ఏపీలో ఉద్యోగులకు కాబోయే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ శుభవార్త చెప్పనున్నారు. ఏపీలో పనిచేసే ఉద్యోగులకు పనిభారం తగ్గించాలని ఆయన నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 30వ తేదీన జగన్ ...ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్న సంగతి తెలిసిందే. కాగా... తన పాలనలో తనదైన మార్క్ చూపించాలని జగన్ భావిస్తున్నారు.

ఉద్యోగుల మనోభావాలు తెలుసుకునే దిశగా జగన్ ప్రయత్నాలు ప్రారంభించారు. కాగా.. ఇప్పటికే ఉదయం 10:30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే పని గంటలని స్పష్టం చేశారు. కాగా.. ఇది ఉద్యోగులకు శుభవార్తేనని చెప్పుకోవచ్చు. జగన్ నిర్ణయంతో ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

సాయంత్రం 6 తర్వాత ఉద్యోగులకు పని భారం ఉండకూడదని జగన్ ఆదేశించారు. ప్రతి ఫైల్‌కి నిర్దిష్ట గడువులోగా క్లియర్ చేసేలా పరిపాలన సంస్కరణలు తీసుకొస్తున్నారు. ఫైల్స్‌పై అనవసరపు కొర్రీలు, జాప్యాలు లేకుండా చర్యలు తీసుకోవాలని ఉద్యోగులు, అధికారులను జగన్ ఆదేశించినట్లు తెలుస్తోంది. ఉద్యోగులపై క్రమశిక్షణ చర్యలలో కూడా సంస్కరణలు తీసుకొస్తానని జగన్ ఉన్నతాధికారులతో చెప్పినట్లు సమాచారం.
 
కాగా.. పదవీ విరమణ చేసే ఉద్యోగుల ప్రయోజనాలు హరించే నిర్ణయాలకు చెక్ పెట్టేలా చర్యలు తీసుకుంటామన్నారు. పెన్షన్ రూల్స్ అమలులో సంస్కరణలు అమలు చేసేందుకు వైఎస్ జగన్ సిద్ధమవుతున్నారు. ప్రభుత్వం రూల్స్ పేరుతో రిటైర్మెంట్ దగ్గర పడిన ఉద్యోగులను వేధించకుండా చర్యలకు ప్రణాళికలు చేస్తున్నారు. కాగా.. ఉద్యోగుల నుంచి సూచనలు, సలహాలు స్వీకరించేందుకు సీఎస్ కార్యాలయం ఏర్పాటు చేస్తున్నట్లు జగన్ సంస్కరణలు తెస్తున్నారు.