అమరావతి: కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న ఈ నేపథ్యంలోనూ స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్లాన్ చేస్తున్నట్లు ఊహాగానాలు చెలరేగుతున్నాయి. ఓ ఆంగ్లపత్రికలో వచ్చిన వార్తాకథనాన్ని జోడిస్తూ టీడీపీ అధినేత, ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు ఆ మేరకు ట్వీట్ చేశారు.

ఇది హాస్యమా? ప్రపంచ కరోనా వైరస్ పై పోరాటం చేస్తున్న ఈ స్థితిలో వైఎస్ జగన్ స్థానిక సంస్థల ఎన్నికలకు తాజా షెడ్యూల్ విడుదల చేయడానికి అధికారులతో మంతనాలు జరుపుతున్నారని చంద్రబాబు ట్వీట్ చేశారు. జగన్ పాఠాలు నేర్చుకోవడంలేదని, రాజకీయ ప్రయోజనాల కోసం లక్షలాది మంది ప్రాణాలను ప్రమాదంలో పడేస్తున్నారని ఆయన అన్నారు. ఇది షాకింగ్ విషయమని కూడా చంద్రబాబు అన్నారు. 

చంద్రబాబు జోడించిన కథనం ప్రకారం.... మే 3వ తేదీన లాక్ డౌన్ ముగిసిన తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించే విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా పరిశీలిస్తోంది. ఇందుకుగాను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ శుక్రవారంనాడు ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కమిషనర్ విజయ కుమార్ సమావేశంలో ఆ విషయాన్ని ప్రస్తావిస్తూ దక్షిణ కొరియాలో జరిగిన ఎన్నికల ఫొటోలను చూపించినట్లు సమాచారం. 

దక్షిణ కొరియాలో నేషనల్ అసెంబ్లీకి పెద్ద యెత్తున ఎన్నకలు నిర్వహించినప్పుడు మనం స్థానిక సంస్థలను ఎందుకు జరపలేమని ఆయన అన్నట్లు చెబుతున్నారు. కాగా, ఎన్నికల తాజా షెడ్యూల్ కోసం ముఖ్యమంత్రి కార్యాలయం అధికారులు రాష్ట్ర ఎన్నికల సంఘంతో సమన్వయం చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. 

కాగా, కొత్త రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఆధ్వర్యంలో ఎన్నికలు నిర్వహించే ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. కొత్త ఎన్నికల కమషనర్ కనగరాజ్ నిర్ణయాలు తీసుకోకుండా నిలువరించాలని మాజీ ఎన్నికల కమిషనర్ రమేష్ కుమార్ చేసిన విజ్ఞప్తిని హైకోర్టు తిరస్కరించింది. దీంతో ఎన్నికల నిర్వహణకు ఏ విధమైన అడ్డంకులు ఉండవని జగన్ ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. 

కనగరాజ్ నియామకం రాజ్యాంగవిరుద్ధమని తేలితే ఆయన తీసుకుని నిర్ణయాలు కూడా చెల్లవని హైకోర్టు తేల్చి చెప్పింది. అయితే, కొత్త ఎన్నికల కమిషనర్ కు నిర్ణయాలు తీసుకునే అన్ని అధికారులు ఉన్నాయని ప్రభుత్వాధికారులు భావిస్తున్నారు. మే 3వ తేదీన లాక్ డౌన్ ముగిసిన తర్వాత సాధారణ పరిస్థితుల ఏర్పాటు చర్యలు తీసుకుని, ఎన్నికల ప్రచారం, సమావేశాలు, ప్రజల కదలికల వంటివాటిపై కొన్ని ఆంక్షలు విధిస్తూ ఎన్నికలు నిర్వహించాలని జగన్ ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. దక్షిణ కొరియా బ్యాలెట్ పేపర్లు వాడి ఎన్నికలు నిర్వహించిన విషయాన్ని అధికారులు ప్రస్తావిస్తున్నారు.