ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఈ రోజు ప్రారంభమయ్యాయి. అధికార ప్రతిపక్ష పార్టీలు ఒకరిపై మరొకరు విమర్శల దాడి చేసుకుంటున్నారు. కాగా.. ఏపీ అసెంబ్లీ లాబీల్లో గురువారం ఓ ఆసక్తికర సన్నివేశం ఎదురైంది. ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న, బీజేపీ ఎమ్మెల్సీ సోమువీర్రాజుల మధ్య ఆసక్తికర సంభాషణ జరిగింది.

‘అన్నా..ఇక టీడీపీని విమర్శించింది చాలు.. ఇక అధికార పక్షాన్ని కడిగేయండి’ అని బుద్దా వెంకన్న.. సోము వీర్రాజుతో అన్నారు. ఇందుకు స్పందించిన సోము.. ‘దానికి ఇంకా సమయం ఉంది.. వైసీపీని కూడా వదిలి పెట్టం’ అని అన్నారు. వీరిద్దరి మధ్య జరిగిన సంభాషణను విన్న తోటి శాసన మండలి సభ్యులు ఒకింత నవ్వుకున్నారు. కాగా.. గతంలో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు సోమువీర్రాజు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించడమే కాదు.. టీడీపీ అధినేత చంద్రబాబుపై సైతం పలుమార్లు సంచలన వ్యాఖ్యలు  చేసిన విషయం విదితమే.