Asianet News TeluguAsianet News Telugu

సంగం బ్యారేజ్, నెల్లూరు బ్యారేజ్‌ ల ప్రాముఖ్యత ఏంటంటే...(వీడియో)

మేకపాటి గౌతమ్‌రెడ్డి సంగం బ్యారేజీ, నెల్లూరు బ్యారేజీ నిర్మాణాలు సాకారమయ్యాయి. మంగళవారం మేకపాటి గౌతమ్‌ రెడ్డి సంగం బ్యారేజీ, నెల్లూరు బ్యారేజీలను సీఎం వైయస్‌.జగన్‌ జాతికి అంకితం చేయనున్నారు. ఈ సందర్భంగా వీటి గురించి కొన్ని వివరాలు... 

Importance of Sangam Barrage and Nellore Barrage in andhrapradesh, details here
Author
First Published Sep 5, 2022, 1:39 PM IST

అమరావతి : దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డి హయాంలో జలయజ్ఞంలో భాగంగా సంగం బ్యారేజ్, నెల్లూరు బ్యారేజ్‌  పనులు ప్రారంభించారు. దీంతో సింహపురి వాసుల ఆశలు ఊపిరిపోసుకున్నాయి. అయితే అనుకోకుండా మహానేత హఠాన్మరణంతో బ్యారేజీ పనులు నిలిచిపోయాయి. ఆ తరువాత అధికారంలోకి వచ్చిన నేతలు, ప్రభుత్వాలు ఈ పనులను పట్టించుకోలేదు. వైయస్‌.జగన్‌ అధికారంలోకి రాగానే ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే సంగం, నెల్లూరు బ్యారేజీ పనులను అత్యంత ప్రాధాన్యతగా చేపట్టారు. ఒకవైపు కరోనా కష్టకాలం, మరోవైపు పెన్నానది వరద ఉధృతి వంటి ప్రతికూల పరిస్థితుల్లోనూ ప్రాజెక్టుల నిర్మాణంపనులు ఆగకుండా పూర్తిచేశారు. దీంతో రేపు జాతికి అంకితం చేయనున్నారు.

2020, మార్చి నుంచి 2021 ఆఖరుదాకా కరోనా మహమ్మారి విజృంభించింది. గతంలో ఎన్నడూ లేని రీతిలో 2019–20, 2020–21, 2021–22లో పెన్నానది ఉప్పొంగి ప్రవహించింది. ఓ వైపు కరోనా మహమ్మారి తీవ్రత.. మరో వైపు పెన్నా వరద ఉద్ధతితో పోటీ పడుతూ సంగం బ్యారేజ్‌ పనులను సీఎం వైఎస్‌ జగన్‌ పరుగులు లెత్తించారు. బ్యారేజ్‌ 85 ఫియర్లను 43 మీటర్లకు ఎత్తుతో పూర్తి చేయించారు. ఈ ఫియర్స్‌ మధ్య 12 మీటర్లు ఎత్తు, 2.8 మీటర్ల వెడల్పుతో 79 గేట్లు, కోతకుగురై వచ్చిన మట్టిని దిగువకు పంపడానికి 12 మీటర్లు ఎత్తు, 3.8 మీటర్ల వెడల్పుతో 6 గేట్లు(స్కవర్‌ స్లూయిజ్‌)ను బిగించారు. వరద ప్రవాహం వచ్చినప్పుడు దిగువకు విడుదల చేయడానికి వీలుగా గేట్లను ఎత్తడానికి దించడానికి విద్యుత్‌తో పనిచేసే హాయిస్ట్‌ వ్యవస్థను ఏర్పాటు చేశారు.

బ్యారేజ్‌కు ఎగువన ఎడమ వైపున 3.17 కిమీల, బ్యారేజ్‌కు కుడి వైపున 3 కిమీల పొడవున కరకట్టలను పటిష్ఠవంతం చేశారు. సంగం నుంచి పొదలకూరుకు రాకపోకలు సాగించడానికి వీలుగా బ్యారేజ్‌పై రెండు వరుసల రోడ్‌ బ్రిడ్జిని  పూర్తి చేశారు. కనిగిరి, కావలి కాలువలకు సంయుక్తంగా నీటిని సరఫరా చేసే రెగ్యులేటర్, కనుపూరు కాలువకు నీటిని సరఫరా చేసే రెగ్యులేటర్‌లను పూర్తి చేశారు. ఈ పనులకు రూ.131.12 కోట్లను ఖర్చు చేసి, పూర్తి చేసి.. నెల్లూరు ప్రజ ల దశాబ్దాల స్వప్నాన్ని సీఎం వైఎస్‌ జగన్‌ సాకారం చేశారు. 

