విశాఖ స్టీల్ ప్లాంట్‌కు సంబంధించిన బిడ్డింగ్‌లో తాము పాల్గొంటామని తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం రెండు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
హైదరాబాద్: విశాఖ స్టీల్ ప్లాంట్‌కు సంబంధించిన బిడ్డింగ్‌లో తాము పాల్గొంటామని తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. కేంద్రం ప్రభుత్వ సంస్థలను ప్రైవేటీకరణ చేస్తుందని.. ఇందుకు తాము వ్యతిరేకమని బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కొంతకాలంగా చెబుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే విశాఖ స్టీల్ ప్లాంట్‌ను ఆదుకుంటామని, బిడ్ వేయడానికి సిద్దంగా ఉన్నామని కేసీఆర్ సర్కార్ నుంచి ప్రకటన వెలువడింది. ఈ క్రమంలోనే సింగరేణి అధికారుల బృందం విశాఖ స్టీల్ ప్లాంట్ వెళ్లి.. ఆర్‌ఐఎన్‌ఎల్‌తో భాగస్వామ్యం కోసం ఆసక్తి వ్యక్తీకరణ (ఈవోఐ)లో పాల్గొనే సాధ్యాసాధ్యాలను అధ్యయనం చేస్తుంది. ఈ పరిణామాలపై స్పందిస్తున్న ఏపీ ప్రభుత్వం.. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకం అయినప్పుడు బిడ్డింగ్‌లో తెలంగాణ సర్కార్ ఎలా పాల్గొంటుందని ప్రశ్నిస్తుంది.
అయితే ఈ పరిణామాలు రెండు తెలుగు రాష్ట్రాలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే.. చాలా కాలంగా తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్, వైఎస్ జగన్‌ల మధ్య సత్సబంధాలు కొనసాగుతూ వస్తున్నాయి. ఇద్దరి మధ్య మంచి అండర్ స్టాండింగ్ కూడా ఉంది. అయితే తాజాగా బీఆర్ఎస్‌తో జాతీయ రాజకీయాల్లోకి వెళ్లాలని భావిస్తున్న కేసీఆర్.. ఏపీలో కూడా తన పార్టీ విస్తరించేందుకు సిద్దమైన సంగతి తెలిసిందే. ఇప్పటికే కొందరు నేతలకు ఏపీ బీఆర్ఎస్ యూనిట్ బాధ్యతలను కేసీఆర్ అప్పగించారు. అక్కడి ప్రజల నుంచి మద్దతు కూడగట్టుకునే ఆలోచనలో భాగంగానే.. విశాఖ స్టీల్ ప్లాంట్ బిడ్డింగ్‌లో పాల్గొనేందుకు కేసీఆర్ నిర్ణయం తీసుకుని ఉంటారనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి.
అయితే తాజాగా విశాఖ స్టీల్ ప్లాంట్ బిడ్డింగ్‌లో పాల్గొనాలని కేసీఆర్ సర్కార్ తీసుకున్న నిర్ణయం.. బీఆర్ఎస్, వైసీపీల మధ్య మాటల యుద్దం కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఓవైపు తాము ప్రైవేటీకరణకు వ్యతిరేకమని జగన్ సర్కార్ స్పష్టం చేస్తుంది. కేసీఆర్ సర్కార్ తీసుకున్న నిర్ణయంపై పలువురు వైసీపీ నేతలు ప్రశ్నలు సంధిస్తున్నారు. మరోవైపు బీఆర్ఎస్ ముఖ్య నేతలు చేస్తున్న ప్రకటనలు.. జగన్ సర్కార్‌ను ఇరుకున పెట్టేలా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా కేటీఆర్, హరీష్ రావుల వ్యాఖ్యలు అదే కోవలోకి వస్తాయి. ఉద్యమ సమయంలో వీరిద్దరు చేసిన కామెంట్స్.. ప్రస్తుతం మాట్లాడుతున్న మాటలకు భారీ వ్యత్యాసం కనిపించడమే కారణం.
తెలుగు రాష్ట్రాల సంపదను ప్రధాని-అదానీ దోపిడి చేస్తున్నారన్న కేటీఆర్..
విశాఖ స్టీల్ ప్లాంట్ బతకాలన్న.. తెలంగాణలోని బయ్యారంలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు కావాలన్న బైలదిల్లా గని గౌతమ్ అదానీ కబంధ హస్తాల నుంచి బయటపడాలని కేటీఆర్ అన్నారు. బయ్యారం సమీపంలో బైలదిల్లా ఉందని.. అది 134 కోట్ల మెట్రిక్ టన్నుల ఐరన్ ఓర్ లభించే గని అని అన్నారు. బైలదిల్లా నుంచి 150 కి.మీ దూరంలో బయ్యారం ఉందని.. 600 కి.మీ దూరంలో విశాఖ ఉందని.. సమీపంలో ఉన్నవాటికి ఖనిజాన్ని తరలించడం సాధ్యం కాదని.. బైలదిల్లా నుంచి 1800 కి.మీ దూరంలో ఉన్న ముంద్రాకు తరలించడం మాత్రం ఏ విధంగా సాధ్యమవుతుందని ప్రశ్నించారు.
