భీమవరం: జనసేన అధినేత, సినీనటుడు పవన్ కళ్యాణ్ కంటతడి పెట్టారు. జనసేన పార్టీ కార్యకర్త మరణాన్ని తట్టుకోలేకపోయిన పవన్ కళ్యాణ్ బోరున విలపించారు. వివరాల్లోకి వెళ్తే పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన జనసేన కార్యకర్త కొప్పినీడి మురళీ ఇటీవలే క్యాన్సర్ వ్యాధితో మృతిచెందాడు. 

కొప్పినీడి మురళీ జనసేన పార్టీలో క్రమశిక్షణకలిగిన కార్యకర్తగా పేర్గాంచారు. పార్టీ గెలుపుకోసం అహర్నిశలు శ్రమించారు. ఒక వైపు క్యాన్సర్ వ్యాధి వేధిస్తున్నా పార్టీ కోసం శ్రమించాడని పవన్ కళ్యాణ్ కొనియాడారు. 

ఈ సందర్భంగా కొప్పినీడి మురళీ కుటుంబ సభ్యులను పవన కళ్యాణ్ పరామర్శించారు. మురళీకృష్ణ చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. మురళీ కుటుంబ సభ్యుల ఆవేదనను చూసిన పవన్ కళ్యాణ్ చూసి తట్టుకోలేక  కంటతడిపెట్టారు.  

అనంతరం కొప్పినీడి మురళీ కుటుంబానికి తక్షణ ఆర్థిక సహాయంగా 2.5లక్షల రూపాయల చెక్కును అందజేశారు. మురళీ కుటుంబానికి తాను అండగా ఉంటానని పవన్ కళ్యాణ్ భరోసా ఇచ్చారు. ఎట్టిపరిస్థితుల్లో ఎలాంటి అవసరమైనా తనను సంప్రదించాలంటూ సూచించారు.