గత ప్రభుత్వ హయాంలో కూల్చేసిన దేవాలయాన్ని ఇప్పుడు పునర్ నిర్మిస్తున్నామంటూ వైసీపీ ప్రభుత్వం చెబుతోందని.. కాగా గత 18 నెలలుగా ఈ విషయాన్ని ఎందుకు పట్టించుకోలేదని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్ లో గత కొంతకాలంగా వరసగా విగ్రహాలు ధ్వంసం అవుతూనే ఉన్న సంగతి తెలిసిందే. కాగా.. ఈ విగ్రహాల ధ్వంసం ఘటనల నేపథ్యంలోనే ఆలయాలను పునర్ నిర్మిస్తున్నామంటూ ప్రభుత్వం చెబుతోందని పవన్ పేర్కొన్నారు.

ఈ చర్యలను హిందూ ధర్మ పరిరక్షణ కోసం వారు ప్రత్యేకంగా చేస్తున్న కార్యకలాపాలుగా చూడలేమని పేర్కొన్నారు. ఈ మేరకు గురువారం పవన్ ఓ ప్రకటన విడుదల చేశారు. ఆలయాల ఆస్తులు, విగ్రహాల పరిరక్షణలో ప్రభుత్వ వైఖరి, తీసుకునే చర్యల గురించి ఇప్పటికీ ఎలాంటి స్పష్టత లేదన్నారు.

కాంట్రాక్టుల్లో వచ్చే కమీషన్లపై ఉన్న శ్రద్ధ.. రాష్ట్రంలోని 26వేల ఆలయాలకు సీసీ కెమేరాల ఏర్పాటు చేయడంలోనూ  చూపించాలన్నారు. రాష్ట్రంలో దేవాదాయ శాఖ పరిధిలో ఉన్న 26వేల దేవస్థానాల్లో ఎన్నింటిలో సీసీ కెమేరాలతో నిఘా ఏర్పాటు  చేశారో ప్రభుత్వం సమాధానం చెప్పాలన్నారు.

ధూపదీప నైవేద్యాలకు కూడా నిధులు సమకూర్చని ప్రభుత్వం ఇప్పుడు సీసీ కెమేరాలు కూడా దేవాలయాల నిర్వాహకులే ఏర్పాటు చేసుకోవాలనటం బాధ్యతను విస్మరించడమేనన్నారు. ఆధునిక సాంకేతికతతో కూడిన సీసీ కెమేరాలను ఏర్పాటు చేసి వాటిని పర్యవేక్షించే వ్యవస్థలనూ సిద్ధం చేయాలని పవన్ పేర్కొన్నారు.