విశాఖపట్నం: తమ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంగీకరిస్తే పది మంది తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు వైఎస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరడానికి సిద్ధంగా ఉన్నారని ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస రావు అన్నారు. నలుగురు రాజ్యసభ సభ్యులు బిజెపిలో చేరిన విషయాన్ని గుర్తు చేస్తూ జగన్ అంగీకరిస్తే 10 మంది టీడీపీ ఎమ్మెల్యేలు వైసిపిలో చేరుతారని ఆయన అన్నారు. 

తన ఇంటిని కూల్చివేయాలనే కుట్రలో భాగంగానే కృష్ణా నది వరదలను కృత్రిమంగా సృష్టించారని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు చేసిన విమర్శలను ఆయన ఖండించారు. కృత్రిమ వరదలనే కొత్త పదాన్ని చంద్రబాబు సృష్టించారని ఆయన ఎద్దేవా చేశారు. 

వరదలను కృత్రిమంగా సృష్టించే విద్య చంద్రబాబుకు తెలిసి ఉంటే వర్షాలు లేని విశాఖపట్నం, విజయనగరం జిల్లాల్లో సృష్టించాలని కోరుతున్నట్లు ఆయన వ్యాఖ్యానించారు. ఆంధ్రప్రదేశ్ రాజధానిని అమరావతి నుంచి తరలిస్తామనే మాట మంత్రి బొత్స సత్యనారాయణ అనలేదని ఆయన స్పష్టం చేశారు. 

ఇతర ప్రాంతాలతో పోల్చుకుంటే అమరావతి నిర్మాణం వ్యయంతో కూడుకున్నదని, వరద ముంపు పొంచి ఉంటుంది కాబట్టి నిర్మాణానికి అధిక వ్యయం అవుతుందని బొత్స అన్నట్లు ఆయన వివరించారు. 

చంద్రబాబును ఇబ్బందులకు గురిచేయడానికి జగన్ తన అధికారాన్ని వాడుతున్నారనే బిజెపి ఎంపీ సుజనా చౌదరి విమర్శలపై ఆయన స్పందించారు. సుజనా చౌదరి ఎల్లవేళలా చంద్రబాబుకు మద్దతు పలుకుతారని ఆయన అన్నారు.