దివీస్ పరిశ్రమ అడ్డుపెట్టుకొని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రాజకీయాలు చేస్తున్నారంటూ  జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆరోపించారు. దివీస్ పరిశ్రమ వద్దు అన్నందుకు అమాయకులను అరెస్టు చేసి జైళ్లలో పెడతారా అని ప్రశ్నించారు. వాళ్లంతా అమాయకులని.. వాళ్లేమీ ప్రాజెక్టులకు అనుమతులు ఇచ్చి నీకింత-నాకింత అని లంచాలు తీసుకోలేదని పేర్కొన్నారు. వాళ్లని విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

అధికారంలోకి వస్తే దివీస్ ను బంగాళాఖాతంలో కలిపేస్తానంటూ జగన్ స్థానికులను రెచ్చగొట్టినందువల్లనే ఇప్పుడు ఇక్కడి ప్రజలు పరిశ్రమకు వ్యతిరేకంగా రోడ్డుపైకి వస్తున్నారని పవన్ పేర్కొన్నారు. ఈ మేరకు పవన్ తాజాగా ఓ ప్రకటన విడుదల చేశారు.

‘ దివీస్ పరిశ్రమకు చంద్రబాబు ప్రభుత్వం అనుమతిస్తే మీరు ఆపలేరా? ఆయన ప్రారంభించిన అన్నింటినీ ఒక్కొక్కటిగా రద్దు చేశారు కదా.. రాజధాని అమరావతిని ఆపారు. పోలవరం ప్రాజెక్టును రివర్స్ లో తీసుకెళ్తున్నారు కదా’ అని పవన్ ప్రశ్నించారు. 

పరిశ్రమకు వ్యతిరేకంగా పోరాటం చేసిన అరెస్టైన 36మందిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. దివీస్ బాధితుల కన్నీళ్లు తుడవమని తాను అడుగుతుంటే పంచాయతీ ఎన్నికల నిర్వహణ పై మాట్లాడమని మంత్రి గౌతమ్ రెడ్డి తనను ప్రశ్నించడం చూస్తే ఆశ్చర్యమేస్తోందన్నారు.