అమరావతి: శ్రీబాగ్ ఒడంబడికకు అనుగుణంగా వ్యవహరించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. అమరావతి నుంచి రాజధానిని తరలిస్తారనే ప్రచారం ఊపందుకున్న తరుణంలో జగన్ ఆలోచనకు సంబంధించిన మరో విషయం వెలుగులోకి వచ్చింది. 

ఎపి రాజధాని ఏర్పాటుకు శివరామకృష్ణన్ కమిటీ నిర్దిష్టమైన స్థలాన్ని సూచించలేదు. కానీ గుంటూరు, విజయవాడ మధ్య రాజధానిని ఏర్పాటు చేస్తే తప్పు అపుతుందని, ఇక్కడ రాజధానిని ఏర్పాటు చేస్తే ఆర్థికపరమైన, పర్యావరణ సంబంధమైన సమస్యలు తలెత్తుతాయని అభిప్రాయపడింది.

శివరామకృష్ణన్ కమిటీ సిఫార్సులతో చాలా వరకు ఏకీభవిస్తున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని నాలుగు మండలాల కింద విభజించాలని అనుకున్నారు .ఆంధ్ర, మధ్యాంధ్ర, కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాలకు ప్రాంతీయ మండళ్లను ఏర్పాటు చేయబోతున్నారు. తద్వారా పాలనను వికేంద్రీకరించాలని ఆయన భావిస్తున్నారు. 

రాష్ట్ర హైకోర్టును విశాఖపట్నంలో ఏర్పాటు చేయాలని, హైకోర్టు బెంచ్ ను కర్నూలు లేదా అనంతపురంలో పెట్టాలని శివరామకృష్ణన్ కమిటీ సూచించింది. అయితే, జగన్ అందుకు అనుకూలంగా లేరు. హైకోర్టును రాయలసీమలో ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నారు. 

మద్రాసు రాష్ట్రం నుంచి ఆంధ్ర విడిపోయిన సమయంలో రాజధాని ఆంధ్రలో ఉంటే, హైకోర్టు రాయలసీమలో ఉండాలని, హైకోర్టును ఆంధ్రప్రదేశ్ లో ఏర్పాటు చేస్తే, రాజధానిని రాయలసీమలో పెట్టాలని ఇరు ప్రాంతాల పెద్దల మధ్య ఒప్పందం కుదిరింది. ఆ ఒప్పందం మేరకే ఆంధ్ర రాష్ట్ర రాజధానిగా కర్నూలును ఎంపిక చేసుకున్నారు. అయితే, హైదరాబాదు రాష్ట్రంలో ఆంధ్ర రాష్ట్రం విలీనం కావడంతో పరిస్థితి మారిపోయింది. రాజధాని కాస్తా హైదరాబాదుకు మారింది. 

రాష్ట్ర విభజన జరిగి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత రాజధానిని అమరావతిలో నిర్మించాలని గత చంద్రబాబు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అమరావతిని తరలించడానికి జగన్ కు వెసులుబాటు లేకపోవడంతో హైకోర్టును రాయలసీమలో పెట్టాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఇది ఒక రకంగా శ్రీబాగ్ ఒడంబడికను అనుసరించి తీసుకున్న నిర్ణయమనే చెప్పవచ్చు. దానికితోడు, రాయలసీమ ప్రజలను సంతృప్తిపరిచే చర్య కూడా అవుతుంది. దానివల్ల ప్రాంతీయ విభేదాలు చోటు చేసుకునే అవకాశం ఉండదు.

అదే సమయంలో ఉత్తరాంధ్రను కూడా నిర్లక్ష్యం చేయకూడదనే ఉద్దేశంతో మరో నిర్ణయం కూడా జగన్ తీసుకున్నారు. ఐటి సంబంధిత కార్యాలయాలను విశాఖపట్నంలో ఏర్పాటు చేయాలనేది ఆయన ఆలోచనగా చెబుతున్నారు. అదే సమయంలో దేవాదాయ సంబంధమైన కార్యాలయాలను తిరుపతిలో ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి ఆలోచనగా చెబుతున్నారు .