Asianet News TeluguAsianet News Telugu

చంద్రగిరిలో వైసీపీ నుంచి చెవిరెడ్డి .. మరి టీడీపీ అభ్యర్ధి ఎవరు, ‘‘డాలర్’’ గట్టి ప్రయత్నాలు..?

చంద్రగిరి రాజకీయం రసవత్తరంగా మారింది. ఇక్కడ టీడీపీ గెలిచి దశాబ్ధాలు గడుస్తోంది. చంద్రగిరిలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తనయుడు చెవిరెడ్డి మోహిత్ రెడ్డిలకు ఛాన్స్ ఇచ్చారు జగన్. తెలుగుదేశం తరపున చంద్రగిరి టికెట్ తనకు కేటాయించాలని రియల్టర్ డాలర్స్ దివాకర్ రెడ్డి కోరుతున్నారు. 

interesting politics in chandragiri tdp ksp
Author
First Published Jan 6, 2024, 2:53 PM IST

వైసీపీ అధినేత, ఏపీ సీఎం వైఎస్ జగన్ వచ్చే ఎన్నికలకు సంబంధించి మంచి దూకుడు మీదున్నారు. గెలుపు గుర్రాలకే టికెట్లు కేటాయిస్తానని చెప్పిన ఆయన, తెలంగాణ ఫలితాలను దృష్టిలో పెట్టుకుని రాజీపడే ప్రశ్నే లేదంటున్నారు. తనకు అత్యంత సన్నిహితులు, మిత్రులు, బంధువులైనా సరే పార్టీ కోసం పక్కనపెట్టేశారు. ఈసారి అత్యంత వ్యూహాత్మకంగా వారసులకు ప్రాధాన్యత కలించారు సీఎం వైఎస్ జగన్. సీనియర్ నేతలు పేర్ని నాని కుమారుడు పేర్ని కిట్టు, భూమన కరుణాకర్ రెడ్డి కుమారుడు భూమన అభినయ్ రెడ్డి, చంద్రగిరిలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తనయుడు చెవిరెడ్డి మోహిత్ రెడ్డిలకు ఛాన్స్ ఇచ్చారు జగన్. 

ఈ నేపథ్యంలో చంద్రగిరి రాజకీయం రసవత్తరంగా మారింది. ఇక్కడ టీడీపీ గెలిచి దశాబ్ధాలు గడుస్తోంది. స్వయంగా అధినేత చంద్రబాబు నాయుడు పుట్టిన నియోజకవర్గం కావడంతో ఈ స్థానానికి ఎప్పుడూ ప్రాధాన్యత వుంటుంది. 1978లో చంద్రగిరి నుంచే కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధిగా తొలిసారిగా ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు చంద్రబాబు. ఆ తర్వాత 1983లో టీడీపీ ఆవిర్భవించినప్పటికీ.. బాబు కాంగ్రెస్ అభ్యర్ధిగానే పోటీ చేసి ఓటమి పాలయ్యారు. దీంతో చంద్రబాబు తన కార్యక్షేత్రాన్ని కుప్పంకు మార్చారు. అయితే చంద్రగిరి కాంగ్రెస్‌కు కంచుకోటగా మారింది. మాజీ మంత్రి గల్లా అరుణ కుమారి కాంగ్రెస్ నుంచి నాలుగు సార్లు విజయం సాధించారు. 

రాష్ట్ర విభజన తర్వాత కూడా టీడీపీకి అదృష్టం కలిసి రాలేదు. 2014, 2019లలో వైసీపీ నుంచి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి విజయం సాధించారు. 2014లో గల్లా అరుణను, 2019లో పులవర్తి నానిలపై చెవిరెడ్డి గెలిచారు. ఈసారి ఎన్నికల్లోనూ పులివర్తి నానికే టికెట్ కేటాయించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆయనే ఇప్పుడు చంద్రగిరి టీడీపీ ఇన్‌ఛార్జ్‌గా కొనసాగుతున్నారు. అయితే చంద్రగిరి టికెట్ తనకు కేటాయించాలని రియల్టర్ డాలర్స్ దివాకర్ రెడ్డి కోరుతున్నారు.

ఈయన స్వస్థలం తిరుపతి రూరల్ మండలంలోని పెరుమాళ్లపల్లి. ఎంబీఏ, పీహెచ్‌డీ చేసిన ఉన్నత విద్యావంతుడు దివాకర్ రెడ్డి. మెగాస్టార్ చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీ నుంచి తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించిన ఆయన అప్పట్లో యువరాజ్యం చిత్తూరు జిల్లా అధ్యక్షుడిగా కొనసాగారు. ఆ సమయంలోనే చంద్రగిరి టికెట్ కోసం తీవ్రంగా ప్రయత్నించినప్పటికీ .. ఆ పార్టీ కాంగ్రెస్లో విలీనం కావడంతో దివాకర్ రెడ్డి రాజకీయాలకు దూరంగా వుంటున్నారు. 

తిరుపతి రూరల్ మండలంలో దివాకర్ రెడ్డి బలం, బలగం దండిగా వున్నాయి. తిరుపతి, చంద్రగిరి, శ్రీకాళహస్తి పరిధిలో వెంచర్లు వేసి జోరుగా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్న ఆయన సామాజిక సేవలోనూ ముందున్నారు. క్రీడాకారులు, పేద విద్యార్ధులకు ఆర్ధిక సాయం, పేదలకు వైద్య సాయం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మరోసారి రాజకీయాల్లో యాక్టీవ్ కావాలని భావిస్తున్న ఆయన ఇటీవల చంద్రబాబు, లోకేష్‌లను కలిసినట్లుగా చంద్రగిరి ప్రాంతంలో గుసగుసలు వినిపిస్తున్నాయి.  ఈ నియోజకవర్గంలో రెడ్లతో పాటు కమ్మ, బలిజ సామాజిక వర్గాల ఆధిపత్యం ఎక్కువ. దీనికి తోడు భారీగా వున్న అనుచరగణం సాయంతో తాను గెలుస్తానని దివాకర్ రెడ్డి ధీమా వ్యక్తం చేస్తున్నారు. 

అంతా బాగానే  వుంది కానీ.. ఇక్కడ పులివర్తి నాని చురుగ్గా వున్నారు. గడిచిన నాలుగున్నరేళ్లుగా టీడీపీ కార్యక్రమాలు, పోరాటాలు నిర్వహిస్తున్నారు. ఆయన కూడా టికెట్‌పై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. మరి నానిని కాదని దివాకర్ రెడ్డికి టికెట్ వస్తుందా.. ఒకవేళ డాలర్‌కు టికెట్ ఇస్తే.. నానిని ఎలా డీల్ చేస్తారనేది తెలియాల్సి వుంది. 
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios