గుంటూరు: మాజీ మంత్రి రావెల కిశోర్ బాబు పార్టీని వీడడంపై గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం నాయకులు స్పందించారు. రావెల కిషోర్‌బాబు ఒంటరిగానే జనసేనలోకి వచ్చారు, ఒంటరిగానే పార్టీని వీడి పోయారని వారన్నారు. ఆయన పార్టీని వీడినా ఎటువంటి నష్టం లేదని వారు అభిప్రాయపడ్డారు. 

తల్లిలా ఆదరించిన పార్టీని రావెల తన స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసమే వీడారని జనసేన నాయకులు విమర్శించారు. పార్టీ జిల్లా కార్యాలయంలో మంగళవారం జరిగిన మీడియా సమావేశంలో జనసేన ప్రత్తిపాడు నియోజకవర్గ నాయకులు యలవర్తి నాగరాజు, డేగల ఉదయ్‌, కాటూరి శ్రీను, పులి శివకోటయ్య, ఉప్పు రత్తయ్య తదితరులు మాట్లాడారు. 

గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో రావెల మంత్రిగా పని చేసినప్పటికీ ఆ పార్టీ శ్రేణులు ఆయనను హీనంగా చూసి పలు అవమానాలకు గురి చేశాయని వారన్నారు. అటువంటి పరిస్థితుల్లో పవన్‌ కల్యాణ్‌ ఆదరించి పార్టీలో చేర్చుకొని సోదర స్థానం ఇచ్చినట్లు వివరించారు. పవన్ కల్యాణ్ నమ్మకాన్ని వమ్ము చేసి ఎన్నికల ఫలితాల అనంతరం కిషోరబాబు పార్టీని వీడటం ఆయన అవకాశవాద రాజకీయాలకు అద్దంపడుతోందని వారన్నారు.