Importance of Sangam Barrage and Nellore Barrage in andhrapradesh, details here

దివంగత మంత్రి మేకపాటి గౌతమ్‌ రెడ్డి స్మారకార్ధం ఈ ప్రాజెక్టుకు మేకపాటి గౌతమ్‌ రెడ్డి సంగం బ్యారేజ్‌గా నామకరణం చేసి... ఈనెల 6న బ్యారేజ్‌ను జాతికి అంకితం చేయనున్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా పెన్నా డెల్టాలోని 2.47 లక్షలు, కనుపూరు కాలువ కింద 63 వేలు, కావలి కాలువ కింద 75 వేలు వెరసి 3.85 లక్షల ఎకరాల ఆయకట్టుకు సమద్ధిగా నీళ్లందించడానికి మార్గం సుగమం చేశారు. పెన్నా వరదలను సమర్థవంతంగా నియంత్రించి. ముంపు ముప్పు నుంచి నెల్లూరు జిల్లా ప్రజలను తప్పించడానికి ఈ బ్యారేజ్‌ దోహదపడుతుంది. బ్యారేజ్‌లో 0.45 టీఎంసీలను నిల్వ చేయడంతో పరిసర ప్రాంతాల్లో భూగర్భజలాలు పెరగడం వల్ల తాగునీటి ఇబ్బందులు తీరనున్నాయి. మేకపాటి గౌతమ్‌రెడ్డి బ్యారేజ్‌ కమ్‌ బ్రిడ్జిని పూర్తి చేయడం ద్వారా సంగం, పొదలకూరు మండలాల మధ్య రాకపోకల సమస్యను సీఎం వైఎస్‌ జగన్‌ శాశ్వతంగా పరిష్కరించారు.

ప్రారంభానికి సిద్ధమైన మరో ప్రాజెక్టు – నెల్లూరు బ్యారేజ్‌ 

నెల్లూరు నగరానికి సమీపంలో పెన్నా నదిపై 1854–55లో 481.89 మీటర్ల వెడల్పుతో ఆనకట్టను నిర్మించిన బ్రిటీష్‌ సర్కార్‌ అరకొరగా ఆయకట్టుకు నీళ్లందిస్తూ వచ్చింది. పెన్నా నదికి 1862లో వచ్చిన భారీ వరదలకు ఆనకట్ట దెబ్బతినడంతో 621.79 మీటర్ల వెడల్పుతో 0.7 మీటర్ల ఎత్తుతో కొత్త ఆనకట్టను నిర్మించింది. కానీ.. ఆనకట్టలో పూడిక పేరుకుపోవడం, శిథిలమవడంతో ఆయకట్టుకు నీళ్లందించడం 1904 నాటికే సవాల్‌గా మారింది. నెల్లూరు నగరం తాగునీటితో తల్లడిల్లుతూ వచ్చింది. ఈ ఆనకట్టకు దిగువన ఉన్న రోడ్డు ద్వారా నెల్లూరు–కోవూరు మధ్య రాకపోకలు సాగించేవారు. పెన్నా నదికి కాస్త వరద వచ్చినా నెల్లూరు–కోవూరుల మధ్య రాకపోకలు స్తంభించిపోయేవి. 

Importance of Sangam Barrage and Nellore Barrage in andhrapradesh, details here

ఆనకట్ట వల్ల వరద వెనక్కి ఎగదన్ని నెల్లూరు నగరాన్ని ముంచెత్తేది. ఈ సమస్యలను శాశ్వతంగా పరిష్కరించడానికి ఆనకట్ట స్థానంలో బ్యారేజ్‌ కమ్‌ రోడ్‌ బ్రిడ్జిని నిర్మించాలనే డిమాండ్‌ 1904 నుంచి నెల్లూరు జిల్లా ప్రజలు చేస్తూ వచ్చారు. కానీ.. 2004 వరకూ ఆ డిమాండ్‌ను ఎవరూ పట్టించుకోలేదు. దివంగత మహానేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి జలయఙ్ఞంలో భాగంగా నెల్లూరు బ్యారేజ్‌ కమ్‌ రోడ్‌ బ్రిడ్జి నిర్మాణాన్ని రూ.147.20 కోట్లతో 2008, ఏప్రిల్‌ 24న చేపట్టారు. మహానేత వైఎస్‌ హయాంలో నెల్లూరు బ్యారేజ్‌ పనులు పరుగులెత్తాయి. రూ.86.62 కోట్లను ఈ బ్యారేజ్‌ పనుల కోసం ఖర్చు చేశారు. మహానేత వైఎస్‌ హఠన్మరణం నెల్లూరు బ్యారేజ్‌కు శాపంగా మారింది. 

