Asianet News TeluguAsianet News Telugu

జనం పిచ్చోళ్లా! లేక జగన్ వాస్తవంలోకి రాలేకున్నారా! : ఎడిటర్స్ కామెంట్

ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న జనాభాలో ప్రతి నలుగురిలో ఒక్కరే జగన్ పార్టీకి సపోర్ట్ చేస్తుండగా, మిగతా ముగ్గురూ వైఎస్సార్ సీపీ పట్ల వ్యతిరేకంగానో లేక తటస్థంగానో ఉంటున్నారు.

Is Jagan Delusional? Analyzing YSRCP Politics: Flaws and Opposition"
Author
First Published Jul 5, 2024, 1:37 PM IST

జగన్‌కు అర్థం అవుతోందా? లేక తాను అనుకుంటున్నదే కరెక్ట్ అని భ్రమపడుతున్నారా? వైఎస్సార్ సీపీ నేతలు తమకు 40 శాతం ఓటింగ్ ఉందని, ఈ ఓటింగ్‌తోనే మోదీ ప్రధాని అయ్యారని, తాము ఘోరంగా ఓడిపోలేదని అంటున్నారు. కానీ, 40 శాతం మీకు ఉంటే, 60 శాతం మంది మిమ్మల్ని వ్యతిరేకించినట్లే కదా? ఈ రియలైజేషన్ ఈ పార్టీకి రావడం లేదు.
ఇంకొంత లోతుల్లోకి వెళ్తే, ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న జనాభాలో ప్రతి నలుగురిలో ఒక్కరే జగన్ పార్టీకి సపోర్ట్ చేస్తుండగా, మిగతా ముగ్గురూ వైఎస్సార్ సీపీ పట్ల వ్యతిరేకంగానో లేక తటస్థంగానో ఉంటున్నారు.

తాము ఘోరంగా ఓడిపోయామని జగన్ పార్టీ జీర్ణించుకోలేకపోతుందా? లేక తాము ఘోరంగా ఓడిపోలేదని భ్రమపడుతోందా అర్థం కావడం లేదు. 151 సీట్లు గెలిచిన జగన్, ప్రతి వర్గానికి లక్షల కోట్లు పంచినప్పుడు, 175 సీట్లలో 175 గెలవాలి కదా?  పోనీ కూటమి.. వ్యతిరేక ఓటు ఒకటవడం.. ఇతరత్రా కారణాలున్నా  కనీసం 75 అయినా వచ్చుండాలి కదా అవి కూడా రాలేదు.. అంటే ప్రజల్లో జగన్ పై అత్యంత తీవ్రంగా వ్యతిరేకత ఉన్నట్లే.  ఇది జగన్‌కి అర్థం చేసుకోలేని.. ఆయనకు అర్థం కాని అంశం.

జగన్ ఓటమికి బోలెడు కారణాలు

జగన్ ఎంత సేపటికీ ప్రజలు కూటమికి ఓటేసి మోసపోయారు.. వాళ్లు పిచ్చోళ్లన్న తీరులో మాట్లాడతున్నారు. కేవలం పది శాతం మంది మాత్రమే అటు మారడంతో కూటమి అధికారంలోకి వచ్చేసింది అంటున్నారు. ఈ మాటలు అనేందుకు ముందు జగన్ ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకోవాలి. ఎన్నికలకు కొద్ది రోజుల ముందు కొంత మంది ఎమ్మెల్యేలు పార్టీ మారారు.. తాను చేసిన సర్వేల్లోనూ కొంత మందిపై తీవ్ర వ్యతిరేకత ఉన్నట్లు అర్థమైంది. అందుకే చాలా మంది గెలిచిన చోటు నుంచి కాకుండా ఇతర ప్రాంతాల్లో టికెట్లు ఇచ్చారు. ఇక వైజాగ్‌ను రాజధానిగా ప్రకటించినా కూడా విజయసాయి రెడ్డి ని అక్కడి నుంచి గెలిపించుకలోని పరిస్థితి అని ముందే తెలుసు.. ఇంకా ఇంట్లో సోదరి.. తల్లి నుంచీ వ్యతిరేకత ఇన్ని కారణాలు కలిసి జనంలో జగన్ పై వ్యతిరేకత పెంచాయి. అది రియలైజ్ కాకుండా.. ఇద వరకటిలాగానే తాను అనుకున్నదే కరెక్ట్ అనుకుంటే.. వైసీపీ పార్టీకి, దాన్ని నమ్ముకున్నోళ్లకు తీవ్ర వేదన తప్ప మరోటి ఉండదు.

