పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లి గూడెంకు చెందిన జనసేన కార్యకర్త లోకేశ్ ఆత్మహత్యాయత్నంపై ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ స్పందించారు. అతనిపై వేధింపులకు కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని ఆయన పోలీసులను కోరారు. ఈ మేరకు గురువారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు.

‘‘ లోకేశ్ పోలీసుల వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్యకు ప్రయత్నించాడని తెలిసి బాధపడ్డాను. ఇసుకు అక్రమ రవాణాను అడ్డుకొని ప్రశ్నించినందుకు పోలీసులు వేధించడం నియంతృత్వాన్ని తలపిస్తోంది.

Also Read:గాడ్సేపై నాగబాబు వ్యాఖ్యలు: పవన్ కళ్యాణ్ వ్యూహం ఇదీ....

శ్రీ ఉన్నమట్ల లోకేశ్‌ను సర్కిల్ ఇన్స్‌పెక్టర్ శ్రీ రఘు వేధించడం వల్లే ప్రాణం తీసుకోవాలనుకున్నాడని తెలిసింది. అక్రమాలను ప్రశ్నించిన వారినే వేధించడం చట్ట సమ్మతమా..? తాము ప్రజలకు జవాబుదారీ తప్ప అధికార పక్షానికి కాదు అని పోలీసు అధికారులు గుర్తించాలి.

జన సైనికుడిని ఆత్మహత్యకు ప్రేరేపించిన పోలీసు అధికారి శ్రీ రఘుపై తక్షణం చర్యలు తీసుకోవాలి. శ్రీ ఉన్నమట్ల లోకేశ్‌కు, ఆయన కుటుంబానికి ధైర్యం చెప్పాలని జిల్లా నాయకులకు తెలిపాను.

Also Read:నాథూరామ్ గాడ్సే దేశభక్తిపై నాగబాబు సంచలన ట్వీట్

పోలీసు వేధింపులు, అధికార పార్టీ నాయకుల వేధింపులపై ప్రజాస్వామ్య ధోరణిలో పోరాడాలి. ఈ ఘటనపై పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేయడంతో పాటు.. ఈ ప్రాంతంలో అధికార పక్షం చేస్తున్న ఇసుక దందాతో పాటు ఇతర అక్రమాలను జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లాలని నాయకులకు స్పష్టం చేశా’’ అని పవన్ ఆ లేఖలో పేర్కొన్నారు.