ఒంగోలు: తాను పార్టీ మారాలనుకోవడం లేదని ప్రకాశం జిల్లా పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు స్పష్టం చేశారు. 

ఆదివారం నాడు మార్టూరు మండలం ఇసుకదర్శిలోని తన క్యాంపు కార్యాలయంలో సాంబశివరావు మీడియాతో మాట్లాడారు.  పార్టీ మార్పు విషయమై తాను ఎవరితో కూడ చర్చించలేదన్నారు.

also read:చంద్రబాబుకు షాక్: వైసీపీలోకి పర్చూరు ఎమ్మెల్యే సాంబశివ రావు

పార్టీ మారే ఉద్దేశ్యం కూడ తనకు లేదన్నారు. కొందరు ఉద్దేశ్యపూర్వకంగానే తనపై దుష్ప్రచారం చేస్తున్నారని ఆయన చెప్పారు. టీడీపీలోనే తాను కొనసాగుతానన్నారు.

పర్చూరు నియోజకవర్గ అభివృద్దికి కృషి చేస్తూ టీడీపీ కార్యకర్తలకు అండగా ఉంటానని ఆయన ప్రకటించారు. ఏలూరి సాంబశివరావు పార్టీ మారుతారని కొంత కాలంగా ప్రచారం సాగుతోంది. టీడీపీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు సైకిల్ దిగి ప్యాన్ కిందకు చేరుతారనే ప్రచారం వారం రోజులుగా సాగుతోంది.

రేపల్లే ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్, పర్చూరు ఎమ్మెల్యే సాంబశివరావులు పార్టీని వీడుతారని ప్రచారంలో ఉంది. మహానాడు కార్యక్రమానికి కూడ ఈ ఇద్దరు ఎమ్మెల్యేలు హాజరు కాలేదు. దీంతో పార్టీ మారుతారనే ప్రచారానికి ఊతమిచ్చినట్టైంది.మరో వైపు టీడీపీకి చెందిన కొందరు ఎమ్మెల్యేలకు వైసీపీ గాలం వేస్తోందని ప్రచారం సాగుతోంది.