హైదరాబాద్: ఏలూరు నగరంలో అంతుబట్టని వ్యాధితో 300మందికిపైగా ఆసుపత్రుల్లో చేరడం దురదృష్టకరమని, తమ వారికి వచ్చిన వ్యాధి ఏంటో తెలియక వారి కుటుంబీకులు భయాందోళనకు గురవుతున్నారని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. తుపాన్ ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తున్నప్పుడే ఈ విషయం తన దృష్టికి వచ్చిందని ఆయన చెప్పారు. ఈ మేరకు ఆయన సోమవారం ఓ ప్రకటన విడుదల చేశారు. 

ఏలూరులో సరైన వైద్య సదుపాయాలు లేక బాధితులను విజయవాడ తీసుకొస్తున్నారని తెలిసి తమ విజయవాడ నాయకులను అప్రమత్తం చేశామని పవన్ కల్యాణ్ చెప్పారు. అవసరమైనవారికి తగిన సాయం చేయాలని చెప్పినట్లు తెలిపారు. 

వ్యాధి ఏంటో ఎవరికీ అంతుపట్టడం లేదని, ఇలాంటి సమయంలో వైద్య నిపుణులు ఎంత సాయం చేయగలిగితే అంత చేయాలని కోరుతున్నానని ఆయన అన్నారు.. ప్రభుత్వం బాధితులకు మరింత అండగా ఉండాలని సూచించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులు త్వరగా కోలుకోవాలని తన తరపున, జనసేన పార్టీ తరపున మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు పవన్ కల్యాణ్ తెలిపారు.

ఏలూరులో పరిస్థితులను ప్రత్యక్షంగా పరిశీలించడానికి పార్టీలో క్రియాశీలకంగా పని చేస్తున్న ముగ్గురు వైద్య నిపుణులతో ప్రత్యేక బృందాన్ని పంపిస్తున్నట్లు తెలిపారు.. పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్ ఈ బృందానికి నేతృత్వం వహిస్తారని చెప్పారు. ఈ బృందంలో డాక్టర్ బొడ్డేపల్లి రఘు, డాక్టర్ ఎమ్.వెంకటరమణ సభ్యులుగా వుంటారని చెప్పారు. 

ఈ బృందం మంగళవారం నుంచి ఏలూరులో పర్యటిస్తుందని, ఈ వ్యాధి తీవ్రంగా ఉన్న ప్రాంతాలలో పర్యటించి పరిస్థితులను పరిశీలిస్తారని అన్నారు. ప్రజలు, బాధిత కుటుంబాలతో మాట్లాడి తగిన సలహాలు అందిస్తారని పవన్ కల్యాణ్ చెప్పారు.