అన్నింటికి సిద్దంగానే ఉన్నా: వివేకా హత్యపై వైఎస్ భాస్కర్ రెడ్డి
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ విచారణకు వైఎస్ భాస్కర్ రెడ్డి ఇవాళ హాజరయ్యారు. ఈ విషయమై ఆయన మీడియాతో మాట్లాడారు.
కడప: మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసును పక్కదారి పట్టించొద్దని వైఎస్ భాస్కర్ రెడ్డి సీబీఐ అధికారులను కోరారు.ఆదివారంనాడు కడపలో సీబీఐ విచారణకు ఆయన హాజరయ్యారు. విచారణకు హాజరైన తర్వాత భాస్కర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. వైఎస్ హత్య జరిగిన రోజున పులివెందులలో లభ్యమైన లెటర్ పై విచారణ జరిపించాలని ఆయన కోరారు.
తాను అన్నింటికి సిద్దంగానే ఉన్నానని వైఎస్ భాస్కర్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ కేసును విచారించే విచారణ అధికారి లేనందున మళ్లీ నోటీసులు ఇవ్వనున్నట్టుగా అధికారులు చెప్పారన్నారు. ఈ కేసు పరిష్కారం కావాలంటే వివేకా ఇంట్లో లభ్యమైన లేఖను పరిశీలించాలని ఆయన కోరారు. ఎన్ని దర్యాప్తు సంస్థలు ఈ కేసును విచారించినా పరిష్కారం కావాలంటే ఆ లేఖ ఆధారంగా పరిశోధన చేయాలని ఆయన చేతులు జోడించి ప్రార్ధించారు.
సీబీఐ అధికారులు ఇచ్చిన నోటీసు మేరకు తన ఆరోగ్యం సహకరించకపోయినా కూడా విచారణకు హాజరైనట్టుగా వైఎస్ భాస్కర్ రెడ్డి చెప్పారు. ఈ కేసుకు సంబంధించిన విషయాలను వైఎస్ అవినాష్ రెడ్డి మీడియాకు చెప్పిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.ఈ కేసు విషయమై తాను కొత్తగా చెప్పదల్చుకున్నది ఏమీ లేదని ఆయన పేర్కొన్నారు. సీబీఐ అధికారులు అరెస్ట్ చేస్తారనే ప్రచారంపై మీడియా ప్రతినిధి ప్రశ్నకు ఆయన స్పందించారు. అరెస్ట్ చేస్తే చేసుకోనివ్వండన్నారు. తాను అన్నింటికి సిద్దంగానే ఉన్నానని ఆయన పేర్కొన్నారు.
.