నేను ప్రజలకు మాత్రమే దత్తపుత్రుణ్ణి.. పవన్ కళ్యాణ్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వ్యాఖ్యలను జనసేన అధినేత తిప్పికొట్టారు. తాను ఎవ్వరికీ దత్తపుత్రుడిని కాదని.. ప్రజలకు మాత్రమే దత్తపుత్రుడినని చెప్పుకొచ్చారు. జనసేన పార్టీ సోషల్ మీడియా విభాగానికి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన పలు ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు.
విజయవాడ : ‘Chandrababu Naidu దత్తపుత్రుడు, కామ్రేడ్లకు సమ్మెలు కావాలి’ అంటూ ఏపీ ముఖ్యమంత్రి YS Jagan చేసిన వ్యాఖ్యలపై janasena అధినేత pawan kalyan తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఉద్యోగుల సమస్య విపక్షాలు సృష్టించింది కాదన్నారు. తాము ఏం చేసినా డూడూ బసవన్నలా తలూపాలని YCP governament అనుకొంటోందన్నారు. అందుకు భిన్నంగా ఉంటే సుప్రీంకోర్టు న్యాయమూర్తుల నుంచి ఉపాధ్యాయులు వరకూ అందరినీ శత్రువులుగా చూస్తున్నారు.
ఉపాధ్యాయులు నల్ల బ్యాడ్జీలు ధరించి విధులకు వెళ్ళడం ముమ్మాటికీ ప్రభుత్వ వైఫల్యమే అని మండిపడ్డారు. తెలుగు రాష్ట్రాల శ్రేయస్సు... అభివృద్ధి కాంక్షిస్తూ ‘అనుష్టుప్ నారసింహ దర్శన యాత్ర’ చేస్తానని పేర్కొన్నారు. తాను ప్రజలకు మాత్రమే దత్తపుత్రుడినని.. ఏ రాజకీయ పార్టీతో ముడిపెట్టి మాట్లాడడం సరికాదన్నారు. ఉద్యోగులకు చాలా ఆశలు కల్పించి.. ఇవ్వకపోతే వాళ్లకు కోపం వచ్చి.. లక్షలాది మంది రోడ్ల మీదికి వచ్చి నిరసనలు తెలిపితే.. దానికి జనసేనను, ఇతర పార్టీలను అనడం సరికాదన్నారు.
వైసీపీ నాయకులు, ప్రభుత్వానికి, అధినాయకత్వానికి వారిని ఎవ్వరూ ఏమీ అనకూడదు.. తాము ఏం చేసినా అందరూ డూడూ బసవన్నలా తలూపి ముందుకు వెళ్లాలి.. అలా కాదంటే సుప్రీంకోర్టు న్యాయమూర్తుల దగ్గరి నుంచి నల్లబ్యాడ్జ్ కట్టుకున్న ఉపాధ్యాయులు వరకూ అందరినీ శత్రువులుగా కనిపిస్తారు. న్యాయంగా హక్కుల గురించి అడిగితే... పద్ధతిగా చేస్తే రోడ్ల మీదికి ఎందుకు వస్తారు. మీ మంత్రివర్గం మొత్తం రెచ్చగొట్టేలా మాట్లాడతారేం?
టీచర్లు నల్లబ్యాడ్జ్ ధరించి విధులకు హాజరవుతుంటే అది మీ వైఫల్యాన్ని సూచిస్తుంది. దానికి మమ్మల్నంటే ప్రయోజనం ఏంటీ.. వెటకారాలు చేసి లాభం లేదు. ముందు మీరు వెటకారాలాపి పని చూడండి. పనికొచ్చే మాటలు మాట్లాడడండి.. అదొక్కటే మేము కోరుకునేది అన్నారు.
ఉద్యోగలు పీఆర్సీ మీద ప్రభుత్వ ఆధిపత్య ధోరణితో సాగిందన్న పవన్ కల్యాణ్ వ్యాఖ్యలమీద ప్రభుత్వ సలహాదారు సజ్జల విరుచుకుపడ్డారు. దీని మీద పవన్ వివరణ ఇస్తూ.. ప్రభుత్వ సలహాదారు సజ్జలగారూ.. నా కామెంట్స్ ఇబ్బందికలిగించినట్టుగా మాట్లాడుతున్నారు. ఆధిపత్య ధోరణి అని ఎందుకు అన్నానంటే.. ఎస్మా ప్రకటిస్తామని, రెచ్చగొట్టేలా మాట్లాడితే.. అది వేరే రకంగా పోతుందని అలా మాట్లాడాను తప్ప వక్రీకరించవద్దని కోరుతున్నాననన్నారు.
ఇదిలా ఉండగా.. టీడీపీ అధ్యక్షడు చంద్రబాబు నాయుడు కోసమే రాష్ట్రంలోని కమ్యూనిస్టులు పనిచేస్తున్నారని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆరోపించారు. ఉద్యోగుల సమ్మె జరుగుతుందంటే ఎల్లోమీడియాకు పండగ అని అన్నారు. సంధి జరిగింది.. ఉద్యోగులు సమ్మెకు వెళ్లడం లేదంటే వాళ్లు ఏడుపు మొహం పెట్టుకున్నారని మండిపడ్డారు. సమ్మె విరమించారనే విషయం తెలియగానే కమ్యూనిస్టులను ముందుకు తోశారని విమర్శించారు. చంద్రబాబు నాయుడుకు, ఎల్లోమీడియాకు మాత్రమే సమ్మె కావాలని ఎద్దేవా చేశారు. జగనన్న చేదోడు పథకం కింద ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారం లబ్ధిదారుల ఖాతాల్లో రెండో ఏడాది నగదును జమ చేశారు.
ఈ సందర్బంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. తమ ప్రభుత్వం వచ్చాక ఆశావర్కర్లకు జీతం రూ. పదివేలకు పెంచామని తెలిపారు. ఈనాడు రామోజీరావుకు ఈ వాస్తవాలు కనిపించవా? అని ప్రశ్నించారు. ఎర్రజెండాలు, పచ్చజెండాలు కలిపి ఉద్యోగులను రెచ్చగొడుతున్నాయని మండిపడ్డారు. ప్రపంచ కమ్యూనిస్టు చరిత్రలో ఎప్పుడూ జరగని విధంగా చంద్రబాబు బినామీ భూముల కోసం కామ్రేడ్లు జెండాలు పట్టుకుంటున్నారని ఆరోపించారు.
‘ఉద్యోగులు సమ్మె చేయాలని ఎవరూ కోరుకోరు. చంద్రబాబు సీఎం కాలేదనే బాధ, కడుపు మంట ఉన్నవారికే సమ్మెలు కావాలి. చంద్రబాబు దత్తపుత్రుడు, కామ్రేడ్లకు సమ్మెలు కావాలి. ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5కు సమ్మె కావాలి. ఉద్యోగుల సమ్మె జరుగుతుందంటే వీళ్లకు పండగ. ఆశావర్కర్లు రోడ్ల మీదకు వచ్చారని కథనాలు ప్రచురించారు. మెరుగైన జీతాలు ఇచ్చే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రచారం చేయిస్తున్నారు. ముఖ్యమంత్రిని తిడితే బాగా కవరేజ్ ఇస్తామని అంటున్నారు. సోషల్ మీడియాలో పోస్టులు పెడితే వాటిని ప్రధాన వార్తలుగా ప్రచురిస్తున్నారు. ఎర్ర జెండా వెనకాల పచ్చ జెండా ఉంది’ అని సీఎం జగన్ విమర్శించారు.