తెలుగు రాష్ట్రాల ప్రజలు ఈ విషయాన్ని గమనించాలని కోరారు. వైజాగ్ పొట్టగొడుతున్నది, బయ్యారంను ఎండపెడుతున్నది ప్రధాని- అదానీలు అని విమర్శించారు. ప్రధాని, అదానీ కలిసి తెలుగు రాష్ట్రాల సంపదను కొల్లగొడుతున్నారని ఆరోపించారు. తాను చెప్పిన మాట తప్పైతే పరువు నష్టం దావా వేసుకోవచ్చని అన్నారు. అదానీ ఆంధ్రప్రదేశ్‌లో ఏం చేస్తున్నారనేది అందరికి తెలుసని అన్నారు. కృష్ణపట్నం, గంగవరం పోర్టులు అదానీ గుంజుకున్నారని ఆరోపించారు.
బైలాదిల్లా కాంట్రాక్టును రద్దు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్నిడిమాండ్ చేశారు. అలా చేసి గనులను కేటాయిస్తే వైజాగ్ స్టీల్ ప్లాంట్ బతుకుందని.. బయ్యారం ఉక్కు పరిశ్రమ ఏర్పాటు అవుతుందని అన్నారు. ఏపీ ప్రభుత్వం ఏం చేస్తుందో తమకు అనవసరం అని.. తమ పోరాటం కేంద్రం మీదనేనని స్పష్టం చేశారు. ఈ విధమైన కామెంట్స్ ద్వారా ఏపీ ప్రభుత్వంపై కేటీఆర్ పరోక్షంగా విమర్శలు చేసినట్టుగా అయింది.
తెలంగాణలోని ఏపీ కార్మికులు ఇక్కడే ఓటు హక్కు తీసుకోండి.. హరీష్ రావు
మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణకు వచ్చి ఇక్కడి నిర్మాణ రంగంలో పనిచేస్తున్న వలస కార్మికులు ఇక్కడే (తెలంగాణలో) వారి ఓటు హక్కును వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. కార్మికుల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం పాటుపడుతోందని చెప్పారు. ఏపీ, తెలంగాణకు భూమి, ఆకాశానికి ఉన్నంత తేడా ఉందని కూడా అన్నారు. ‘‘ఏపీతో పోలిస్తే తెలంగాణలోని ఆసుపత్రులు, ఇతర ప్రాంతాల్లో రోడ్లు, సేవలు, ఇతర సౌకర్యాలు ఎలా ఉన్నాయో మీ అందరికీ బాగా తెలుసు’’ అని కూడా హరీష్ రావు కామెంట్ చేశారు.
బీఆర్ఎస్ ప్రభుత్వం చేపడుతున్న అనేక సంక్షేమ పథకాలను వినియోగించుకోవడానికి రెండు రాష్ట్రాల్లో ఓట్లు కాకుండా కేవలం తెలంగాణలోనే ఉండేలా చూసుకోవాలని సూచించారు. భవన నిర్మాణ రంగ కార్మికులకు మే 1న సీఎం కేసీఆర్ శుభవార్త ప్రకటిస్తారని తెలిపారు. అయితే హరీష్ రావు చేసిన కామెంట్స్ నెట్టింట తీవ్ర చర్చకు దారితీశాయి. హరీష్ రావు కామెంట్స్‌పై వైసీపీ కార్యకర్తలు, ఏపీ సీఎం జగన్ అభిమానులు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. మరోవైపు హరీష్ రావు కామెంట్స్‌కు మద్దతుగా బీఆర్ఎస్ శ్రేణులు పోస్టులు పెడుతున్నారు. గతంలో విశాఖ ఉక్కు కోసం తెలంగాణ ప్రాంతం కూడా పోరాటాలు జరిగాయని గుర్తుచేస్తున్నారు. ఈ క్రమంలోనే గతంలో ఏపీలో పరిస్థితులపై బీఆర్ఎస్ నేతలు చేసిన కామెంట్స్ కూడా మరోసారి తెరమీదకు వస్తున్నాయి.
వ్యుహాత్మకమేనా..?
అయితే వైసీపీ-బీఆర్ఎస్‌ల మధ్య ఎలాంటి గ్యాప్ లేదని కొందరు చెబుతున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల సీఎంల మధ్య సత్సబంధాలే ఉన్నాయని అంటున్నారు. గతంలో గోదావరి వరదలు, పోలవరం, ఏపీలో రోడ్లు.. ఇలా పలు విషయాల్లో కొద్ది రోజుల పాటు రెండు పార్టీల మధ్య కొద్దిరోజుల పాటు విమర్శలు కొనసాగాయని గుర్తుచేస్తున్నారు. ఇది కూడా కొంతకాలం మాత్రమే ఉంటుందని వారు అంచనా వేస్తున్నారు. వైసీపీ-బీఆర్ఎస్ పార్టీలు అవగాహనతోనే ఈ ప్రణాళికలు అమలు చేస్తున్నాయనే అనుమానాలు కూడా వ్యక్తం చేస్తున్నారు. ఏపీలో బీఆర్ఎస్ విస్తరణలో భాగంగానే కేసీఆర్.. ఈ అస్త్రాన్ని బయటకు తీశారని.. ఇది రెండు పార్టీల మైండ్ గేమ్ అని విమర్శిస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రస్తుత పరిణామాలు భవిష్యత్తులో ఏ మలుపు తీసుకుంటాయనే ఆసక్తి తెలుగు రాష్ట్రాల ప్రజల్లో నెలకొంది.