జలయఙ్ఞంలో భాగంగా దివంగత ముఖ్యమంత్రి, మహానేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి చేపట్టిన నెల్లూరు బ్యారేజ్‌ పనులను ఆయన తనయుడు, సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పూర్తి చేశారు. ఈ బ్యారేజ్‌ను ఈనెల 6న జాతికి అంకితం చేయనున్నారు. బ్యారేజ్‌ ద్వారా సర్వేపల్లి, జాఫర్‌ సాహెబ్‌ కాలువల కింద సర్వేపల్లి, కోవూరు, నెల్లూరు రూరల్‌ నియోజకవర్గాల పరిధిలోని ముత్తుకూరు, టీపీ గూడురు, వెంకటాచలం, ఇందుకూరుపేట, నెల్లూరు మండలాల్లో 77 గ్రామాల్లో 99,525 ఎకరాల ఆయకట్టుకు సమృద్దిగా నీటిని సరఫరా చేయడానికి సీఎం వైఎస్‌ జగన్‌ మార్గం సుగమం చేశారు.

ఈ బ్యారేజ్‌ను పూర్తి చేసి, 0.4 టీఎంసీలను నిత్యం నిల్వ చేయడం ద్వారా నెల్లూరు నగరంతోపాటు 77 గ్రామాల్లో తాగునీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరించారు. ఈ బ్యారేజ్‌ను పూర్తి చేయడం ద్వారా సమర్థవంతంగా వరదను నియంత్రించి.. నెల్లూరుతోపాటు బ్యారేజ్‌ దిగువన ఉన్న గ్రామాలకు ముంపు ముప్పు బారి నుంచి తప్పించారు. నెల్లూరు బ్యారేజ్‌ కమ్‌ రెండు వరసల రోడ్డు బ్రిడ్జిని పూర్తి చేయడం ద్వారా నెల్లూరు–కోవూరుల మధ్య రవాణా సమస్యను సీఎం వైఎస్‌ జగన్‌ శాశ్వతంగా పరిష్కరించారు.

ముఖ్యమంత్రిగా వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బాధ్యతలు స్వీకరించాక నెల్లూరు బ్యారేజ్‌ను ప్రాధాన్యతగా చేపట్టి.. యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని జలవనరుల శాఖ అధికారులను ఆదేశించారు. 2020, మార్చి నుంచి 2021 ఆఖరుదాకా కరోనా మహమ్మారితో పనులకు తీవ్ర ఆటంకం ఏర్పడింది. 
–2019–20, 2020–21, 2021–22లో వరుసగా భారీ వరదలు వచ్చాయి. నెల్లూరు బ్యారేజ్‌ నుంచి 2019–20లో 45.52, 2020–21లో 301.52, 2021–22లో 373.52 టీఎంసీల వరద జలాలు సముద్రంలో కలిశాయంటే పెన్నా నది  ఏ స్థాయిలో ఉగ్రరూపం దాల్చిందో అంచనా వేసుకోవచ్చు. 

ఈ తీవ్ర ప్రతికూలతల్లోనూ బ్యారేజ్‌లో రెండు మీటర్ల మందంతో 57 పియర్లను ప్రభుత్వం పూర్తి చేసింది. 57 పియర్ల మధ్య పది మీటర్ల ఎత్తు, మూడు మీటర్ల వెడల్పుతో 43 గేట్లు, కోతకు గురై వచ్చిన మట్టిని దిగువకు పంపడానికి పది మీటర్ల ఎత్తు, 4.3 మీటర్ల వెడల్పుతో 8 గేట్లు(స్కవర్‌ స్లూయిజ్‌ గేట్లు) వెరసి 51 గేట్లను ఏర్పాటుచేసింది. వరద వచ్చినప్పుడు దిగువకు విడుదల చేయడానికి, వరద తగ్గాక నీటిని నిల్వ చేయడం కోసం గేట్లను ఎత్తడానికి దించడానికి వీలుగా ఎలక్ట్రిక్‌ విధానంలో హాయిస్ట్‌ను ఏర్పాటుచేసింది. బ్యారేజ్‌కు 22 మీటర్ల ఎత్తులో 1.2 మీటర్ల మందం, 7.5 మీటర్ల వెడల్పు రెండు వరుసల రోడ్‌ బ్రిడ్జిని నిర్మించారు. సర్వేపల్లి, జాఫర్‌ సాహెబ్‌ కాలువలకు నీటిని సరఫరా చేసే రెగ్యులేటర్‌ను పూర్తి చేశారు. ఈ బ్యారేజ్‌లో 0.4 టీఎంసీలను నిల్వ చేయడానికి వీలుగా బ్యారేజ్‌కు కుడి, ఎడమ వైపున కరకట్టలను పటిష్ఠవంతం చేశారు. ఈ పనులకు రూ.77.37 కోట్లను ఖర్చు చేశారు.

Follow Us:
Download App:
  • android
  • ios