కొమ్మినేని శ్రీనివాసరావులో వచ్చిన రియలైజేషన్ కూడా జగన్‌లో లేదు

చివరకు జగన్‌కు బాగా వత్తాసు పలికిన సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు కూడా ఓ వ్యాసంలో జగన్ పార్టీ ఎలా మిస్ గైడ్ అయిందో, ఎక్కడ తప్పు జరిగిందో విశ్లేషిస్తూ వాస్తవంలోకి వచ్చారు. కానీ ఆ కొమ్మినెనిలో కనిపించిన రియలైజేషన్ జగన్‌లో కలగలేదు. ఘోర ఓటమి తర్వాత కూడా ఏపీ సిఎం జగన్‌మోహన్ రెడ్డి వైఖరిలో ఎలాంటి మార్పు కనిపించలేదు. ఐదేళ్ల పాటు ప్రజలకు, మీడియాకు, ప్రశ్నలకు దూరంగా గడిపారు. ఇప్పుడు కూడా అదే ధోరణిలో ఉన్నారు.

ఎన్నికల తర్వాత తొలిసారి ప్రజల్లోకి వచ్చిన జగన్ నెల్లూరు కేంద్ర కారాగారంలో రిమాండ్ ఖైదీగా ఉన్న మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లిని పరామర్శించారు. దాదాపు అరగంట పాటు ములాఖత్‌లో పిన్నెల్లితో మాట్లాడారు. ఆ తర్వాత బయటకు వచ్చి మీడియా ముందు తన ఆవేశం, అక్రోశాన్ని ప్రదర్శించారు.

ఈవీఎం పగులగొట్టినోడు సౌమ్యుడు.. శుద్ధపూస

పిన్నెల్లి ఈవీఎంను పగులగొట్టడం, సీసీటీవీ కెమెరాల్లో రికార్డవడం, పోలీసులు అరెస్టు చేయడం వంటి అన్ని పరిణామాలు జరిగిన తర్వాత కూడా పిన్నెల్లి చేసిన దాంట్లో తప్పు ఏమీ లేదు అని, ఆయన మంచోడు, సౌమ్యుడు, శుద్ధపూస అని జగన్ అంటుండటం ఆయన్ను తీవ్రంగా అభిమానించేవాళ్లలో కూడా కొందరికి అంతుబట్టడం లేదు. చంద్రబాబు ప్రభుత్వం కక్ష సాధింపులకు పాల్పడుతోందని, అందుకు మూల్యం చెల్లించుకుంటారని తీవ్ర స్థాయిలో జగన్ హెచ్చరించారు. కానీ, ఆయన తీరులో ఎలాంటి మార్పు కనిపించలేదు. తాను ఎవరి ప్రశ్నలకు జవాబు ఇవ్వాల్సిన అవసరం లేదనే ధోరణితోనే నెల్లూరు పర్యటన సాగింది.
 

