తెలుగుదేశం పార్టీ కార్యాలయాలపై జరిగిన దాడులను జనసేన చీఫ్ పవన్  కళ్యాణ్ ఖండించారు. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఇలాంటి దాడులే జరగలేవని, ఇవి ప్రజాస్వామ్యానికి విఘాతమని తెలిపారు. అరాచకాలకు దారి తీస్తాయని ఆందోళన వ్యక్తం చేశారు. వీటిపై కేంద్ర ప్రభుత్వం వెంటనే దృష్టి పెట్టి, పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు.

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం సహా పలు జిల్లాల్లోని పార్టీ ఆఫీసులపై జరిగిన దాడులను జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఖండించారు. ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే ఇలాంటి దాడులు జరగలేవని అన్నారు. ఇలాంటి దాడులు ప్రజాస్వామ్యానికి ప్రమాదకరంగా మారుతాయని హెచ్చరించారు. ఇవి అరాచకాలకు దారితీస్తాయని ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఈ దాడులపై కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించాలని అన్నారు. దాడులకు తెగబడిన వారిని వెంటనే శిక్షించాలని కోరారు. భవిష్యత్‌లో ఇలాంటి దాడులు మళ్లీ రాకుండా చర్యలు తీసుకోవాలని తెలిపారు.

రాజకీయ వైరుధ్యాలు, ఘర్షణలు ఉన్నప్పటికీ నేరుగా పార్టీ కార్యాలయాలపై దాడులు జరగడం చాలా అరుదు. ఆంధ్రప్రదేశ్‌లో ఇలాంటి దాడులు జరగడంపై అన్ని వర్గాల నుంచి వ్యతిరేకత వస్తున్నది. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయాలపై కొందరు దుండగులు రాళ్లతో దాడి చేశారు. ఈ దాడిలో ఆఫీసు ఫర్నీచర్, ఇతరత్రాలు ధ్వంసమయ్యాయి. కార్యాయం వద్ద నిలిపిన వాహనాలపైనా కర్రలు, ఇనుప రాడ్లతో దాడికి తెగబడటంతో అవి డ్యామేజ్ అయ్యాయి.

పార్టీ కార్యాలయంపై దాడిని నిరసిస్తూ టీడీపీ కార్యకర్తలు జాతీయ రహదారిపై ధర్నాకు దిగారు. పార్టీ కార్యకర్తలు, నేతలు పెద్దఎత్తున కేంద్ర కార్యాలయానికి తరలివచ్చారు. విశాఖ, తిరుపతి, గుంటూరులలో టీడీపీ కార్యాలయాలపై వైసీపీ శ్రేణులు దాడి చేసినట్టు ఆరోపణలు వస్తున్నాయి.

Also Read: డీజీపీకి.. సీఎంకు తెలిసే టీడీపీ ఆఫీసులపై దాడి: రేపు రాష్ట్ర బంద్‌కు చంద్రబాబు పిలుపు

ఈ దాడులపై టీడీపీ అధినేత చంద్రబాబు గవర్నర్ బిశ్వబూషణ్ హరిచందన్‌తో మాట్లాడారు. పార్టీ కార్యాలయాలను లక్ష్యంగా చేసుకుని జరిపినదాడులను వివరించారు. కేంద్ర బలగాలతో టీడీపీ ఆఫీసులకు రక్షణ కల్పించాలని కోరారు. కేంద్ర బలగాలు పంపడానికీ హోం శాఖ సానుకూలంగా స్పందించినట్టు తెలిసింది.

ఈ దాడులకు ముందు తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభి ఇంటిపైనా వైసీపీ నేతలు, కార్యకర్తలు దాడి చేశారు. విజయవాడలోని ఆయన ఇంట్లో మంగళవారం గుర్తు తెలియని దుండగులు సామగ్రి ధ్వంసం చేశారు. దీంతో పట్టాభి కుటుంబసభ్యులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. దాడి సమయంలో పట్టాభి.. మంగళగిరిలోని టీడీపీ ఆఫీసులోనే వున్నారు.