ఏపీలోని ఆలయాల రక్షణపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వంపై తీవ్రమైన విమర్శలు చేశారు. ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తోందని ఆయన అన్నారు.
అమరావతి: ఆలయాల ఆస్తులు, విగ్రహాల పరిరక్షణ విషయంలో ప్రభుత్వ వైఖరిపై, తీసుకొనే చర్యల గురించి ఇప్పటికీ ఎలాంటి స్పష్టత లేదని జనసేన అధినేత పవన్ కల్యాణ్ విమర్శించారు. అంతర్వేదిలో రథం దగ్ధం ఘటన సమయంలోనే అన్ని ఆలయాలలో సి.సి.కెమెరాలు ఏర్పాటు చేస్తామని ప్రకటించారని ఆయన గుర్తు చేశారు.. ఇప్పుడు రామతీర్థంలో శ్రీ కోదండరామ స్వామి విగ్రహం తల నరికిన దుస్సంఘటన తరవాత అదే మాట చెబుతున్నారని అన్నారు.
రాష్ట్రంలో దేవాదాయ శాఖ పరిధిలో సుమారు 26వేల ఆలయాలు ఉన్నాయని, అందులో ఎన్ని ఆలయాలకు సి.సి.కెమెరాలతో నిఘా ఏర్పాటు చేశారనేది ప్రశ్నార్థకమేనని ఆయన అన్నారు. ఆలయాలే ఆ కెమెరాలను, పర్యవేక్షణను సిద్ధం చేసుకోవాలని ప్రభుత్వం చెబుతుండటం సరికాదని అన్నారు. ధూప దీప నైవేద్యాలకు కూడా నిధులు సమకూర్చని ప్రభుత్వం ఇప్పుడు సి.సి. కెమెరాలను ఆలయాలే ఏర్పాటు చేసుకోవాలనడం బాధ్యతను విస్మరించడమేనని అన్నారు.
గత ప్రభుత్వ కాలంలో కూల్చినవాటిని కడుతున్నామని చెబుతున్న ఈ పాలక పక్షం గత 18 నెలలుగా ఈ విషయాన్ని ఎందుకు పట్టించుకోలేదని పవన్ కల్యాణ్ ప్రశ్నించారు. విగ్రహాల ధ్వంసం ఘటనల క్రమంలోనే ప్రభుత్వం విజయవాడలో ఆలయాల పునర్నిర్మాణం అంటోందని అన్నారు.
విజయవాడ దుర్గ గుడి అభివృద్ధికి రూ.70 కోట్లు కేటాయించి పనులు మొదలుపెడతామన్నారని, ఆలయాల పునర్నిర్మాణం, అభివృద్ధి పనులు ప్రభుత్వ విధి నిర్వహణలో భాగమేనని ఆయన అన్నారు. వారు హిందూ ధర్మ పరిరక్షణ కోసం ప్రత్యేకంగా చేస్తున్న పనులుగా వాటిని చూడలేమని అన్నారు. కాంట్రాక్టుల్లో వచ్చే కమీషన్ల మీదపెట్టే శ్రద్ధ రాష్ట్రవ్యాప్తంగా 26వేల ఆలయాలకు సి.సి.కెమెరాలు ఏర్పాటు మీదా దృష్టిపెట్టాలని ఆయన సూచించారు.
ఉత్సవ విగ్రహాల్లా ఉండే కెమెరాలు కాకుండా ఆధునిక సాంకేతికత ఉన్న కెమెరాలను ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు పర్యవేక్షించే వ్యవస్థను సిద్ధం చేయాలని అన్నారు.. లేదంటే ఈ ప్రభుత్వం కేవలం ప్రకటనలకు, ప్రచారానికి మాత్రమే సి.సి. కెమెరాలు అనే మాట చెబుతుందని భావించాల్సి వస్తుందని పవన్ కల్యాణ్ అన్నారు.
Read Exclusive COVID-19 Coronavirus News updates, from Telangana, India and World at Asianet News Telugu.
వర్చువల్ బోట్ రేసింగ్ గేమ్ ఆడండి మిమ్మల్ని మీరు ఛాలెంజ్ చేసుకోండి ఇప్పుడే ఆడటానికి క్లిక్ చేయండి
Last Updated Jan 7, 2021, 7:32 PM IST