గుంటూరు: గుంటూరు లోక్ సభ గెలుపు వివాదం  రగులుతూనే ఉంది. గుంటూరు టీడీపీ అభ్యర్థి గల్లా జయదేవ్ గెలుపుపై కోర్టుకు వెళ్తున్నట్లు వైసీపీ ఎంపీ అభ్యర్థి మోదుగుల వేణుగోపాల్ రెడ్డి స్పష్టం చేశారు.  

అధికారుల తప్పిదం కారణంగానే తాను ఓటమిపాలయ్యానని చెప్పుకొచ్చారు. 9,700 పోస్టల్ బ్యాలెట్ఓట్లు లెక్కించలేదని అందువల్లే తాను ఓటమిపాలైనట్లు తెలిపారు. తాను ఓటమిని అంగీకరించడం లేదని 4,200 ఓట్లు వెనుకంజలో ఉన్నట్లు ఇప్పటికీ చెప్తానని తెలిపారు. 

శ్రీకాకుళం, గుంటూరు లోక్ సభ పరిధిలో పోస్టల్ బ్యాలెట్లలో జరిగిన అన్యాయంపై పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డితో చర్చించానని ఆ తర్వాత కోర్టుకు వెళ్తున్నట్లు స్పష్టం చేశారు. 9,500 ఓట్లను డిక్లరేషన్ కవర్ 13 బి మీద వేయాల్సి ఉండగా ఎన్నికల సిబ్బంది వేయకుండా ఉండటం వల్ల ఆ ఓట్లు లెక్కించలేదని తెలిపారు. 

గల్లా జయదేవ్ గెలిచినట్లు ఆర్వో ధృవీకరణ పత్రం ఇవ్వడం దురదృష్టకరమన్నారు. బుధవారం కోర్టును ఆశ్రయించనున్నట్లు తెలిపారు ఎంపీ అభ్యర్థి మోదుగుల వేణుగోపాల్ రెడ్డి.