మీకు స్నేహ హస్తం అందించాం.. మా వాళ్లతో గొడవలొద్దు : టీడీపీ నేతల తీరుపై పవన్ వ్యాఖ్యలు
టీడీపీ నేతలు కూడా జనసైనికులతో సఖ్యతగా వుండాలని.. గతంలోని గొడవలు పక్కనబెట్టాలని పవన్ కల్యాణ్ కోరారు. 2014లో టీడీపీకి మద్దతిచ్చినప్పుడు.. తన వల్లే ప్రభుత్వం ఏర్పడిందని తాను ఎప్పుడూ చెప్పలేదని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు.

కృష్ణా జిల్లా ముదినేపల్లిలో జరిగిన నాలుగో విడత వారాహి విజయ యాత్రలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. టీడీపీతో గతంలో పొత్తు నుంచి బయటకు రావడం, ఇప్పుడు ఎందుకు మళ్లీ కలవాల్సి వచ్చింది అనే దానిపై పవన్ క్లారిటీ ఇచ్చారు. 2014లో ఇచ్చిన మాట నిలబెట్టుకోకపోవడంతో శ్రీకాకుళం పర్యటనలో తనను కొందరు ప్రశ్నించారని.. దీంతో పొత్తు నుంచి బయటకు వచ్చినట్లు పవన్ స్పష్టం చేశారు. తదనంతరం మాటా మాటా అనుకున్నామని.. ఇప్పుడు మళ్లీ రాష్ట్రం కోసం కలిసి వెళ్తున్నామని ఆయన వెల్లడించారు.
అలాగే టీడీపీ నేతలు కూడా జనసైనికులతో సఖ్యతగా వుండాలని.. గతంలోని గొడవలు పక్కనబెట్టాలని పవన్ కల్యాణ్ కోరారు. చంద్రబాబుతో విభేదాలు వున్నప్పటికీ వాటిని మరిచిపోయి రాజమండ్రి జైల్లో ఆయనను కలిశానని జనసేనాని వెల్లడించారు. 2014లో టీడీపీకి మద్దతిచ్చినప్పుడు.. తన వల్లే ప్రభుత్వం ఏర్పడిందని తాను ఎప్పుడూ చెప్పలేదని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. తమ వల్ల ఒక్క ఓటు పడినా దానికి కృతజ్ఞతగా వుండాలని మాత్రమే తాను చెప్పానని ఆయన వెల్లడించారు.
జగన్‌ను పంపించే సమయం వచ్చేసిందని, ఇక ఆయనకు టాటా చెప్పేద్దామని పవన్ కల్యాణ్ పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి పదవి లభిస్తే బలంగా పనిచేస్తానని.. లేదంటే బాధ్యతగా పనిచేస్తానని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలో స్కూళ్లు మూతపడిపోతున్నాయని.. వలసలు పెరుగుతున్నాయని పవన్ ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే రాష్ట్ర భవిష్యత్ కోసం పనిచేయాలని నిర్ణయించుకున్నానని ఆయన వెల్లడించారు. జగన్ సంక్షేమ పథకాలకు ఇచ్చేది డబ్బు ప్రజలదేనని.. ఆయనేం తన జేబులోంచి ఇవ్వడం లేదని పవన్ కళ్యాణ్ చురకలంటించారు. సంపద సృష్టించకుండా కేవలం సంక్షేమ పథకాలు మాత్రమే అమలు చేయడాన్ని తాను వ్యతిరేకిస్తున్నట్లు జనసేనాని స్పష్టం చేశారు.
ALso Read: మేం గెలిచిన రోజున దమ్ముంటే .. మీ ఇళ్లల్లో వుండండి : వైసీపీ నేతలకు పవన్ వార్నింగ్
నేను ఎన్డీయే కూటమిలో వుంటే ఎంత.. లేకపోతే ఎంత అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు జనసేన అధినేత. వైఎస్సార్‌ను ఎదిరించి కూడా తాను ఎక్కడికి పారిపోలేదని.. ఎవరెవరిపై ఏ కేసులు పెట్టారో కూడా అన్నీ గుర్తున్నాయని పవన్ దుయ్యబట్టారు. ఢిల్లికీ వెళ్లారు కదా.. తెలంగాణతో పాటు ఎన్నికలంటే మరో నెలన్నర రోజులే మీరు అధికారంలో వుండేదని జనసేనాని పేర్కొన్నారు. మేము గెలిచిన రోజున.. దమ్ముంటే మీ ఇళ్లల్లో, మీ ఆఫీసుల్లో వుండండి అంటూ ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.
ప్రజల్ని కులాలపరంగా విడగొడితే చూస్తూ కూర్చేనే పార్టీ జనసేన కాదన్నారు. వారసత్వ రాజకీయాలపట్ల తనకు ఇబ్బందేమి లేదని పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మీరు భయపడ్డారంటే.. మీరు బలహీనపడ్డట్లేనని వైసీపీకి ఆయన చురకలంటించారు. ఏ పోలీసులతో కేసులు పెట్టించారో, అదే పోలీసులతో మక్కెలిరిగేలా చేస్తామని పవన్ హెచ్చరించారు.