విజయవాడ: ఆగష్టు 15 వచ్చిందంటే చాలు దేశమంతా మువ్వన్నెల జెండా రెపరెపలాడుతోంది. ప్రతీ భారతీయుడు ఆ త్రివర్ణపతాకానికి సెల్యూట్ చేస్తూ తమ దేశభక్తిని చాటుకుంటూ ఉంటారు. దేశం మనదే, జాతీ మనదే, ఎగురుతున్న జెండా మనదే అంటూ ప్రతి భారతీయుడు గర్వంగా పాట పాడుకుంటూ ఉంటారు. 

అంతటి గొప్ప మువ్వన్నెల జెండాను రూపొందించింది తెలుగువాడే కావడం విశేషం. కృష్ణా జిల్లాకు చెందిన పింగళి వెంకయ్య జాతీయ జెండాను రూపొందించారు. ఆగష్టు పదిహేను మువ్వన్నెల జెండాను ఎగురవేస్తూ యావత్ భారతావని త్రివర్ణపతాక సృష్టికర్త అయిన పింగళి వెంకయ్యకు నిరాజనం పలుకుతోంది.  

తెలుగువారి ముద్దు బిడ్డ అయిన పింగళి వెంకయ్య కృష్ణా జిల్లా మెువ్వ మండలం భట్లమెనుమర్రు గ్రామంలో జన్మించారు. ఆనాడు జాతిపిత మహాత్మగాంధీజితో కలిసి స్వాతంత్య్రోద్యమంలో కీలక పాత్ర పోషించారు. 

భారతదేశ కార్యాలయాలపై బ్రిటీష్‌ ప్రభుత్వ జెండాలు ఎగురవేయడంపై కలత చెందిన పింగళి వెంకయ్య భారతదేశానికి ఒక జాతీయ జెండా ఉండాలని ఆశించారు. భారతదేశం కార్యాలయాలపై బ్రిటీష్ జెండాలు ఎగురుతుండటంపై ఆయన మనోవేదన చెందారు. భారతీయుకులు ఒక జాతీయ జెండా ఉండాలని పరితపించారు. 

అయితే 1921లో విజ‌య‌వాడలో జ‌రిగిన అఖిల భార‌త జాతీయ కాంగ్రెస్ మ‌హాస‌భ‌ల్లో పాల్గొన్న జాతిపిత మహాత్మగాంధీ సైతం జాతీయ జెండాపై ఆలోచించారు. జాతీయ జెండాను రూపొందించాలంటూ పింగ‌ళి వెంక‌య్యకు బాధ్యతలు అప్పగించారు. 

అప్పటికే జాతీయ జెండాను రూపొందించాలనే దృఢ సంకల్పంతో ఉన్న పింగళి వెంకయ్య గాంధీజీ ఆదేశాలతో జెండా రూపకల్పన చేశారు. అదే నేటి భారతదేశపు జాతీయ జెండా కావడం విశేషం. 

స్వాతంత్ర్య ఉద్యమానికి సారథ్యం వహిస్తున్న ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీకి పింగళి వెంకయ్య రూపొందించిన జాతీయ పతాకాన్ని చూపించారు. దేశంలో రెండు ప్రధాన మతస్తులైన హిందువులు, ముస్లింలకు గుర్తుగా ఎరుపు, ఆకుపచ్చ రంగులు ఉన్నాయి. అందులో చరకాను చేర్చాల్సిందిగా లాలా హన్స్ రాజ్ సోంధీ సూచించారు. 

మరోవైపు ఎరుపు, ఆకుపచ్చ రంగులకు తోడు మిగిలిన మతాల వారికి గుర్తుగా తెలుపు రంగును చేర్చాలని మహాత్మగాంధీజీ పింగళి వెంకయ్యకు సూచించారు. 1931లో ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ జెండాకు ఆమోద యోగ్యం తెలిపింది. అనంతరం పింగళి వెంకయ్య రూపొందించిన త్రివర్ణపతాకం స్వాతంత్ర్య ఉద్యమంలో ఒక ప్రత్యేక పాత్ర పోషించిందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.  

ఇకపోతే పింగళి వెంకయ్య రూపొందించిన జాతీయ జెండాకు హైదరాబాద్ కు చెందిన సురయ్యా తయాబ్జీ అనే మహిళ కీలక సూచనలు చేసినట్లు చెప్పుకుంటూ ఉంటారు. తయాబ్జీ భర్త బద్రుద్దీన్ ఫయాజ్ తయాబ్జి 1947లో ప్రధానమంత్రి కార్యాలయంలో ఐపీఎస్ అధికారిగా పనిచేసేవారు. 

అయితే 1931లో ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ ఆమోదించిన త్రివర్ణపతాకం మధ్యలోని చరఖా స్థానంలో అశోక చక్రం ఉండాలని ఆయన సూచించినట్లు ట్రైవర్ రాయల్ తన పుస్తకంలో ద లాస్ట్ డేస్ ఆఫ్ ద రాజ్ లో తెలియజేశారు.  

బద్రుద్దీన్ ఫయాజ్ తయాబ్జి ఆదేశాలతో ఆయన భార్య సురయ్యా తయాబ్జీ అశోక చక్రంతో కూడిన జాతీయ పతాకం నమూనాను తయారు చేశారు. 1947 ఆగస్టు 15న తొలి ప్రధానమంత్రి జవహర్‌లాల్ నెహ్రూ ఆ జెండాను తన కారు మీద ఉపయోగించారని చరిత్ర చెప్తోంది.