2024 అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తులకు సంబంధించి జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఈసారి పూర్తి క్లారిటీ ఇచ్చారు. రాష్ట్రం కోసం తాను తగ్గడానికి సిద్ధమన్న పవన్... తన దగ్గర మూడు ఆప్షన్స్ వున్నాయని స్పష్టం చేశారు. 

వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తులకు సంబంధించి జనసేన అధినేత పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. గతంలో వన్‌సైడ్ లవ్ అనే కామెంట్లు చేసిన చంద్రబాబు .. ఇప్పుడు వార్ వన్‌సైడ్ అంటున్నారని పరోక్ష వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబుకు క్లారిటీ వచ్చాక మిగిలిన విషయాలు మాట్లాడతామన్నారు. రాష్ట్రం కోసం తాను తగ్గడానికి సిద్ధమన్న పవన్.. అన్ని సార్లు తాను తగ్గానని, ఈసారి మిగిలిన వాళ్లు తగ్గితే బాగుంటుందన్నారు. ప్రస్తుతం జనసేన ముందు మూడు ప్రత్యామ్నాయాలు వున్నాయని పవన్ చెప్పారు. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

అప్షన్ 1: జనసేన, బీజేపీ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం
అప్షన్ 2: జనసేన, టీడీపీ, బీజేపీ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం
అప్షన్ 3: జనసేన ఒంటరిగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం 

ఈ మూడు ప్రత్యామ్నాయాలపై చర్చిద్దామని పిలుపునిచ్చారు పవన్. మంచి కోసం తగ్గాలని బైబిల్ సూక్తి అని చెప్పిన పవన్ కల్యాణ్.. టీడీపీ ఆ బైబిల్ సూత్రాన్ని పాటిస్తే మంచిదని అన్నారు. 

అంతకుముందు జనసేన (janasena) విస్తృతస్థాయి సమావేశంలో మూడు తీర్మానాలకు ఆమోదం తెలిపారు. దీనికి సంబంధించిన వివరాలను పార్టీ అధినేత పవన్ కల్యాణ్ (pawan kalyan) వెల్లడించారు. కౌలు రైతులకు సాయం కోసం రూ.5 కోట్లు విరాళం ఇచ్చిన పవన్‌కు సమావేశంలో అభినందనలు తెలియజేశారు. కోనసీమలో (konaseema) శాంతి కమిటీ ఏర్పాటు చేస్తూ తీర్మానాన్ని ఆమోదించారు. రాష్ట్రంలో శాంతి భద్రతల వైఫల్యానికి ప్రభుత్వ వైఖరే కారణమంటూ తీర్మానించారు. కులాలను విభజించి పాలించాలనేది వైసీపీ విధానమని పవన్ ఆరోపించారు. కోనసీమ అల్లర్లను ప్రభుత్వం సృష్టించిన విధానం చాలా బాధాకరమన్నారు. కోనసీమ అల్లర్లను బహుజన ఐక్యత మీద దాడిగా జనసేన చూస్తోందని పవన్ పేర్కొన్నారు. 

ఏ ప్రాంతంలోనైనా కొన్ని గొడవలు వుంటాయని.. విజయవాడలో గతంలో జరిగిన ఘటనల్లో ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగిన ఘర్షణ రెండు కులాల మధ్య చిచ్చు రేపిందని ఆయన గుర్తుచేశారు. కులం అనగానే వచ్చే భావన దురదృష్టవశాత్తూ ఆంధ్రా అంటే రాదని పవన్ వ్యాఖ్యానించారు. మనదేశంలో అవినీతి అనేది రాజకీయాల్లో సహజంగా మారిందని.. అవినీతి సొమ్ముతో రాజకీయాల్లోకి వచ్చిన వారు ఏసీబీని కంట్రోల్ చేస్తున్నారని పవన్ కల్యాణ్ ఎద్దేవా చేశారు. ఇసుక అక్రమాలపై ఏ యాప్ ద్వారా ఫిర్యాదు చేయాలని ఆయన ప్రశ్నించారు. మద్యంపై ఫిర్యాదు చేయాలంటే జగన్‌పైనే చేయాలంటూ పవన్ చురకలు వేశారు. మనం నిజాయితీగా వున్నా.. అవినీతి, దాడులు చేసే వారి పాలనలో బతకడం ఇబ్బందిగా వుందంటూ జనసేనాని వ్యాఖ్యానించారు.