ఏప్రిల్ నెలలో జరిగిన ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలను రద్దు చేస్తూ ఆంధ్ర ప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన తీర్పు హర్షణీయం అని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ అన్నారు. ఇది ప్రజాస్వామ్యానికి, స్థానిక స్వపరిపాలనకు ఊపిరిపోసే తీర్పు అని ప్రశంసించారు. ఈ మేరకు ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు.

ఏడాది క్రితం నోటిఫికేషన్ జారీ చేసి కోవిడ్ పరిస్థితులు కారణంగా ఎన్నికలు రద్దు చేశారు. తిరిగి అదే నోటిఫికేషన్ పై ఏడాది తరువాత జెడ్పీటీసీ, ఎంపీటీసీలకు ఎన్నికలు నిర్వహించడం అంటే ఎన్నికల నిబంధనలు తుంగలో తొక్కినట్లేనని అందులో పేర్కొన్నారు. 

ఏప్రిల్ లో ఎంపీటీసీ, జెడ్పీటీసీలకు ఎన్నికలు నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తలపెట్టినప్పుడే జనసేన తీవ్రంగా వ్యతిరేకించిందని, తాజాగా నోటిఫికేషన్ జారీ చేసి పోటీ చేయాలనుకునే అభ్యర్ధులకు తగిన సమయం ఇవ్వాలని జనసేన విస్పష్టంగా డిమాండ్ చేసిందన్నారు. 

అయినా రాష్ట్ర ప్రభుత్వం ఒంటెద్దు పోకడతో ఎన్నికలు నిర్వహించడానికి సమాయత్తం కావడంతో జనసేన హైకోర్టును ఆశ్రయించింది. తుదకు హైకోర్టు ఈ ఎన్నికలను రద్దు చేయాలని తీర్పు ఇవ్వడం ప్రజాస్వామ్య విజయంగా భావిస్తున్నామన్నారు.  

నీలం సాహ్నికి హైకోర్టు షాక్: పరిషత్ ఎన్నికలు రద్దు, సవాల్ చేసే యోచన...

రాష్ట్ర ప్రభుత్వం ఇకనైనా పంతాలకు, పట్టింపులకు పోకుండా తగిన సమయంలో తాజా నోటిఫికేషన్ జారీ చేసి ఎన్నికలు నిర్వహించాలని జనసేన కోరుతోందని పేర్కొన్నారు. 

కాగా, పరిషత్ ఎన్నికల విషయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (ఎస్ఈసీ) నీలం సాహ్నికి హైకోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలను హైకోర్టు రద్దు చేసింది. పరిషత్ ఎన్నికలకు కొత్తగా తిరిగి నోటిఫికేషన్ ఇవ్వాలని ఆదేశించింది. సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగా ఎన్నికలు జరగలేదని హైకోర్టు స్పష్టం చేసింది.

పరిషత్ ఎన్నికలను ప్రక్రియను కొనసాగించడాన్ని సవాల్ చేస్తూ టీడీపీ, బిజెపి, జనసేన పిటిషన్లు దాఖలు చేశాయి. ఈ పిటిషన్లపై విచారణ జరుగుతున్న క్రమంలో మార్చిలో ఎన్నికల ప్రక్రియను కొనసాగిస్తూ ఎస్ఈసీ నీలం సాహ్ని నోటిఫికేషన్ జారీ చేశారు. దీంతో ఎన్నికలను కొనసాగించడానికి అనుమతి ఇస్తూ తమ తీర్పు వచ్చే వరకు ఫలితాలను నిలిపేయాలని ఆదేశించింది. దాంతో ఓటింగు జరిగినప్పటికీ ఓట్ల లెక్కింపు ఆగిపోయింది.