గుంటూరు జిల్లాకు చెందిన వైసీపీ ఎమ్మెల్యే మహ్మద్ ముస్తాఫా షేక్ కుటుంబ సభ్యుల ఇళ్లలో ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి.
గుంటూరు జిల్లాకు చెందిన వైసీపీ ఎమ్మెల్యే మహ్మద్ ముస్తాఫా షేక్ కుటుంబ సభ్యుల ఇళ్లలో ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. రెండో రోజు ఐటీ అధికారులు సోదాలు కొనసాగిస్తున్నారు. ఈ సోదాల్లో ఐటీ అధికారులు కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నట్టుగా తెలుస్తోంది. ముస్తాఫా సోదరుడు కనుమ ఇంటితో పాటు, ఆయన బంధువుల్లో కొందరి ఇళ్లలో కూడా సోదాలు జరుగుతున్నాయి. ప్రస్తుతం కనుమ అంజుమన్ కమిటి అధ్యక్షుడుగా ఉన్నారు. అయితే ముస్తాఫా వ్యాపార లావాదేవీలు మొత్తం కనుమ చూసుకుంటారని తెలుస్తోంది. కనుమతో కలిసి ముస్తాఫా పొగాకుతో సహా పలు వ్యాపారాల్లో భాగస్వామిగా ఉన్నట్టుగా సమాచారం. ఈ క్రమంలోనే వ్యాపార లావాదేవీలకు సంబంధించిన వివరాలపై ఐటీ అధికారులు ఆరా తీస్తున్నట్టుగా తెలుస్తోంది.
ఇక, మంగళవారం ఉదయం నుంచే ముస్తాఫా కుటుంబ సభ్యులలో ఐటీ అధికారుల సోదాలు మొదలయ్యాయి. కేంద్ర బలగాల రక్షణలో ఐటీ అధికారులు సోదాలు కొనసాగిస్తున్నారు. మరోవైపు ప్రకాశం, బాపట్ల జిల్లాల్లో కూడా పలువురు పొగాకు వ్యాపారుల ఇళ్లలో, కార్యాలయాల్లో ఐటీ అధికారులు మంగళవారం ఆకస్మిక తనిఖీలు చేపట్టిన సంగతి తెలిసిందే. కార్యాలయాల్లో రికార్డులను ఐటీ అధికారులు పరిశీలించారు. ఈ క్రమంలోనే ముస్తాఫా కుటుంబ సభ్యుల ఇళ్లపై కూడా ఐటీ సోదాలు జరుగుతున్నట్టుగా ఆయన సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి.
