అమరావతి: మద్యపాన నిషేదం దిశగా ఇటీవల తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా జగన్ సర్కార్ మరో ముందడుగు వేసింది. రాష్ట్రంలో మరో 535 మద్యం షాపులను ఎక్సైజ్‌ శాఖ తగ్గించింది. సోమవారం నుండే ఇది అమల్లోకి రానుంది. దీంతో ఇప్పటి వరకు రాష్ట్రంలో 3500 మద్యం షాపులు ఉండగా ఇప్పుడు ఆ సంఖ్య 2965కి తగ్గనుంది. 

వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తొలుత 20 శాతం షాపులు తగ్గించింది. ఇప్పుడు మరో 13 శాతం తగ్గించింది. దీంతో మొత్తం 33శాతం తగ్గించినట్లైంది. ఈ పదమూడు శాతం తగ్గింపును జిల్లాల వారీగా చేశారు. మద్య నిషేధమే లక్ష్యమని చెబుతున్న జగన్ ప్రభుత్వం అందులో భాగంగానే షాపులను తగ్గించినట్లు చెబుతోంది. 

read more  మద్యపాన నిషేదం దిశగా... జగన్ సర్కార్ మరో కీలక నిర్ణయం

రాష్ట్రంలో సంపూర్ణ మద్యనిషేధం దిశగా అడుగులేస్తున్న వైసిపి ప్రభుత్వం ఇదివరకే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మద్యం దుకాణాల్లో 33 శాతం దుకాణాలను రద్దు చేస్తూ కీలక ఉత్తర్వులను జారీ చేసింది. తమ పార్టీ అధికారంలోకి వస్తే దశలవారీగా సంపూర్ణ మద్య నిషేధాన్ని అమలు చేస్తామని  హామీ ఇచ్చిన విధంగానే మద్యం దుకాణాల సంఖ్యను తగ్గిస్తున్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. అందుకోసం షాపుల సంఖ్యను మెళ్లిమెళ్లిగా తగ్గిస్తున్నారు.  

సంపూర్ణ మద్య నిషేధానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఆదాయం కంటే ప్రజాహితానికే తమ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని మంత్రి పుష్ప శ్రీవాణి స్పష్టం చేసారు. గతంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ప్రజా సంక్షేమాన్ని గాలికొదిలేసి మద్యం షాపులు, బార్ల సంఖ్యను భారీగా పెంచడంతో పాటుగా, గ్రామీణ ప్రాంతాల్లో అక్రమ మద్యం బెల్టు షాపులను టీడీపీ నేతలు తమ ఆదాయవనరుగా మార్చుకున్నారని విమర్శించారు.

టీడీపీ హయాంలో రాష్ట్రంలో ఏరులైపారిన మద్యం కారణంగా అనేక మంది పేదల జీవితాలు చిన్నాభిన్నమైయ్యాయని, ఈ విషయాన్ని గుర్తించిన జగన్మోహన్ రెడ్డి తమ పార్టీ అధికారంలోకి వస్తే దశలవారీగా సంపూర్ణ మద్యనిషేధాన్ని తీసుకొస్తామని తన పాదయాత్రలో హామీ ఇచ్చారని మంత్రి పేర్కొన్నారు. 

రాష్ట్రంలో ఉన్న 40 శాతం బార్లు తగ్గిస్తూ గతంలోనే నిర్ణయం తీసుకొని, వాటిని రద్దు చేయడంతో పాటుగా మద్యం షాపులకు అనుబంధంగా ఉండే పర్మిట్ రూమ్ లను కూడా ప్రభుత్వం ఇదివరకే పూర్తిగా తొలగించిందని గుర్తు చేసారు. అధికారికంగా ఉండే మద్యం దుకాణాలు, బార్లు మాత్రమే కాకుండా గత ప్రభుత్వం హయాంలో పెంచి పోషించిన 43 వేల అక్రమ బెల్టు షాపులను కూడా ప్రభుత్వం పూర్తిగా నిర్మూలించడం జరిగిందని పుష్ప శ్రీవాణి తెలిపారు.