AP Politics: హీటెక్కుతోన్న ఏపీ రాజకీయం.. ఎన్నికల బరిలోకి కొత్త నేతలు.. !
AP Politics: ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ ఆంధ్రప్రదేశ్ రాజకీయం హీటెక్కుతోంది. ఇప్పటికే అన్ని రాజకీయ పార్టీలు తమ అభ్యర్థుల ఎంపిక, గెలుపుపై స్పెషల్ ఫోకస్ పెట్టాయి. ఈ నేపథ్యంలోనే ఎన్నికల్లో పోటీ చేసేందుకు పలువురు కొత్త నేతలు ఆసక్తి చూపుతున్నారు. ఇంతకీ ఆ అభ్యర్థి ఎవరు?
AP Politics: ఆంధ్రప్రదేశ్ రాజకీయం హీటెక్కుతోంది. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలు తమ అభ్యర్థుల ఎంపిక, గెలుపుపై స్పెషల్ ఫోకస్ పెట్టాయి. ఈ నేపథ్యంలో అధికార వైసీపీ కాస్తా దూకుడుగా వ్యవహరిస్తోంది. ఇప్పటికే దాదాపు అన్ని నియోజకవర్గాలకు ఇంఛార్జులను ప్రకటించింది. ఎలాగైనా మరోసారి తమ ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందని దీమా వ్యక్తం చేస్తోంది.
మరోవైపు..ఇతర ప్రతిపక్ష పార్టీలు కూడా రాబోయే ఎన్నికలపై ఫోకస్ పెట్టాయి. రానున్న ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల ఎంపికపై కసరత్తు ముమ్మరం చేశాయి. ఈ తరుణంలో టీడీపీ- జనసేన పొత్తు ఖరారు అయ్యింది. ఇప్పటికే ఇరుపార్టీల అధినేతలు పలు దఫాలుగా భేటీ అయ్యారు. అభ్యర్థుల ఎంపికపై ఓ క్లారిటీకి వచ్చారు. మరోవైపు.. వీరితో బీజేపీ కూడా పొత్తు చర్చలు సాగిస్తున్నది. దాదాపు తుది దశకు చేరుకున్నాయి.
ఈ నేపథ్యంలోనే ఎన్నికల్లో పోటీ చేసేందుకు పలువురు కొత్త నేతలు ఆసక్తి చూపుతున్నారు. ఈ క్రమంలో టీడీపీ విషయానికి వస్తే.. సిట్టింగ్ నియోజకవర్గాల్లో అభ్యర్థుల ఎంపికపై పార్టీ ఫుల్ క్లారిటీతో ఉన్నట్లు తెలుస్తోంది. 2019 ఎన్నికల్లో టీడీపీ 23 నియోజకవర్గాల్లో గెలుపొందగా.. వారిలో నలుగురు ఎమ్మెల్యేలు జంప్ జలానీ అయ్యారు. వైసీపీ కండువా కప్పుకుని పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. మిగిలిన 19 స్థానాల్లో సిట్టింగ్ అభ్యర్థులే బరిలో దించాలని టీడీపీ యోచిస్తోంది. మిగిలిన నాలుగు నియోజకవర్గాల్లో కూడా తెలుగుదేశం పార్టీ మరోసారి గెలుస్తుందని సర్వే రిపోర్టులు వెల్లడిస్తున్నాయి.
దీంతో నూతన అభ్యర్థులను బరిలో దించాలని భావిస్తున్నారు. ఈ తరుణంలో గన్నవరం నియోజకవర్గం నుంచి యార్లగడ్డ వెంకట్రావును బరిలో దింపనున్నారు. ఇక గుంటూరు పశ్చిమ నియోజకవర్గంపై చంద్రబాబు స్ఫెషల్ ఫోకస్ పెట్టారు. వాస్తవానికి ఆ నియోజకవర్గం నుంచి గెలిచిన మద్దాలి గిరి వైసీపీకి మద్దతు ఇస్తున్నారు. కానీ, ఇప్పటికే ఈ స్థానం రెండు సార్లు గెలిచిన టీడీపీ ఆ నియోజకవర్గంలో హ్యాట్రిక్ గెలుపు సాధించాలని కసరత్తు చేస్తుంది.
గుంటూరు పశ్చిమ నియోజకవర్గం వైసీపీ ఇంఛార్జుగా ఇప్పటికే మంత్రి విడదల రజినీ కొనసాగుతున్నారు. దీంతో ఆమెకు ధీటుగా మహిళా అభ్యర్థిని ఎన్నికల బరిలో దింపాలని టీడీపీ నేతలు భావిస్తున్నారు. ఈ తరుణంలో ఎలాంటి రాజకీయ అనుభవం, ఏ మాత్రం రాజకీయ పరిచయం లేని ప్రముఖ పారిశ్రామిక వేత్త వీఆర్ శ్రీ లక్ష్మీ శ్యామలను గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుంచి ఎన్నికల బరిలో దించాలని భావిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం.
వ్యాపార రంగంలో రాణిస్తున్న శ్రీ లక్ష్మి శ్యామల... కృష్ణ, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో ఇప్పటికే పలుసామాజిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. డెయిరీ వ్యాపారం ద్వారా పాడి రైతులకు అండగా నిలిచారు. అదే సమయంలో చారిటబుల్ ట్రస్ట్ ద్వారా గుంటూరు, ప్రకాశం జిల్లాలో పలుసేవా కార్యక్రమాలను శ్రీ లక్ష్మీ శ్యామల నిర్వహిస్తున్నారు. అలాగే శిథిల వ్యవస్థలో ఉన్నా.. పలు ఆలయాలను పునర్నించారు. ఆధ్యాత్మిక రంగంలో శ్రీ లక్ష్మీ శ్యామల విశేష కృషి చేశారు. డెయిరీ వ్యాపారంలో రాణిస్తున్న శ్రీ లక్ష్మి శ్యామల... వివిధ వ్యాపారాల్లో సైతం పెట్టుబడులు పెట్టి సక్సెస్ అయ్యారు.
గతేడాది నవంబర్ నెలలో తొలిసారి పెరంబదూర్ లో చంద్రబాబుతో ఆమె భేటీ అయినట్టు, ఇప్పటికే పలు దఫాలు పార్టీ కీలక నేతలు చర్చించినట్లు తెలుస్తోంది. గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుంచి వైసీపీ తరఫున మంత్రి రజిని బరిలో నిలువగా.. టీడీపీ తరఫున మహిళను పోటీలో నిలబెడితే... గత ఎన్నికల్లో కంటే ఎక్కువ మెజారిటీ వస్తుందని చంద్రబాబు భావిస్తున్నారట. ఈ నియోజక వర్గం నుంచి ఎన్నికల బరిలో నిలుస్తారో తెలియాలంటే.. పార్టీ ప్రకటన వరకు ఆగాల్సిందే.