విశాఖపట్నంలో రుషికొండను పవన్ కల్యాణ్ పరిశీలించారు. ముఖ్యమంత్రికి ఎన్ని ఇళ్లు కావాలి, వున్నవి సరిపోవా , ఒక మూలన కూర్చొలేడా అని పవన్ కల్యాణ్ నిలదీశారు.
జనసేన అధినేత పవన్ కల్యాణ్ రుషికొండకు చేరుకున్నారు. అయితే దూరంగా వుండి కొండను పరిశీలించాలని పోలీసులు ఇప్పటికే ఆయనకు సూచించారు. అయితే పవన్ మాత్రం కాలినడకన కొండపైకి వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. దీంతో కొండపైకి పవన్, జనసేన నేతలు వెళ్లకుండా పోలీసులు బారికేడ్లను అడ్డుపెట్టారు. మరోవైపు పవన్ రాకను తెలుసుకున్న అభిమానులు, ప్రజలు , కార్యకర్తలు ఆ ప్రాంతానికి భారీగా చేరుకున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్తత పరిస్ధితులు చోటు చేసుకున్నాయి.
అనంతరం పవన్ కల్యాణ్ మీడియాతో మాట్లాడుతూ.. జగన్ ప్రభుత్వం పర్యావరణానికి హాని కలిగించేలా వ్యవహరిస్తోందన్నారు. చట్టాన్ని గౌరవించాల్సిన ముఖ్యమంత్రి తనే ఉల్లంఘనలకు పాల్పడుతున్నారని పవన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వీళ్లు చట్టాన్ని ఉల్లంఘించవచ్చు.. మిగిలినవారు శాంతియుతంగా నిరసన తెలపకూడదాని ఆయన ప్రశ్నించారు. వరదలు, తుఫాన్లు వచ్చినప్పుడు గ్రామం కొట్టుకుపోకుండా రుషికొండ కాపాడుతుందన్నారు.
దశాబ్ధాలుగా దీనిని కాపాడుకుంటూ వచ్చామని.. గతంలో తెలంగాణనూ ఇలాగే దోపిడీ చేశారని, అందుకే తన్ని తగలేశారని పవన్ కళ్యాణ్ దుయ్యబట్టారు. ఉత్తరాంధ్రకు వచ్చి మళ్లీ దోపిడి చేస్తున్నారని దీనికి ఫుల్ స్టాప్ పడాలని ఆయన కోరారు. మాట్లాడితే మూడు రాజధానులు అంటున్నారని.. ఒక్క రాజధానికి దిక్కులేదని ఎద్దేవా చేశారు. కర్నూలును న్యాయ రాజధానిగా చెప్పి.. కనీసం ఉప లోకాయుక్త కూడా పెట్టలేదని పవన్ దుయ్యబట్టారు. జగన్ చేస్తున్న దోపిడీ ప్రజలకు తెలియాలని అన్నారు. ఇలాంటి వ్యక్తులను ఎన్నుకుంటే దోపిడీ ఇలా వుంటుందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్తులను అడ్డగోలుగా దోచేస్తున్నారని.. ముఖ్యమంత్రికి ఎన్ని ఇళ్లు కావాలి, వున్నవి సరిపోవా , ఒక మూలన కూర్చొలేడా అని పవన్ కల్యాణ్ నిలదీశారు. సర్క్యూట్ హౌస్‌ను తాకట్టు పెట్టి.. రుషికొండను దోచేస్తాడా అటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. రుషికొండలో నిర్మాణాలకు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ పర్మిషన్ వుందా అని ఆయన ప్రశ్నించారు. చిన్న చిన్న లొసుగులున్నాయని వాళ్లే చెబుతున్నారని.. కిర్లంపూడిలో క్యాంప్ ఆఫీస్ పెట్టుకోవచ్చు కదా అని పవన్ ధ్వజమెత్తారు. క్యాంప్ ఆఫీస్ కోసం రుషికొండను దోచేస్తారా అని జనసేనాని ప్రశ్నించారు.
