Asianet News TeluguAsianet News Telugu

జయప్రద జీవితాన్ని చంద్రబాబు నాశనం చేసాడా..? అసలేం జరిగింది ?

తెలుగు సినీ నటి జయప్రద జీవితాన్ని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు నాశనం చేసాడంటూ పోసాని కృష్ణమురళి సంచలన వ్యాఖ్యలు చేసారు. మరి జయప్రద చంద్రబాబు గురించి ఏమన్నారంటే...

is it Chandrababu destroyed Jayaprada political career ? AKP
Author
First Published Apr 12, 2024, 6:27 PM IST

అమరావతి : అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల వేళ ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాలు హాట్ హాట్ గా సాగుతున్నాయి. అధికార వైసిపి, ప్రతిపక్ష టిడిపి, జనసేన, బిజెపి కూటమి ప్రచార జోరు పెంచాయి...దీంతో మాటల తూటాలు పేలుతున్నాయి. ఈ క్రమంలోనే ప్రముఖ సినీనటి జయప్రద వ్యవహారం తెరపైకి వచ్చింది. టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు జయప్రద జీవితాన్ని నాశనం చేసాడంటూ  ఏపీ స్టేట్ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ పోసాని కృష్ణమురళి చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపుతున్నాయి. 

అయితే గతంలో జయప్రద కూడా ఓ ఇంటర్వ్యూలో చంద్రబాబు తనను ఎలా మోసం చేసింది వివరించారు. అలాగే తాను ఏపీ రాజకీయాలు వదిలి యూపీ పాలిటిక్స్ లోకి ఎలా వెళ్లింది... అక్కడ తన రాజకీయ ప్రస్థానం ఎలా సాగిందో వివరించారు. ఇలా ఓ సైకిల్ దిగి మరో సైకిల్ ఎక్కడానికి (టిడిపి నుండి సమాజ్ వాది పార్టీలోకి) చంద్రబాబే కారణమంటూ ఆసక్తికర విషయాలు బయటపెట్టారు జయప్రద. 

చంద్రబాబు నాయుడు అతిపెద్ద రాజకీయ సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న సమయంలో ఆయనకు  తాను మద్దతుగా నిలిచినట్లు జయప్రద తెలిపారు. తనను రాజకీయాల్లోకి తీసుకువచ్చిన నందమూరి తారక రామారావును కాదని ఆనాటి పరిస్థితులు తనను చంద్రబాబువైపు నడిపించాయని అన్నారు. అయితే 1995 లో చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాక తన సేవలను మరిచిపోయారు... టిడిపిలో తనకు తగిన గుర్తింపు దక్కలేదని జయప్రద తెలిపారు. అందువల్లే రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించిన తెలుగుదేశం పార్టీనే కాదు పుట్టిపెరిగిన ఆంధ్ర ప్రదేశ్ ను కూడా వదిలిపెట్టాల్సి వచ్చిందని జయప్రద ఆవేదన వ్యక్తం చేసారు.  

రాజకీయ నాయకులు పవర్ లో లేనపుడు ఎలా వుంటారో... అధికారం చేతికి వచ్చాక ఎలా మారిపోతారో తాను ప్రత్యక్షంగా చూసానని జయప్రద పేర్కొన్నారు. సినీ నటులను కేవలం తమ  ప్రచారం కోసమే వాడుకుంటారు... అధికారంలోకి రాగానే వారి సేవలను మరిచిపోతారని అన్నారు. చంద్రబాబు కూడా అలాగే చేసారు... అధికారాన్ని చేపట్టాక తనను పక్కనబెట్టారని అన్నారు. చంద్రబాబుకు తానేంటో చూపించాలనే ఉత్తర ప్రదేశ్ రాజకీయాల్లోకి వెళ్లానని... అక్కడ తనదైన స్టైల్లో నూతన రాజకీయ ప్రస్థానం ప్రారంభించినట్లు జయప్రద తెలిపారు. 

అసలు తనకు యూపీ రాజకీయాల్లో ఎవరూ తెలియదు... కాబట్టి బాలీవుడ్ స్టార్  అమితాబ్ బచ్చన్ సహాయం కోరినట్లు జయప్రద తెలిపారు.  ఆయన తనకు సన్నిహితుడైన అమర్ సింగ్ ను పరిచయం చేసారని... అప్పటినుండి ఆయన తన రాజకీయ గురువుగా మారిపోయారన్నారు. మొదట్లో తనను సొంత రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్ లోనే వుండాలని... చంద్రబాబుతో కలిసి పనిచేస్తే బావుంటుందని అమర్ సింగ్ సూచించేవారని అన్నారు. తాను మాత్రం తిరిగి వెనక్కి వెళ్లాలని అనుకోలేదు... యూపీ రాజకీయాల్లోనే కొనసాగాలని దృడనిశ్చయంతో వున్నట్లు జయప్రద వెల్లడించారు. 
 
సమాజ్ వాది పార్టీలో చేరే సమయంలో తాను తెలుగులో పెద్ద హీరోయిన్ ఆనాటి పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్ కి తెలియదని జయప్రద తెలిపారు. తెలుగమ్మాయివి... ఇక్కడ రాజకీయాల్లో ఎలా అని ఆయన సంశయించారన్నారు. కానీ ఎలాగోలా ఆయనను ఒప్పించి ఎస్పీలో చేరానని... ఆ తర్వాత తన రాజకీయ ప్రస్థానం అందరికీ తెలిసిందేనని జయప్రద వివరించారు. 

బిజెపిలో చేరిన  జయప్రద, అరెస్ట్ : 

టిడిపి నుండి ఎస్పీలో చేరిన జయప్రద ఆ తర్వాత బిజెపిలో చేరారు. రెండుసార్లు రాంపూర్ లోక్ సభ నుండి ఎంపీగా గెలిచిన ఆమె 2019 లో బిజెపి చేరారు. అయితే ఈ ఎన్నికల్లో తిరిగి రాంపూర్ నుండి పోటీచేసినా ఎస్పీ నేత ఆజంఖాన్ చేతిలో ఓడిపోయారు. ఈ ఎన్నికల్లోనే ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారంటూ రెండు కేసులు నమోదయ్యాయి. ఈ కేసుల విచారణకు హాజరుకాకపోవడంతో ఇటీవల ప్రజాప్రతినిధుల ప్రత్యేక కోర్టు జయప్రదపై అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. దీంతో పోలీసులు జయప్రదను అరెస్ట్ చేసారు. 

 
 


 
 

Follow Us:
Download App:
  • android
  • ios