాత సినిమాలకి, సినీ అభిమానులకు దూరంగా ఉంటున్న పవన్ కళ్యాణ్ ఒక్కసారిగా మెగాస్టార్ చిరంజీవి బర్త్ డే సెలబ్రేషన్స్ కి హాజరు కావడంతో మెగా అభిమానులు తెగ సంబరపడిపోయారు.