తిరుపతి దేవస్థానంలో ఇస్రో శాస్త్రవేత్తల పూజలు.. రేపు చంద్రయాన్ 3 ప్రయోగం
ఇస్రో శాస్త్రవేత్తలు గురువారం చంద్రయాన్ 3 సూక్ష్మ నమూనాతో తిరుమల తిరుపతి దేవస్థానంలో పూజలు నిర్వహించారు. ఈ మిషన్ విజయవంతం కావాలని దేవుడి ఆశీర్వాదం కోసం ప్రత్యేక పూజలు చేశారు. రేపు మధ్యాహ్నం 2.35 గంటలకు శ్రీహరి కోట నుంచి చంద్రయాన్ 3ని ప్రయోగించనున్నారు.
అమరావతి: ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ఇస్రో) శాస్త్రవేత్తలు గురువారం తిరుమల తిరుపతి దేవస్థానానికి విచ్చేశారు. చంద్రయాన్ 3 నమూనాను తీసుకుని వచ్చిన వారు తిరుమలలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. రేపు ప్రయోగించనున్న చంద్రయాన్ 3 ప్రయోగం విజయవంతం కావాలని ప్రార్థించారు. అందుకు ఆశీర్వాదం కావాలని కోరారు.
గొప్ప అంతరిక్ష ప్రయోగాలకు ముందు ఇస్రో శాస్త్రవేత్తలు ఇలా దైవ ఆశీర్వాదం కోసం ప్రార్థనలు చేయడం ఆనవాయితీగా వస్తున్నది. ఆశించిన ఫలితాలు రావాలని ఇస్రో శాస్త్రవేత్తలు తిరుపతి దేవస్థానంలో పూజలు చేశారు.
చంద్రయాన్ 3 మిషన్‌ను శుక్రవారం మధ్యాహ్నం 2.35 గంటలకు ఆంధ్రప్రదేశ్‌లో శ్రీహరి కోటలోని సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి ప్రయోగిస్తారు.
ఇంతకు ముందు ఇస్రో ప్రయోగించిన చంద్రయాన్ 2 అనుకున్న ఫలితాలు ఇవ్వలేదు. అది పాక్షికంగా విజయవంతమైంది. ఈ మిషన్‌ను ఆర్బిటర్ విజయవంతంగా చంద్రుడి కక్ష్యలోకి తీసుకెళ్లింది. కానీ, విక్రమ్ ల్యాండర్ సరిగ్గా చంద్రుడిపై ల్యాండ్ కాలేకపోయింది. దీంతో ఆ ల్యాండర్ క్రాష్ అయింది. బలంగా చంద్రుడిపై పడిపోవడంతో అందులోని రోవర్ కూడా ధ్వంసమైంది.
చంద్రయాన్ 2లో ల్యాండర్ అలా క్రాష్ కావడానికి సాఫ్ట్‌వేర్‌లోని లోపమే అనే నిర్ధారణకు వచ్చినట్టు సమాచారం. ఈ సారి అలాంటి లోపాలేవీ లేకుండా జాగ్రత్తలు తీసుకున్నట్టు తెలిసింది. ల్యాండర్ సేఫ్‌గా ల్యాండ్ కావడానికి జాగ్రత్తలు తీసుకున్నామని, ల్యాండర్ కాళ్లనూ పొడుగ్గా తీర్చిదిద్దినట్టు కొన్ని వర్గాలు తెలిపాయి.
చంద్రయాన్ 2 మిషన్ ప్రయోగానికి ముందరా తిరుమల, తిరుపతి దేవస్థానంలో దాని చిన్ని నమూనాకు పూజలు చేశారు. ఆ మిషన్‌ను ఇస్రో చైర్మన్ కే శివన్ సారథ్యంలో ప్రయోగించారు. చంద్రయాన్ 2 మిషన్ సక్సెస్‌ను ప్రధాని మోడీ స్వయంగా వీక్షించాలని అనుకున్నారు. కానీ, అది అనుకున్నట్టుగా ల్యాండ్ కాకపోవడంతో కన్నీరుపెట్టుకున్న కే శివన్‌ను ప్రధాని మోడీ ఓదార్చిన వీడియోలు, ఫొటోలు అప్పుడు వైరల్ అయ్యాయి.