జనసేన అధినేత పవన్ కల్యాన్ ఢిల్లీలో పర్యటిస్తున్నారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా పవన్ కల్యాణ్.. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ చీఫ్‌ జేపీ నడ్డాలతో సమావేశం కానున్నట్టుగా  తెలుస్తోంది.

జనసేన అధినేత పవన్ కల్యాన్ ఢిల్లీలో పర్యటిస్తున్నారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా పవన్ కల్యాణ్.. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ చీఫ్‌ జేపీ నడ్డాలతో సమావేశం కానున్నట్టుగా తెలుస్తోంది. ఏపీలో బీజేపీ-జనసేనల మధ్య పొత్తు ఉన్న నేపథ్యంలో.. బీజేపీ తనకు రోడ్డు మ్యాప్ ఇవ్వడం లేదని పవన్ కల్యాణ్ గతంలో పేర్కొన్న సంగతి తెలిసిందే. మరోవైపు తాను వైసీపీ వ్యతిరేక ఓటును చీలనివ్వని జనసేన అధినేత పవన్ కల్యాణ్ గత కొంతకాలంగా చెబుతున్న సంగతి తెలిసిందే. ఈ పరిణామాల నేపథ్యంలో పవన్ ఢిల్లీ పర్యటనలో బీజేపీ పెద్దలతో ఏ అంశాలను చర్చిస్తారనేది ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. 

అయితే ఏపీ రాజకీయ అంశాలతో పాటు, తెలంగాణకు సంబంధించిన పరిస్థితులపై కూడా బీజేపీ పెద్దలతో పవన్ కల్యాన్ చర్చించే అవకాశం ఉందని అంటున్నారు. ఏపీలో ప్రతిపక్ష నాయకులపై జరుగుతున్న దాడుల గురించి పవన్ ప్రస్తావించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఇక, జనసేనతో పాటు ఇతర విపక్షాల మీద అధికార వైసీపీ దాడులకు పాల్పడుతుందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పవన్ కల్యాణ్.. ఇటీవల బీజేపీ నేత సత్యకుమారుపై జరిగిన దాడిని కూడా తీవ్రంగా ఖండించారు. రాజధాని రైతులకు అండగా నిలుస్తున్న రాజకీయ పక్షాలను , సంఘాలను ముఖ్యమంత్రి, ఆయన అనుచరులు శత్రువులుగా చూస్తున్నారని పవన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ దౌర్జాన్యాలను త్వరలోనే కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. 

ఇదిలా ఉంటే.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఢిల్లీ పర్యటన తర్వాత.. పవన్ కల్యాణ్ ఢిల్లీకి వెళ్లడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. జగన్ ఢిల్లీ పర్యటన తర్వాత రాష్ట్రంలో మందస్తు ఎన్నికలు రానున్నాయనే ప్రచారం కూడా తెరమీదకు వచ్చింది. ఇటువంటి పరిస్థితుల్లో పవన్ ఢిల్లీ పర్యటనకు వెళ్లడం.. రాజకీయంగా తీవ్ర చర్చకు దారితీసింది.