అమరావతి: ఐఎఎస్ అధికారి శ్రీలక్ష్మికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ప్రమోషన్ లభించింది. ఇటీవల ఆమె పురపాలక శాఖ కార్యదర్శిగా పదవీబాధ్యతలు చేపట్టారు కార్యదర్శి ర్యాంక్ నుంచి ముఖ్య కార్యదర్శిగా ఆమెకు రాష్ట్ర ప్రభుత్వం ప్రమోషన్ ఇచ్చింది. 

శ్రీలక్ష్మి మీద ఉన్న పెండింగ్ కేసుల తీర్పులు, డీవోపీటీ నిర్ణయం మేరకు అమలు జరుగుతుందని, తుది తీర్పులకు లోబడే ఉత్తర్వుల కొనసాగింపు ఉంటుందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి తెలిపారు. 

శ్రీలక్ష్మి ఇటీవల తెలంగాణ ప్రభుత్వం నుంచి రిలీవై ఏపీ కేడర్ లో చేరారు. డిప్యుటేషన్ మీద ఆమె తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్ కు రావాలని ఆమె తొలుత భావించారు. అయితే, ఆ ప్రయత్నాలు ఫలించలేదు. దాంతో ఆమె తన కేడర్ ను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మార్పించుకున్నారు. 

క్యాట్ ఆదేశాల మేరకు ఆమెను తెలంగాణ ప్రభుత్వం రివీల్ చేసింది. ఇటీవల ఆమె అమరావతిలోని జీఎడీలో రిపోర్టు చేశారు శ్రీలక్ష్మి డిప్యుటేషన్ మీద తెలంగాణ నుంచి ఏపీకి రావడానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కూడా సుముఖత వ్యక్తం చేశారు. 

కార్యదర్శి, ఆపై స్థాయి అధికారులను డిప్యుటేషన్ మీద ఇతర రాష్ట్రాలకు పంపించడం కుదరదని చెబుతూ శ్రీలక్ష్మి డిప్యుటేషన్ కు కేంద్ర ప్రభుత్వం అంగీకరించలేదు. దీంతో తన కేడర్ ను మార్చాలని కోరుతూ శ్రీలక్ష్మి ఈ ఏడాది ఫిబ్రవరిలో క్యాట్ ను ఆశ్రయించారు.