Asianet News TeluguAsianet News Telugu

అనంతపురంలో రేపే వైఎస్ఆర్‌ కంటి వెలుగు ప్రారంభం

ఏపీ రాష్ట్రంలో కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు సీఎం వైఎస్ జగన్. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు జగన్ ఈ కార్యక్రమాన్ని చేపట్టనున్నారు.

Jagan to launch YSR Kanti Velugu scheme on Oct. 10
Author
Amaravati, First Published Oct 9, 2019, 5:44 PM IST

అమరావతి: ప్రజారోగ్య రంగంలో మరో విప్లవాత్మక కార్యక్రమానికి  వై ఎస్ జగన్ ప్రభుత్వం  గురువారం నాడు  శ్రీకారం చుట్టనుంది. ప్రజలందరికీ కంటి సమస్యలు దూరం చేయడానికి బృహత్తర కార్యక్రమం అమలును ప్రారంభిస్తోంది. రాష్ట్రంలో 5.40 కోట్ల మందికి నేత్ర పరీక్షలు చేసి, వారికి అవసరమైన చికిత్సలను అందిస్తుంది. 

కంటి పరీక్షలనుంచి శస్త్రచికిత్సల వరకూ అన్ని సేవలనూ ప్రభుత్వం ఉచితంగా కల్పిస్తుంది. అధికారంలోకి వచ్చిన వెంటనే ముఖ్యమంత్రి  వైయస్‌.జగన్‌ వైద్యం, విద్య, వ్యవసాయం, ఉపాథికల్పన తనకు అత్యంత ప్రాముఖ్యతలని స్పష్టంచేశారు. ఇందులో భాగంగానే  కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించాలని జగన్ ప్లాన్ చేశాడు.

 ఈమేరకు మేనిఫెస్టోలో తానిచ్చిన హామీలను అమలు చేసేదిశగా వడివడిగా అడుగులు వేస్తూ, ఒక్కో కార్యక్రమాన్ని అమలు చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు. ఇదే సమయంలో అధికారులతో సమీక్షల సందర్భంగా ఈ రంగాల్లో చేపట్టాల్సిన ముఖ్యమైన అంశాలపై  ముఖ్యమంత్రి దృష్టిసారించారు. 

ఆంధ్రప్రదేశ్‌లో ప్రజలు చాలామంది పౌష్టికాహారం, రక్తహీనత లాంటి సమస్యలతోపాటు కంటి సమస్యలతోకూడా ఎక్కువగా బాధపడుతున్నారని, దీన్ని నివారించడానికి తగిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి శ్రీ వైయస్‌.జగన్‌ ఆదేశాలు జారీచేశారు.

ఇందులో భాగంగానే వైయస్సార్‌ కంటివెలుగు కార్యక్రమం రూపొందింది. ప్రతి మంగళవారం స్పందనపై సమీక్ష సందర్భంగా వైయస్సార్‌ కంటివెలుగును ఎలా నిర్వహించాలన్నదానిపై  వైద్యారోగ్య శాఖ అధికారులతోపాటు, జిల్లా కలెక్టర్లతోనూ సీఎం సమీక్షించారు. సమావేశాల్లో వ్యక్తమైన అభిప్రాయాలను, సూచనలను పరిగణలోకి తీసుకుని వైయస్సార్‌ కంటి వెలుగుకు కార్యాచరణ సిద్ధంచేశారు. 

వైయస్సార్‌ కంటివెలుగులో భాగంగా మొదటగా సుమారు 70 లక్షల మంది బడిపిల్లలు అందరికీ ప్రాథమిక కంటి పరీక్షలు నిర్వహిస్తారు. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు స్కూల్స్‌ అన్నింటిలోకూడా పరీక్షలు జరుగుతాయి. 

ప్రపంచ దృష్టి దినం సందర్భంగా అక్టోబరు 10 నుంచి అక్టోబరు 16 వరకూ 6 పనిదినాల్లో ఈకార్యక్రమం పూర్తవుతుంది. కంటి సమస్యలు ఎదుర్కొంటున్నట్టుగా గుర్తించిన వారిని నవంబర్ 1 నుంచి డిసెంబర్ 31 వరకూ విజన్‌ సెంటర్లకు పంపిస్తారు. 

జిల్లా కలెక్టర్లు ఛైర్మన్లుగా వ్యవహరిస్తున్న టాస్క్‌ఫోర్స్‌ కమిటీలు జిల్లాస్థాయిలో ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తాయి. 160 మంది జిల్లా ప్రోగ్రామ్ ఆఫీసర్లు, 1415 మంది వైద్యాధికారులు దీంట్లో భాగస్వాములు అవుతున్నారు. 

అన్ని పీహెచ్‌సీలకు కంటిపరీక్షలకు సంబంధించిన కిట్లను ఇప్పటికే పంపించారు. 42360 మంది ఆశావర్కర్లు, 62500 మంది టీచర్లు, 14000 మంది ఏఎన్‌ఎంలు, 14000 మంది ప్రజారోగ్య సిబ్బంది అన్ని స్కూళ్లలో జరిగే వైయస్సార్‌ కంటి వెలుగు కార్యక్రమంలో పాలుపంచుకుంటారు. 

ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో చదువుతున్న 70 లక్షల మందికి పైగా విద్యార్థులకు మొదటి విడతలో కంటి పరీక్షలు నిర్వహిస్తారు. ఆ తర్వాత మిగిలిన మూడు, నాలుగు, ఐదు, ఆరు దశల్లో కమ్యూనిటిబేస్ ఆధారంగా కంటి పరీక్షలు నిర్వహించనున్నారు. ఫిభ్రవరి 1, 2020 నుంచి వీరికి పరీక్షలు, చికిత్సలు మొదలుపెడతారు. 

వైయస్సార్‌ కంటివెలుగును ఈనెల 10వ తేదీన (రేపు) అనంతపురంలో సీఎం  వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రారంభించనున్నారు. ఈ మేరకు అనంతపురం జూనియర్ కాలేజీలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు.

Follow Us:
Download App:
  • android
  • ios