గుంటూరు: జగన్ సర్కార్ పై జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ ప్రభుత్వ తీరుపై నిప్పులు చెరిగారు. ప్రజలు ఆశించినంతగా పాలన లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు జనసేనాని పవన్ కళ్యాణ్. 

మంగళగిరిలో పార్టీ కార్యాలయంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నేతృత్వంలో జరిగిన పొలిట్ బ్యూరో, రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశంలో ప్రభుత్వ తీరుపై పవన్ కళ్యాణ్ మండిపడ్డారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత చేసిన తప్పుల జాబితాలను రూపొందించారు.  

ఇసుక నూతన పాలసీ విధానం పేరుతో ఇసుకను అందుబాటులో లేకుండా చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కృత్రిమంగా ఇసుక కొరతను సృష్టించారని ఆరోపించారు. జగన్ ప్రభుత్వ నిర్వాకం వల్ల  నిర్మాణ రంగాన్ని, అందుకు అనుబంధంగా అన్ని వ్యవస్థల్ని తిరోగమన దిశలోకి నెట్టేసిందని పవన్ ఆరోపించారు.  

ఇసుక అందుబాటులో లేకపోవడం వల్ల రాష్ట్రంలో 35 లక్షల మంది ప్రత్యక్షంగా పరోక్షంగా మరో లక్ష మంది కార్మికులు ఉపాధి కోల్పోయారంటూ పవన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ నిర్వాకం వల్ల భవన నిర్మాణ కార్మికుల కుటుంబాలు రోడ్డున పడ్డాయంటూ ధ్వజమెత్తారు పవన్ కళ్యాణ్. 

గృహ నిర్మాణంతోపాటు, ఇన్ ఫ్రా రంగం వాటికి అనుబంధమైన వ్యాపారాలు దెబ్బ తినడంతో ఆంధ్ర ప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ అతలాకుతలమైపోయిందని పీఏసీ కమిటీ అభిప్రాయపడింది. రాష్ట్రానికి రావాల్సిన రాబడులు కోల్పోతూ ఆర్థిక వ్యవస్థ కుంటుపడితే అభివృద్ధి ఏ విధంగా సాధ్యమని పొలిట్ బ్యూరో ప్రభుత్వాన్ని నిలదీసింది. 

అమరావతి రాజధానిపై ప్రభుత్వం చేస్తున్న వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆంధ్ర ప్రదేశ్ ను శాశ్వత రాజధాని లేని రాష్ట్రంగా చూపించాలని ప్రభుత్వం ప్రయత్నిస్తుందా అంటూ ప్రశ్నించారు. ప్రజలకు పాలనాపరమైన సౌలభ్యం లేకుండా చేయడమే ప్రభుత్వ విధానంలా ఉందంటూ పొలిట్ బ్యూరో నిప్పులు చెరిగింది. 

రాజధానికి అనువైన ప్రదేశం అన్వేషణ, నిపుణుల కమిటీ పరిశీలన అంటూ ప్రభుత్వం కాలయాపన చేస్తోందే తప్ప ఖచ్చితమైన నిర్ణయం ప్రకటించడం లేదని మండిపడింది. రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ రాజధాని విషయంలో వ్యూహాత్మకంగా గందరగోళాన్ని సృష్టిస్తున్నారు అని కమిటీ తప్పుబట్టింది. 

ఇకపోతే గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగ నియామకాల్లో చోటు చేసుకున్న గందరగోళంపై ప్రభుత్వం ఖచ్చితమైన వివరణ ఇవ్వేలేదని అభిప్రాయపడింది. ప్రభుత్వ విధానం వల్ల లక్షలాది మంది ఉద్యోగాలు కోల్పోయారని పవన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.  

ఏపీపీఎస్సీలో మార్పులు పేరుతో రాత పరీక్షతోనే నియామకాలు అంటే పేపర్ లీకేజ్ లాంటి అక్రమాలు తలెత్తితే ప్రతిభావంతులు అన్యాయం అయిపోతారనే ఆందోళన యువతలో నెలకొంది అని సమావేశం అభిప్రాయపడింది. ఆంధ్ర ప్రదేశ్ లో స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు నిర్వహించినా పోటీకి సన్నద్ధమే అని పొలిట్ బ్యూరో క్లారిటీ ఇచ్చింది.