జనసేన 10వ వార్షికోత్సవం: పవన్ కళ్యాణ్‌కు సోము వీర్రాజు శుభాకాంక్షలు
జనసేన 10వ వార్షికోత్సవం నేపథ్యంలో బీజేపీ నేత సోము వీర్రాజు పవన్ కళ్యాణ్ కు శుభాకాంక్షలు తెలిపారు.
అమరావతి: పవన్ కళ్యాణ్ కు బీజేపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు మంగళవారంనాడు శుభాకాంక్షలు చెప్పారు. జనసేన ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని సోము వీర్రాజు పవన్ కళ్యాణ్ కు గ్రీటింగ్స్ చెప్పారు.
ఏపీ రాష్ట్రంలో బీజేపీ, జసేనలు మిత్రపక్షంగా ఉన్నాయి. అయితే ఇటీవల కాలంలో ఈ రెండు పార్టీల మధ్య సంబంధాలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. తమ మధ్య మితృత్వం ఉందని రెండు పార్టీల నేతలు చెబుతున్నారు. కానీ జనసేన, బీజేపీ మధ్య గ్యాప్ కొనసాగుతుంది. 2024లో ఏపీలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో విపక్షాలు కలిసి కట్టుగా పోటీ చేయాలని జనసేన పిలుపునిచ్చింది. రాష్ట్రంలో జగన్ పాలనను అంతం చేయాలంటే విపక్షాలు కలిసి పోటీ చేయాల్సిన అవసరం ఉందని పవన్ కళ్యాణ్ ప్రకటించారు. కుటుంబ పార్టీలతో తాము కలిసే ప్రసక్తే లేదని టీడీపీ, వైసీపీలనుద్దేశించి బీజేపీ నేతలు ప్రకటనలు చేస్తున్నారు.
గతంలో భీమవరంలో నిర్వహించిన బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఆ పార్టీ కీలక తీర్మానం చేసింది. భావసారూప్యత గల పార్టీలతో ఎన్నికల్లో కలిసి పనిచేస్తామని బీజేపీ తీర్మానం చేసింది. . వైసీపీని గద్దె దించేందుకు టీడీపీ సహా ఇతర విపక్షాలతో కలిసి పోటీ చేయాలనేది జనసేన ఆలోచనగా కన్పిస్తుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
also read:వారాహిపై జనసేనాని:విజయవాడ నుండి మచిలీపట్టణానికి పవన్
జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్, టీడీపీ చీఫ్ చంద్రబాబులు రెండు దఫాలు సమావేశమయ్యారు. వైసీపీ అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటాలపై చర్చించినట్టుగా ఈ ఇద్దరు నేతలు గతంలో ప్రకటించారు. దీంతో టీడీపీ, జనసేనలు దగ్గరైనట్టుగా సంకేతాలు వెలువడ్డాయి. బీజేపీ నుండి బయటకు వచ్చిన కన్నా లక్ష్మీనారాయణ వంటి నేతలు కూడా జనసేన, బీజేపీ మధ్య సంబంధాలు సరిగా లేవని కూడా వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.ఈ తరుణంలో జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ కు సోము వీర్రాజు ఫోన్ చేసి శుభాకాంక్షలు చెప్పారు.