Asianet News TeluguAsianet News Telugu

మేనమామంటూ ఇదేం పని జగన్... బిల్లుల బకాయిలపై విస్మయం వ్యక్తం చేసిన మంత్రి లోకేశ్‌

ఇటీవల విద్యాశాఖపై మంత్రి లోకేశ్‌ ఉన్నతాధికారులతో నిర్వహించిన సమీక్షలో గత ప్రభుత్వం విద్యాదీవెన, వసతిదీవెన పథకాల కింద రూ.3,480 కోట్లు బకాయిలు పెట్టడంతో వారి సర్టిఫికెట్లు వివిధ విద్యాసంస్థల్లో నిలచిపోయిన విషయం బట్టబయలైంది.

Is this the work of Jagan who pretends to be uncle...? Minister Lokesh on arrears of bills GVR
Author
First Published Jul 5, 2024, 8:43 AM IST | Last Updated Jul 5, 2024, 8:43 AM IST

ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి చెప్పే మాటలకు, చేసే పనులకు పొంతన ఉండదని మరోసారి తేటతెల్లమైంది. చిన్నారులకు మేనమామలా ఉండి వారి యోగక్షేమాలు చూసుకుంటానని చెప్పిన నాటి సీఎం జగన్మోహన్ రెడ్డి.. వాస్తవానికి విద్యార్థులు, చిన్నారులకు తీరని ద్రోహం చేశారు. 

మధ్యాహ్నభోజన పథకం అమలుపై సంబంధిత అధికారులతో వెలగపూడిలోని సెక్రటేరియట్‌లో నిర్వహించిన సమీక్షలో చేదు నిజాలు వెల్లడయ్యాయి. గుంటూరు కార్పొరేషన్ పరిధిలోని పలు పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకంలో భాగంగా ఇవ్వాల్సిన గుడ్డును ఇవ్వడం లేదని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్‌ దృష్టికి వచ్చింది. వెంటనే స్పందించిన లోకేశ్‌ సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో విద్యార్థులకు గుడ్ల పంపిణీ నిలిపివేతకు గత ప్రభుత్వ నిర్వాకమే కారణమని స్పష్టమైంది. 

రాష్ట్ర వ్యాప్తంగా గుడ్ల కాంట్రాక్టర్లకు డిసెంబర్ నుంచి 112.5 కోట్ల రూపాయలు, చిక్కీల కాంట్రాక్టర్లకు గత ఏడాది ఆగస్టు నుంచి రూ.66 కోట్ల మేర జగన్ ప్రభుత్వం బకాయిలు పెట్టి వెళ్లిపోయిందని గుర్తించారు. భారీగా బిల్లులు బకాయి పడటంతో గుంటూరు కార్పొరేషన్ పరిధిలోని పలు పాఠశాలలకు గుడ్లు సరఫరా చేసే కాంట్రాక్టర్ గుడ్ల సరఫరా నిలిపివేశారు. వాస్తవం ఇలా ఉంటే టీడీపీ ప్రభుత్వం వచ్చాక విద్యార్థులకు గుడ్ల పంపిణీ నిలిపివేశారంటూ వైసీపీకి చెందిన మీడియా తప్పుడు ప్రచారం మొదలెట్టిందని మంత్రి మండిపడ్డారు. గుడ్లు, చిక్కీలకు గత ప్రభుత్వం భారీగా బకాయిలు పెట్టి వెళ్లడంపై విస్మయం వ్యక్తం చేశారు. చిన్నారులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా గుడ్లు, చిక్కీలను పంపిణీ చేయాలని, గత ప్రభుత్వం వదిలేసి వెళ్లిన బకాయిలను అతిత్వరలో చెల్లిస్తామని భరోసా ఇచ్చారు. గుడ్లు సరఫరా చేస్తున్న కాంట్రాక్టర్లంతా మధ్యాహ్న భోజన పథకాన్ని సమర్థవంతంగా అమలుచేసేందుకు సహకరించాలని కోరారు. 

ఇదిలా ఉండగా... ఇటీవల విద్యా శాఖపై మంత్రి లోకేశ్‌ ఉన్నతాధికారులతో నిర్వహించిన సమీక్షలో గత ప్రభుత్వం విద్యా దీవెన, వసతి దీవెన పథకాల కింద రూ.3,480 కోట్లు బకాయిలు పెట్టడంతో వారి సర్టిఫికెట్లు వివిధ విద్యా సంస్థల్లో నిలచిపోయిన విషయం బట్టబయలైంది. మేనమామలా చూసుకోవడమంటే విద్యార్థులు, చిన్నారులను అవస్థల పాలుజేయడమా అని మంత్రి లోకేశ్‌ ప్రశ్నించారు. విద్యార్థులను ఇబ్బంది పెట్టొద్దని ఆయా సంస్థలకు సూచించారు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios