అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కేశినేని నాని అలక ఎపిసోడ్ ఒక ఇంట్రెస్టింగ్ సీన్ అయితే మరో ఇంట్రెస్టింగ్ సీన్ ప్రజావేదిక నీదా నాదా అన్న అంశం. ఉండవల్లిలో ఉన్న  ప్రజావేదికపై తెలుగుదేశం పార్టీ, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీల మధ్య ఆసక్తికర ఎపిసోడ్ నడుస్తోంది. 

ఉండవల్లిలోని పార్టీ కార్యక్రమాలకు ఉపయోగించుకునేందుకు ప్రజావేదికను తమకే కేటాయించాలని ఏపీ సీఎస్‌ ఎల్వీసుబ్రమణ్యంను వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోరింది. వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం ప్రజావేదిక తమకే కేటాయించాలంటూ సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యంకు లేఖ రాశారు. 

ఇకపోతే ఇదే అంశంపై ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డికి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు లేఖసైతం రాశారు. ప్రజావేదికను ప్రతిపక్ష నేతకు కేటాయించాలని  చంద్రబాబు లేఖలో కోరారు. తమ నివాసానికి అనుబంధంగా ఉన్న ప్రజావేదికను టీడీపీ కార్యాకలాపాల కోసం కేటాయించాలని లేఖలో విజ్ఞప్తి చేశారు. 

చంద్రబాబు లేఖకు కౌంటర్ గా వైసీపీ సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యంకు లేఖ రాసింది. పార్టీ-ప్రభుత్వం మధ్య సమన్వయం కోసం కార్యక్రమాలకు ప్రజావేదిక అనువుగా ఉంటుందని తలశిల రఘురాం లేఖలో స్పష్టం చేశారు. 

ప్రజావేదికలో నిర్వహించే సమావేశాలకు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ  అధ్యక్షుని హోదాలో సీఎం జగన్‌ హాజరవుతారని ఆయన తెలిపారు. సీఎం భద్రత, ట్రాఫిక్‌కు ఇబ్బంది లేకుండా ప్రజావేదిక అనువుగా ఉంటుందని రఘురాం లేఖలో పేర్కొన్నారు. 

సీఎం భద్రతను దృష్టిలో ఉంచుకొని ప్రజావేదికను తమ పార్టీకి కేటాయించాలని సీఎస్‌కు విజ్ఞప్తి చేశారు. అంతేకాకుండా ప్రజావేదిక అక్రమకట్టడమని అధికారులు నిర్దారిస్తే తక్షణం ఖాళీ చేసి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నట్లు కూడా రఘురాం ప్రకటించారు. ప్రజావేదిక తమ కంటే తమకే కావాలని అటు అధికార పార్టీ ఇటు ప్రతిపక్ష పార్టీలు పోటీ పడుతుండటంతో సీఎస్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో అన్న దానిపై ఆసక్తి నెలకొంది.