అమరావతిలోని ఉద్ధండరాయునిపాలెం గ్రామానికి చెందిన పులి చిన్న లాజర్ అనే రైతు గుండెపోటుతో చనిపోయారు. అమరావతి కోసం చిన్న లాజర్ 15 ఎకరాల భూమి ఇచ్చారు. అమరావతి అసైన్డ్ భూముల సొసైటీ అధ్యక్షుడిగా కూడా ఉన్నారు. అమరావతినే రాజధానిగా కొనసాగించాలని గత కొన్ని రోజులుగా ఉద్యమం జరుగుతోంది.

ఈ ఉద్యమంలో చిన్న లాజర్ కూడా పాల్గొన్నారు. చిన్న లాజర్ మృతికి పలువురు రైతులు, రైతు సంఘాల నేతలు సంతాపం తెలిపారు. ఈ నేపథ్యంలో జనసేన అధినేత, సినీనటుడు పవన్ కల్యాణ్ కూడా ఆయన మృతికి సంతాపం తెలిపారు. ఈ మేరకు ట్వీట్ చేశారు. 

‘‘ ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి ప్రాంత పేద, అసైన్డ్ రైతుల పక్షాన నిలిచి పోరాడిన పులి చినలాజర్ కన్నుమూశారని తెలిసి బాధపడ్డాను. రాజధాని కోసం తన భూములు ఇచ్చారు. భూములు ఇచ్చిన అసైన్డ్ రైతులకు న్యాయమైన వాటా దక్కాలని పోరాడిన నాయకుడాయన.

పేదలు, దళితులకు ఆధారమైన భూములు, లంక భూముల విషయంలో సంబంధిత రైతుల పక్షాన నిలిచి తన గొంతు వినిపించారు. రాజధానిలో బలవంతపు భూసేకరణకు ప్రభుత్వం సిద్ధమైనప్పుడు, అసైన్డ్ రైతులకు సరైన వాటా ఇవ్వడంలేదన్న సందర్భంలో ఆ రైతుల సమస్యలను లాజర్ నా దృష్టికి తీసుకువచ్చారు.

సమస్యను విశ్లేషించి, సరైన పరిష్కారం సూచించేవారు. 2018లో లాజర్ స్వగ్రామం ఉద్దండ్రాయునిపాలెంలో ఆయన సమక్షంలోనే ఉగాది వేడుకలు చేసుకున్నాను. అమరావతిలోనే రాజధాని ఉండాలని బలంగా పోరాడుతున్నారు.

లాజర్ తుదిశ్వాస విడిచి ప్రభువు చెంతకు చేరారు. వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాను. లాజర్ కుటుంబ సభ్యులకు నా తరఫున, జనసేన పక్షాన ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నాను.

రాజధానికి భూములు ఇచ్చిన రైతులకు... ముఖ్యంగా పేద, దళిత, బడుగు బలహీన వర్గాల రైతులకు న్యాయం జరగాలని తొలి నుంచీ పోరాడిన నాయకుడు లాజర్. 300 రోజులకు చేరిన ప్రస్తుత ఉద్యమాన్ని రాష్ట్రస్థాయిలో బలంగా చేసి అనుకున్నది సాధించినప్పుడు లాజర్‌కు సరైన నివాళి దక్కుతుంది.’ అని పవన్ తన సంతాపం సందేశంలో పేర్కొన్నారు.