ఇప్పటికైనా జనానికి జగన్ దగ్గరకావాలి

నెల్లూరు సెంట్రల్ జైలు వద్ద మీడియాతో మాట్లాడే క్రమంలో, కాగితం చూడకుండానే, తడబడకుండా తాను చెప్పాలనుకున్నది చెప్పారు. దాదాపు 15-20 నిమిషాల పాటు తన మనసులో ఉన్న భావాలను వ్యక్తం చేశారు. కానీ గత ఐదేళ్లలో ఏనాడు కాగితం లేకుండా మాట్లాడే సాహసం కూడా జగన్ చేయలేదు. అధికారంలోకి వచ్చిన తొలినాళ్లలో ఢిల్లీ పర్యటనలో ఓసారి, కోవిడ్ సమయంలో రెండు సార్లు మాత్రమే జగన్ అధికారంలో ఉండగా మీడియాతో నేరుగా మాట్లాడారు. మిగిలిన ప్రతి సారి కాగితాలు చూసి చదవడమో, ఎడిటింగ్ చేసిన వీడియోలను రిలీజ్ చేయడానికో పరిమితం అయ్యారు.

జనంతో పూర్తిగా సంబంధాలను కట్ చేసుకుని పాలన సాగించడం జగన్ ఓటమి కారణమైంది. ఎన్నికల ఫలితాల తర్వాత కూడా జగన్‌ను కలిసేందుకు అభిమానులు, నాయకులు, పార్టీ వర్గాలు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత తాడేపల్లి, పులివెందుల, బెంగళూరులో పెద్ద ఎత్తున అభిమానులు కలిసేందుకు వెళ్లినా ఎవరికి ముఖం కూడా చూపలేదు. బెంగుళూరు నుంచి తిరుగు ప్రయాణానికి ముందు స్వయంగా జగన్ చెప్పడంతోనే సందర్శకుల్ని అనుమతించినట్టు తెలుస్తోంది.

వినడం నేర్చుకోవాలనేది విమర్శకుల సలహా

ప్రశ్నలకు జవాబు చెప్పడం, ప్రశ్నను ఆహ్వానించడం అనేవి జగన్ పెద్దగా ఇష్టపడరు. రాజకీయాల్లోకి వచ్చిన తొలినాళ్ల నుంచి అదే ధోరణి జగన్‌లో ఉంది. మొదట్లో మీడియా తనకు వ్యతిరేకం కాబట్టి వారితో మాట్లాడాల్సిన అవసరం తనకు లేదని భావిస్తున్నట్టు సన్నిహితులు చెప్పేవారు. రాష్ట్ర విభజన తర్వాత ప్రతిపక్షంలో ఉన్నపుడు, గత ఐదేళ్లలో కూడా ఇదే తీరుతో జగన్ వ్యవహరించారు. ఆయన చెప్పేది అంతా వినాలని భావిస్తారే తప్ప, జనం ఏమనుకుంటున్నారో, జనం చెప్పేది వినాలని మాత్రం ఎప్పుడూ అనుకోలేదు.

ఆ భజన బృందాన్ని పక్కన పెట్టాలి

తాను తానుగా ప్రజల నుంచి పూర్తిగా దూరం జరిగిపోయారు. తాడేపల్లి నివాసంలో స్వీయ నిర్బంధం విధించుకుని అంతా అద్భుతంగా జరిగిపోతుందనే భావనలో ఐదేళ్లు గడిపేశారు. జనానికి తాను పూర్తిగా మేలు చేశానని చెప్పుకున్నారు, కానీ జనం పడుతున్న ఇబ్బందులు, లోపాలను గుర్తించే ప్రయత్నం చేయలేదు. ప్రత్యక్ష నగదు బదిలీ పథకాలు బ్రహ్మాండంగా పనిచేస్తాయి, ప్రజలకు మరేమి అవసరం లేదనే ధోరణితో జగన్ సాగారు. ఆయన చుట్టూ ఉన్న సలహాదారులు సైతం జగన్‌ మనసెరిగి ప్రవర్తించారు. తనకు నచ్చని విషయాన్ని స్వీకరించే అలవాటు

జగన్‌కు లేదని తెలుసుకుని లౌక్యం ప్రదర్శించారు...

ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయినా, చేసిన తప్పులను జగన్ గుర్తించలేక పోతున్నారు. ప్రభుత్వ డబ్బులతో సర్వేలు, నివేదికల పేరిట కోట్లాది రుపాయల సొమ్ము చేసుకున్న వాళ్లు ఎవరు ఇప్పుడు తాడేపల్లిలో కనిపించడం లేదు. ఇంకా జగన్‌ తన పక్కన ఉన్న భజన బృందం మాటల్ని గుడ్డిగా నమ్ముతూ జనంలోకి వచ్చి అసందర్భంగా మాట్లాడేస్తున్నారు.
వైసీపీ ప్రభుత్వం స్థానికంగా నియమించిన వలంటీర్ల వ్యవస్థ కూడా జగన్‌కు భారీ ఎత్తున వ్యతిరేకత పెంచిన అంశాల్లో ఒకటిగా మారింది. వలంటీర్లు ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరవేయడానికి ఒక వంతెనగా పనిచేయాలన్న ఉద్దేశ్యంతో ఏర్పాటు చేసినా, వాస్తవంలో వలంటీర్లు పలు ప్రాంతాల్లో జగన్‌కు అనుకూలంగా ఓట్లు వేయించడానికి యత్నించారు.
 

నువ్వు పెట్టిన వాలంటీర్లే నీ కొంప ముంచారు స్వామీ

వలంటీర్ల వ్యవస్థ ప్రారంభంలోనే మంచి నడవడికతో పని చేసినప్పటికీ, కాలక్రమేణా వాళ్ల ఆచరణ విధానం మారింది. వాలంటీర్లు తమ ప్రాధాన్యతను బలపరిచేందుకు స్థానికంగా తమ పక్షపాతం చూపించడం ప్రారంభించారు. వాలంటీర్లు జగన్ పార్టీకి మద్దతు లేకపోతే పథకాలు, డబ్బులు రావు అని ప్రజలను బెదిరించడం వంటి చర్యలు చేపట్టారు. ఇతర పార్టీలు, అభ్యర్థులు వాలంటీర్లపై ప్రజలు తీసుకున్న ఈ అనుమానం జగన్ పట్ల వ్యతిరేకతగా మారింది. వాలంటీర్ల అహంకారం, పార్టీ కార్యకర్తల్లా ప్రవర్తించడం, ప్రభుత్వ పథకాలను సొమ్ము చేసుకోవడం వంటి చర్యలు జనంలో జగన్ పట్ల అసంతృప్తి పెంచాయి.
 

మళ్లీ గెలిపిస్తే మూడు రాజధానులు కడతారా ఏంటి?

మూడు రాజధానుల పిచ్చి నిర్ణయం అనేది దాదాపు జగన్ వ్యతిరేకులంతా అంగీకరిస్తున్న అంశం. కానీ ఓటమి తర్వాత కూడా వైసీపీకి అర్థం కావడం లేదు. రేపు మమ్మల్ని గెలిపిస్తే మళ్లీ మూడు రాజధానులను కడతాం అంటూ ఎన్నికలకు వెళ్తారేమో. ఇటీవల బొత్స వ్యాఖ్యలను పరిశీలిస్తే ఇదే అర్థం అవుతోంది. ప్రజలు ఇంత దారుణంగా 11 సీట్లకే పరిమితం చేసి ప్రతిపక్ష హోదాను కూడా అడుక్కొనే స్థాయికి తీసుకొచ్చినా, బొత్స ఇప్పటికీ మా స్టాండ్ మూడు రాజధానులే అంటున్నారు. ఇలాగైతే జగన్ ను నమ్మకున్న వైసీపీ క్యాడర్ పరిస్థితి ఏమిటో పై నున్న వైఎస్ రాజశేఖరరెడ్డికే తెలియాలి.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios