ప్రకాశం జిల్లాలో దారుణం జరిగింది... ఇంటర్ విద్యార్థినిపై తొమ్మిది మంది సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. గిద్దలూరుకు చెందిన ఓ బాలిక స్థానిక ప్రైవేట్ జూనియర్ కాలేజీలో ఇంటర్మీడియట్ చదువుతోంది. అయితే ఆమెకు మానసిక ఎదుగుదల లేకపోవడాన్ని గుర్తించిన సురేంద్ర అనే మాజీ సైనికోద్యోగి కన్ను బాలికపై పడింది.

రోజూ కాలేజీకి వచ్చి వెళ్లే బాలికకు మాయమాటలు చెప్పి పరిచయం పెంచుకున్నాడు. ఆ తర్వాత నెమ్మదిగా ఆమెకు మద్యం కూడా అలవాటు చేశాడు. తన మాయలో పూర్తిగా పడింది అన్న నమ్మకం కుదిరాక ఓ రోజు బర్త్‌డే పార్టీ ఉందని తన ఇంటికి పిలిపించి.. బాలికకు ఫుల్లుగా మద్యం తాగించాడు.

అనంతరం మరో ఎనిమిది మందితో కలిసి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ సంఘటన తర్వాత బాలిక ఎవరితోనూ కలవకుండా ఒంటరిగా ఉండటంతో అనుమానం వచ్చిన తల్లిదండ్రులు ప్రశ్నించడంతో ఆమె అసలు విషయం చెప్పింది.

దీనిపై వారు పోలీసులకు సమాచారం అందించడంతో సురేంద్రతో పాటు మరికొందరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. బాలికకు జరిపిన వైద్య పరీక్షలో సామూహిక అత్యాచారం జరిగినట్లు నిర్థారణ కావడంతో పోలీసులు మిగిలిన వారి కోసం కూడా గాలిస్తున్నారు. అయితే బాధితురాలి మానసిక పరిస్థితి తెలుసుకున్న మరికొందరు కూడా ఆమెకు మాయమాటలు చెప్పి లైంగికదాడి జరిపినట్లుగా తెలిసింది.