విజయవాడ:  కృష్ణాజిల్లా జి.కొండూరు మండలంలోని హెచ్.ముత్యాలంపాడు గ్రామంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. వివాహేతర సంబంధం పెట్టుకున్న వ్యక్తినే ఓ మహిళ హత్యాయత్నానికి పాల్పడింది. విరహవేదన భరించలేకే సదరు మహిళ ఈ దారుణానికి పాల్పడినట్లు  తెలుస్తోంది. 

ఈ ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. ముత్యాలంపాడు గ్రామానికి చెందిన నానాది జాన్సీరాణి అనే వివాహిత కలహాల కారణంగా భర్తకు దూరంగా వుంటోంది. ఒంటరిగా వుంటున్న ఈమె అదే గ్రామానికి చెందిన వీసం కోటేశ్వరరావు అనే వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఇలా గత సంవత్సరం కాలంగా  వీరిద్దరి మధ్య  అక్రమ సంబంధం సాగుతోంది. 

అయితే ఈ వ్యవహారం గురించి కోటేశ్వరరావు కుటుంబసభ్యులకు తెలియడంతో అతన్ని మందలించారు. దీంతో కొద్దిరోజులుగా అతడు జాన్సీరాణికి దూరంగా  వుంటున్నాడు. దీన్ని తట్టుకోలేకపోయిన ఆమె అతడిపై హత్యాయత్నానికి పాల్పడినట్లు సమాచారం. తీవ్రంగా కాలిన గాయాలతో ప్రస్తుతం కోటేశ్వరరావు విజయవాడ హెల్ప్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నాడు.

కోటేశ్వరరావును ఎలాగోలా తన ఇంటికి రప్పించుకున్న ఆమె అప్పటికే సిద్దంగా వుంచుకుని పెట్రోల్ ను అతడిపై పోసి నిప్పంటించింది. దీంతో అతడి శరీరం దాదాపు 70శాతం కాలిపోయింది. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను దర్యాప్తు పూర్తయిన అనంతరం వెల్లడిస్తామని జి.కొండూరు ఎస్ఐ రాంబాబు తెలిపారు.