Pawan Kalyan: పవన్ కళ్యాణ్‌ను సీఎం చేయాలని చంద్రబాబుకు అమిత్ షా షరతు? అందుకే పొత్తు ప్రకటనలో జాప్యం?
పవన్ కళ్యాణ్‌ను సీఎం చేయాలనే కండీషన్‌ను అమిత్ షా మొన్నటి మీటింగ్‌లో చంద్రబాబు ముందు ఉంచినట్టు ప్రచారం జరుగుతున్నది. ఇంకా చంద్రబాబు ఎటూ తేల్చుకోలేకపోతున్నారని, అందువల్లే కూటమిపై ప్రకటన వాయిదా పడుతున్నదని చెబుతున్నారు.
ఏపీలో ఇప్పుడు అభ్యర్థుల ఎంపికతోపాటు పొత్తులపైనా తీవ్ర ఆసక్తి నెలకొని ఉన్నది. పార్టీ అధినేతలు, ఆశావహులు, క్యాడర్‌తోపాటు సాధారణ ప్రజల్లోనూ ఉత్కంఠ ఉన్నది. ఈ పొత్తు చర్చల్లో గతవారమే ఓ కీలక అడుగు పడింది. టీడీపీ అధినేత చంద్రబాబుకు హస్తిన నుంచి పిలుపు వచ్చింది. కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో చంద్రబాబు నాయుడు భేటీ అయ్యారు. తర్వాత పవన్ కళ్యాణ్ కూడా ఢిల్లీకి వెళ్లి బీజేపీ పెద్దలతో సమావేశమయ్యారు. ఆ వెంటనే పొత్తు గురించి గ్రాండ్ అనౌన్స్‌మెంట్ ఉంటుందని అందరూ ఆశించారు. కానీ, రోజులు గడుస్తున్నా ప్రకటన మాత్రం రాలేదు. దీంతో ఆ భేటీపై రకరకాల ఊహాగానాలు మొదలయ్యాయి.
టీడీపీ, జనసేనతో కలిసి ఎన్నికల గోదాలోకి దిగడానికి బీజేపీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని, అయితే.. అసెంబ్లీ సీట్లు, లోక్ సీట్లను ఇంకా ఎక్కువగా బీజేపీ కోరుతున్నదనే చర్చ ఎక్కువగా జరిగింది. ఆ తర్వాత అమిత్ షా ఓ టీవీ ఇంటర్వ్యూలో లైవ్ డిబేట్‌లో ఎన్డీయేలోకి ఇంకా కొందరు మిత్రులు వస్తున్నారని చెప్పారు. అయితే.. ఏ పార్టీలు వస్తున్నాయనే విషయాన్ని వెల్లడించలేదు.
ఇక్కడా ఓ ఆసక్తికర చర్చే నడిచింది. చంద్రబాబు తర్వాత సీఎం జగన్ కూడా హస్తినకు వెళ్లి ప్రధాని మోడీని కలిశారు. ఆయన కూడా ఎన్డీయేలోకి రావడానికి సుముఖత వ్యక్తం చేశారని, అందుకే బీజేపీ ఇటు జనసేన - టీడీపీ కూటమిలోకి వెళ్లాలా? లేక వైసీపీతో బరిలోకి దిగాలా? అనే మీమాంసలో పడినట్టు ప్రచారం జరిగింది. జగన్ పర్యటన పొత్తుల కోసం కాదని, పెండింగ్ సమస్యలపై మాట్లాడటానికేనని వైసీపీ స్పష్టం చేసినా.. చర్చ మాత్రం జరిగింది.
Also Read: AP Congress: ఏపీలో కాంగ్రెస్‌కు గణనీయంగా పెరుగుతున్న మద్దతు? భారత్ జోడో యాత్రకు అత్యధిక డొనేషన్లు
టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి గురించి మీడియా సర్కిళ్లలో ఇప్పుడిప్పుడే మరో ప్రచారం మొదలైంది. టీడీపీ, జనసేన కూటమిలోకి చేరడానికి బీజేపీ ఓ కండీషన్ పెట్టిందని, ఒక వేళ టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అధికారంలోకి వస్తే ముఖ్యమంత్రిగా చంద్రబాబు, నారా లోకేశ్ కాకుండా పవన్ కళ్యాణ్‌ను చేయాలని ప్రతిపాదించిందని తెలుస్తున్నది. కూటమి ఎన్ని సీట్లు గెలిచినా పవన్ కళ్యాణ్‌నే సీఎం చేయాలని కండీషన్ అమిత్ షా చంద్రబాబు ముందు ఉంచినట్టు ప్రచారం జరుగుతున్నది. ఈ హామీ ఇస్తే కాపుల ఓట్లు అన్నీ గంపగుత్తగా కూటమికి పడుతాయని అమిత్ షా సూచించినట్టు చెబుతున్నారు.
అవసరమైతే సీఎం సీటు పంపకంపై టీడీపీ, జనసేనలు ఒక అగ్రీమెంట్‌కు వచ్చినా తమకేమీ అభ్యంతరం లేదని, మొదటి ఆరు నెలలు పవన్ కళ్యాణ్.. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు, నారా లోకేశ్ సీఎంగా బాధ్యతలు తీసుకున్నా సమ్మతమేనని, బీజేపీ అధికారంలో వాటాను కోరదని అమిత్ షా పేర్కొన్నట్టు తెలిసింది.
Also Read: Evil: ఏపీలోని ఆ గ్రామంలో భయానక అదృశ్య శక్తి? తెల్లార్లు మెలకువతోనే యువత కాపలా.. అసలేం జరుగుతున్నది?
ఈ కండీషన్ పై చంద్రబాబు నాయుడు ఎటూ తేల్చుకోలేకున్నాడని తెలుస్తున్నది. ఈ షరతుకు అంగీకరించకుంటే పవన్ కళ్యాణ్‌ను దూరం చేసినట్టు అవుతుందని, అంగీకరిస్తే టీడీపీ నష్టపోయే ముప్పు ఉన్నదని చంద్రబాబు ఆలోచిస్తున్నారని ప్రచారం అవుతున్నది.