కొద్ది రోజుల క్రితం సాదిక్‌ షెడ్డు లావాదేవీలను ఐటీ అధికారులు పరిశీలించి రూ.50లక్షల జరిమానా విధించారు. అధికారులు తమకూ కొంత డబ్బు ఇవ్వాలని సాదిక్‌ను డిమాండ్‌ చేసినట్లు కుటుంబీకులు ఆరోపిస్తున్నారు.

ఐటీ అధికారుల వేధింపులు తట్టుకోలేక కృష్ణా జిల్లాలోని పెనమలూరు మార్కెట్‌ మాజీ డైరెక్టర్‌ మహ్మద్‌ సాదిక్‌(46) ఆత్మహత్యకు పాల్పడ్డారు. పెనమలూరు మండలంలోని కానూరుకు చెందిన ఆయనకు ఆటోనగర్‌లో లారీ బాడీ బిల్డింగ్‌ షెడ్డు ఉంది. ప్రార్థన మందిరానికి వెళుతున్నట్లు ఆదివారం తెల్లవారుజామున ఇంట్లో చెప్పి బయలుదేరి తిరిగి రాలేదు. ఆందోళనకు గురైన కుటుంబీకులు సోమవారం పెనమలూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రాత్రి ఎనిమిదింటి ప్రాంతంలో ఆయన మృతదేహాన్ని కరువు కాల్వలో తోట్లవల్లూరు ప్రాంతంలో పోలీసులు గుర్తించారు.


సాదిక్‌ ఆత్మహత్యకు ఐటీ అధికారులే కారణమని కుటుంబీకులు ఆరోపిస్తున్నారు. కొద్ది రోజుల క్రితం సాదిక్‌ షెడ్డు లావాదేవీలను ఐటీ అధికారులు పరిశీలించి రూ.50లక్షల జరిమానా విధించారు. అధికారులు తమకూ కొంత డబ్బు ఇవ్వాలని సాదిక్‌ను డిమాండ్‌ చేసినట్లు కుటుంబీకులు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన తీవ్ర ఒత్తిడికి గురయ్యారని, వ్యక్తిగత సమస్యలు తోడవడంతో కాలువలో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డారని చెబుతున్నారు. పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు.